తొలి రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ.. 50ప్రశ్నలు సంధించిన అధికారులు

- క్వాష్ పిటిషన్ తిరస్కరణపై సుప్రీంలో సవాల్
విధాత, రాజమహేంద్రవరం : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జైలులో ఉన్న చంద్రబాబును సీఐడీ రెండు రోజుల విచారణలో భాగంగా శనివారం తొలి రోజు విచారణ ప్రక్రియ ముగిసింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12మంది సభ్యుల బృందం చంద్రబాబును సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాలులో ఆరుగంటల పాటు విచారించారు. ఉదయం 9.30గంటలకు జైలుకు చేరిన అధికారులు 11.30విచారణ ప్రారంభించారు. సాయంత్రం 5గంటల వరకు రెండు విడతలుగా విచారణ చేశారు. 120ప్రశ్నలతో సిద్ధమైన సీఐడీ బృందం తొలి రోజు విచారణలో చంద్రబాబును 50ప్రశ్నలపై విచారించినట్లుగా తెలిసింది.
విచారణ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి కీలక ఆధారాలతో కూడిన 473పేజీల పత్రాలను సీఐడీ బాబు ముందు ఉంచింది. స్కిల్ డెవలప్ మెంటు ప్రాజెక్టును 3,300కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారని, సిమెన్స్ కంపనీకి తెలియకుండా ఆ కంపనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వేశారని తెలిసింది. కోర్టు నిబంధనలకు లోబడి విచారణకు ముందు, తర్వాతా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి గంటకు ఐదు నిమిషాల విరామం ఇచ్చారు.
చంద్రబాబు తరపున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో సీఐడీ బృందం విచారణ కొనసాగించింది. చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తు విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపధ్యంలో కోర్టు విధించిన షరతులను అనుసరించి సీఐడీ బృందం తమ తొలి రోజు విచారణ కొనసాగించింది. ఆదివారం రెండో రోజు కూడా విచారణ కొనసాగనుంది. విచారణ ప్రక్రియను వీడియోగ్రఫీ చేసి, సిల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించనున్నారు.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన రిమాండ్ ను రద్దు చేయాలని హైకోర్టులోదాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తు చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌ను ప్రత్యేకంగా విచారించాలని బాబు తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించనున్నారు.