Karnataka | కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే.. కీలక పదవి కోసం డీకే, సిద్ధరామయ్య పోటీ
కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. మోదీ ప్రచారాన్ని సైతం దీటుగా ఎదుర్కొని తిరుగులేని మెజార్టీ సాధించింది. అటు కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోతే.. పార్టీ ముఖ్యనాయకత్వం కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చల్లో నిమగ్నమైంది. నిజానికి కర్ణాటక ముఖ్యమంత్రి స్థానాన్ని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఆశిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్ని వివాదం చేయకుండా, తద్వారా పార్టీ విజయావకాశాలు దెబ్బతినకుండా ఇద్దరు నాయకులు వ్యవహరించినప్పటికీ.. ఘన విజయం తర్వాత […]

కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. మోదీ ప్రచారాన్ని సైతం దీటుగా ఎదుర్కొని తిరుగులేని మెజార్టీ సాధించింది. అటు కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోతే.. పార్టీ ముఖ్యనాయకత్వం కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చల్లో నిమగ్నమైంది. నిజానికి కర్ణాటక ముఖ్యమంత్రి స్థానాన్ని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఆశిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్ని వివాదం చేయకుండా, తద్వారా పార్టీ విజయావకాశాలు దెబ్బతినకుండా ఇద్దరు నాయకులు వ్యవహరించినప్పటికీ.. ఘన విజయం తర్వాత ముఖ్యమంత్రి స్థానం కోసం ఇద్దరు నేతలు పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. దీనిని పరిష్కరించడం కాంగ్రెస్‌కు కత్తిమీద సాములా మారనున్నది.
విధాత : హోరాహోరాగా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దక్షిణాదిలో బీజేపీకి ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక. అలాంటి చోట తిరుగులేని మెజార్టీతో కాంగ్రెస్ గెలవడం పార్టీ అధిష్ఠానానికి కూడా మంచి ఊపునిచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్న కాంగ్రెస్‌కు నైతిక బలాన్ని ఈ విజయం అందించిందనడంలో సందేహం లేదు. కడపటి వార్తలు అందే సమయానికి కాంగ్రెస్ 137 స్థానాల్లో, బీజేపీ 62 స్థానాల్లో, జేడీఎస్ 21 స్థానాల్లో విజయం సాధించి లేదా ఆధిక్యంలో ఉన్నాయి.
ఇప్పుడే అసలైన సమస్య
ఎన్నికల్లో గెలవడం అనే పెద్ద టాస్క్‌ను విజయవంతంగా ముగించిన కాంగ్రెస్.. ఇప్పుడు అంతకంటే మించిన టాస్క్‌ను తలకెత్తుకోనున్నది. అదే కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఎంపిక చేయాలా? లేక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలా? అనేది కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగానే మారనున్నది.
పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగ సామాజిక వర్గం ఓట్లను పార్టీకి మరల్చడంతోనే ఈ ఘన విజయం సాధ్యమైందని అంటున్న డీకే శివకుమార్ వర్గీయులు.. దీనికి ప్రధానంగా కృషి చేసింది తమ నాయకుడేనని చెబుతున్నారు. కనుక శివకుమార్‌కే సీఎం పీఠం దక్కాలని కోరుతున్నారు.
1999లో కూడా అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఎస్‌ఎం కృష్ణ ఒక్కలిగలలోకి పార్టీని తీసుకుపోవడం వల్లే విజయం సాధించారని, అందుకే అప్పుడు ఆయనకు సీఎం పదవి దక్కిందని గుర్తు చేస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్‌ఎస్‌యూఐ నుంచి ఎదిగి.. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన సుఖ్‌వీందర్‌సింగ్ సుఖు ముఖ్యమంత్రి అభ్యర్థి అవటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇదే క్రమంలో డీకే శివకుమార్ కూడా నాయకుడిగా ఎదిగారని గుర్తు చేస్తున్నారు. కనుక ముఖ్యమంత్రి పదవికి డీకే శివకుమార్ నూటికి నూరుపాళ్లు అర్హత కలిగి ఉన్నారని చెబుతున్నారు. డీకే శివకుమారే సీఎం కావాలని ఆయన తమ్ముడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ ఇప్పటికే డిమాండ్ చేశారు.
సిద్ధరామయ్య వర్గీయుల వాదనేమంటే..
సిద్ధరామయ్య సీనియర్ రాజకీయ నాయకుడని, పాలనా అనుభవం ఉండటమే కాకుండా.. క్లీన్ ఇమేజ్ కలిగిన నేత అని అంటున్న ఆయన వర్గీయులు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి పదవికి తగిన వ్యక్తి అని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల రీత్యా సిద్ధరామయ్య సీఎంగా ఉంటేనే మంచిదని ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. ‘కర్ణాటక ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం నుంచి బీజేపీని పూర్తిగా తరిమి కొట్టేందుకు ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాం. మా తండ్రి ముఖ్యమంత్రి కావాలి’ అని ఆయన అన్నారు.
ఇరువర్గాల వాదనలు ఎలా ఉన్నా.. తాము ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నామని అటు డీకే శివకుమార్, ఇటు సిద్ధరామయ్య ఇప్పటికే పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఇచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చానని డీకే చెప్పగా.. 2024 ఎన్నికలకు ఇది మొదటి అడుగు అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగానే సిద్ధరామయ్య పలు సభల్లో మాట్లాడుతూ ‘ఇవే నాకు చివరి ఎన్నికలు. నేను ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్ అవబోతున్నాను’ అని పదే పదే చెబుతూ వచ్చారు. తద్వారా తనకు ముఖ్యమంత్రిగా ఆఖరి అవకాశం ఇవ్వాలని చెప్పకనే కోరారు. ఇప్పటికైతే వీరిద్దరు తప్పించి మూడో నేత ఎవరూ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది.