Arunachal Pradesh | అరుణాచల్‌ చైనాలో భాగమట! అధికారికంగా చైనా తాజా మ్యాప్‌

అక్సాయి చిన్‌ కూడా వాళ్లదేనట తైవాన్‌, దక్షిణచైనా సముద్రాలు సైతం జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు వద్దు ఆతిథ్యం ఇవ్వడంపై పునరాలోచించండి కేంద్రానికి కాంగ్రెస్‌ ఎంపీ తివారి సూచన Arunachal Pradesh | బీజింగ్‌/న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనా మళ్లీ చైనా వివాదంలోకి తెచ్చింది. తాగా చైనా అధికారిక స్టాండర్డ్‌ మ్యాప్‌ను విడుదల చేస్తూ.. అందులో అరుణాచల్‌ ప్రదేశ్‌, 1962 యుద్ధంలో చైనా ఆక్రమించిన అక్సాయి చిన్‌ ప్రాంతాన్ని తన భూభాగం ప్రకటించుకున్నది. తైవాన్‌, వివాదాస్పద దక్షిణచైనా […]

  • By: Somu    latest    Aug 29, 2023 11:44 AM IST
Arunachal Pradesh | అరుణాచల్‌ చైనాలో భాగమట! అధికారికంగా చైనా తాజా మ్యాప్‌
  • అక్సాయి చిన్‌ కూడా వాళ్లదేనట
  • తైవాన్‌, దక్షిణచైనా సముద్రాలు సైతం
  • జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు వద్దు
  • ఆతిథ్యం ఇవ్వడంపై పునరాలోచించండి
  • కేంద్రానికి కాంగ్రెస్‌ ఎంపీ తివారి సూచన

Arunachal Pradesh | బీజింగ్‌/న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌ను చైనా మళ్లీ చైనా వివాదంలోకి తెచ్చింది. తాగా చైనా అధికారిక స్టాండర్డ్‌ మ్యాప్‌ను విడుదల చేస్తూ.. అందులో అరుణాచల్‌ ప్రదేశ్‌, 1962 యుద్ధంలో చైనా ఆక్రమించిన అక్సాయి చిన్‌ ప్రాంతాన్ని తన భూభాగం ప్రకటించుకున్నది. తైవాన్‌, వివాదాస్పద దక్షిణచైనా సముద్రాన్ని కూడా కొత్త మ్యాప్‌లో తన భౌగోళిక ప్రాంతంగా పేర్కొన్నది. ఈ మ్యాప్‌ను సర్వేయింగ్‌ అండ్‌ మ్యాపింగ్‌ పబ్లిసిటీ డే, నేషనల్‌ మ్యాపింగ్‌ అవేర్‌నెస్‌ పబ్లిసిటీ వీక్‌ను పురస్కరించుకుని సోమవారం విడుదల చేసింది.

అయితే.. చైనా చర్య దౌత్యపరంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది. ఏప్రిల్‌ నెలలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ తీసుకున్న నిర్ణయాన్ని భారత్‌ తిరస్కరించిన కొద్ది నెలలకు తాజా పరిణామం చోటుచేసుకున్నది. ‘ఇలాంటి ప్రయత్నాలు చేయడం చైనాకు ఇది మొదటిసారి కాదు. దీన్ని మేం విస్పష్టంగా తిరస్కరిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇ

ప్పటికీ ఎప్పటికీ అరుణాచల్‌ప్రదేశ్‌ భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరానిదని ఆయన అన్నారు. కొత్తగా పేర్లు కనిపెట్టి, వాటిని ఆయా ప్రాంతాలకు పెట్టే ప్రయత్నాలు వాస్తవాలను మార్చలేవని ఆయన స్పష్టం చేశారు. గతవారం జొహాన్నెస్‌బర్గ్‌లో నిర్వహించిన బ్రిక్స్‌ 15వ శిఖరాగ్ర సమావేశాలకు హాజరైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సీట్లలో కూర్చునే ముందు నేతలంతా కలిసి ఫొటో దిగేముందు చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు.

కాగా.. వారిద్దరి మధ్య ద్వైపాక్షిక సమావేశం చోటు చేసుకోలేదని విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా తెలిపారు. అయితే.. వాస్తవాధీన రేఖతోపాటు అపరిషృతంగా ఉన్న అంశాలపై భారతదేశ ఆందోళనను ఆయన నొక్కిచెప్పారని, ఉద్రిక్తతల నివారణకు, బలగాల మోహరింపు ఉపసంహరణ ముందే చేపట్టేందుకు కృషిచేద్దామని ఉభయ నేతలు నిర్ణయించారని తెలిపారు.

మూడేళ్లుగా ప్రతిష్టంభన

గత మూడేళ్లుగా భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్నది. ఉద్రిక్తతల కారణంగా అన్ని స్థాయిల్లో సంబంధాలు క్షీణించాయి. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు సమస్యలపై 2020 నుంచి 19 దఫాలుగా ఉభయపక్షాలు చర్చలు జరిపాయి.

జీ జిన్‌పింగ్‌ను జీ20కి పిలవొద్దు

చైనా కొత్త మ్యాప్‌ విడుదల చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో స్పందించింది. భారత భూభాగంలో రెండు వేల చదరపు కిలోమీటర్లను అన్యాయంగా ఆక్రమించిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం సబబేనా? అన్న అంశాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌తివారి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆక్రమణలను తొలగించాల్సిందేనని అన్నారు.

‘చైనా మ్యాప్‌ అసంబద్ధమైనదని చైనా-భారత్‌ సరిహద్దు వివాదం చరిత్రలోనే ఈ విషయం లేదని చెప్పారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ వారిదేనని చైనా చెప్పడానికి హక్కు లేదని స్పష్టంచేశారు. మరో పది రోజుల్లో చైనా అధ్యక్షుడు సహా 20 మంది దేశాధినేతలు ఢిల్లీలో నిర్వహించే జీ 20 సమావేశానికి రానున్న నేపత్యంలో తాజా పరిణామం చోటుచేసుకున్నది.

వచ్చే నెల 8 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్‌ మాక్రాన్‌, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌ వంటి వారు హాజరవుతున్నారు. దక్షిణచైనా సముద్రం తనదేనని చైనా ప్రకటించడంపై పొరుగుదేశాలు వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేసియా, బ్రునై, తైవాన్‌ అభ్యంతరం పెడుతున్నాయి.