చైనాలో పార్కింగ్ రోబో.. ఎంత‌టి ర‌ద్దీలోనైనా ఇట్టే పార్కింగ్‌!

చైనాలో పార్కింగ్ రోబో.. ఎంత‌టి ర‌ద్దీలోనైనా ఇట్టే పార్కింగ్‌!

పైగా.. నోపార్కింగ్ జోన్ ఫైన్‌లూ ఉండ‌వు

సాధార‌ణంగా ఏదైనా ర‌ద్దీ ప్రాంతాల్లో మ‌న కారును విధిలేక అక్క‌డే వ‌దిలి షాపింగ్ చేసుకుని వ‌చ్చేస‌రికి ఒక్కోసారి క‌నిపించ‌దు. ఏ పోలీస్ వాహ‌న‌మో దానిని టోయింగ్ ట్ర‌క్ ద్వారా అక్క‌డి నుంచి త‌ర‌లించేస్తుంది. కారు క‌న‌ప‌డ‌క ముందు కంగారుప‌డి.. ఆ త‌ర్వాత స‌మీప పోలీస్ స్టేష‌న్‌లు వెతుక్కోవాల్సిందే. రాంగ్ ప్లేస్‌లో పార్కింగ్ చేసినందుకు ఫైన్ క‌ట్టి.. కారును తెచ్చుకోవాల్సి వ‌స్తుంది. త‌ర‌లించే స‌మ‌యంలో కారుకు గీత‌లు ప‌డ్డా, సొట్ట‌లు ప‌డ్డా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. కానీ.. చైనాలో ఈ ఇబ్బందులు ఏమీ ఉండ‌వు. చైనా పోలీసులు రాంగ్ ప్లేస్‌లో పార్క్ చేసిన‌వారికి ఫైన్‌లు వేయ‌డం కాకుండా.. వారి కారును చ‌క్క‌గా పార్క్ చేయిస్తున్నార‌ట‌.


ఎలాగంటే.. ఒక వ్యాలెట్ రోబోను ఉప‌యోగించి. ప‌ద్ధ‌తేదో బాగుంది క‌దా! ఇంత‌కీ ఈ రోబో ఎలా ప‌నిచేస్తుందంటే.. రాంగ్ ప్లేస్‌లో పార్క్ చేసిన కారు కింద‌కు ఒక చ‌క్రాల రోబో వెళుతుంది. కారును కింద నుంచి అటాచ్ చేసుకుని.. అక్క‌డి నుంచి తిన్న‌గా పార్కింగ్ ప్లేస్‌లోకి వెళ్లి.. అక్క‌డ కారును దించుతుంది. అనంత‌రం దాని కింది నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది. ఈ రోబోను పోలీసులు రిమోట్‌తో ఆప‌రేట్ చేస్తారు. ఇలా రాంగ్ ప్లేస్ నుంచి రైట్ ప్లేస్‌కు కారును మార్చ‌తున్న వీడియో ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది. రాంగ్ ప్లేస్ నుంచి ఒక ఎస్‌యూవీని ఒక పోలీసు అధికారి గుర్తించి.. దానిని ఖాళీ ఉన్న పార్కింగ్ ప్ర‌దేశంలోకి తీసుకువెళ్ల‌డాన్ని ఆ వీడియోలో గ‌మ‌నించ‌వ‌చ్చు.


దీని వ‌ల్ల మాన‌వ జోక్యం లేకుండానే కారును పార్క్ చేయ‌వ‌చ్చ‌న్న‌మాట‌. వాహ‌న ర‌ద్దీ బాగా ఉండే న‌గ‌రాల్లో ఇది ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌ని నెటిజ‌న్లు అంటున్నారు. చైనాలోనే కాదు.. ఫ్రాన్స్‌లోని చార్ల్స్ డి గాల్ ఎయిర్‌పోర్టులో కూడా వ్యాలెట్ రోబో వ్య‌వ‌స్థ ఉన్న‌ది. రాంగ్ పార్కింగ్‌లో ఉన్న కార్ల‌ను ఎక్క‌డో పోలీస్ స్టేష‌న్‌కు తీసుకుపోవ‌డం కంటే ఇలాంటి ప‌ద్ధ‌తులు వాడితే అంద‌రికీ మంచిద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతంలో పార్కింగ్ పెద్ద స‌మ‌స్య‌ని, అటువంటి చోట్ల ఇది బాగా ప‌నికి వ‌స్తుంద‌ని చెబుతున్నారు.