మరగుజ్జులు మహాత్ములు కాలేరు : సీఎం కేసీఆర్
విధాత: కేంద్రంపై మరోసారి సీఎం కేసీఆర్ పరోక్షంగా నిప్పులు చెరిగారు. మహాత్మా గాంధీని విస్మరిస్తున్న నాయకులపై విమర్శలు గుప్పించారు. మరగుజ్జులు ఎప్పటికీ మహాత్ములు కాలేరని పేర్కొన్నారు. ముషీరాబాద్ గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటు కోసం తాను బయల్దేరినప్పుడు నన్ను ఎగతాళి చేశారు. నన్ను ఘోరంగా అవహేళన చేశారు. అటువంటి సమయంలో నేను ఒకసారి కండ్లు మూసుకొని గాంధీని తలుచుకునే […]

విధాత: కేంద్రంపై మరోసారి సీఎం కేసీఆర్ పరోక్షంగా నిప్పులు చెరిగారు. మహాత్మా గాంధీని విస్మరిస్తున్న నాయకులపై విమర్శలు గుప్పించారు. మరగుజ్జులు ఎప్పటికీ మహాత్ములు కాలేరని పేర్కొన్నారు. ముషీరాబాద్ గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ ఏర్పాటు కోసం తాను బయల్దేరినప్పుడు నన్ను ఎగతాళి చేశారు. నన్ను ఘోరంగా అవహేళన చేశారు. అటువంటి సమయంలో నేను ఒకసారి కండ్లు మూసుకొని గాంధీని తలుచుకునే వాడిని. ఆయన చూపిన ఆచరణలోనే తెలంగాణ సాధించుకున్నాం. అహింసా మార్గంలో ముందుకు పోతున్నాం. పారిశుద్ధ్యం కోసం శ్రమిస్తున్నాం. పల్లె, పట్టణ ప్రగతికి మహాత్మాగాంధీనే ప్రేరణ. గాంధీని స్మరించుకునే అవకాశం లభించినప్పుడు.. సమకాలిన వైరుధ్యాలను ఆలోచించాలి. కేసీఆర్ భిన్నంగా మాట్లాడుతున్నావు అని ఇటీవల కాలంలో చాలా మంది అడిగారు.
దేశం బాగుంటే, సమాజం బాగుంటేనే మనం సుఖవంతమైన జీవితం సాగిస్తాం. ఆస్తులు, అంతస్తులు ఉన్నా.. శాంతి లేకపోతే జీవితం ఆగమైతది. శాంతి విలసిల్లే భారత్‌లో మహాత్ముడిని కించపరిస్తున్నారు. సమాజాన్ని చీల్చేటటువంటి చిల్లర మల్లర శక్తులను చూసినప్పుడు.. బాధ కలుగుతుంది. హృదయం బాధపడుతుంది. వెకిలి వ్యక్తుల ప్రయత్నాల వల్ల మహాత్ముని ప్రభ తగ్గదు. మరగుజ్జులు ఎప్పటికీ మహాత్ములు కాలేరు. వెకిలిగానే చరిత్రలో మిగిలిపోతారు.
ఇదే రోజు అనుకోకుండా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ఈరోజే ఉన్నది. ఆయన కూడా గాంధీ శిష్యుడు. ఆయన ప్రేరణతో అనేక రంగాల్లో విజయం సాధించారు. ఈ దేశాన్ని రక్షించే వాడు జవాన్ అయితే.. అన్నం పెట్టేవాడు కిసాన్ అని జై జవాన్, జై కిసాన్ అని నినాదం ఇచ్చాడు. మౌనం పాటించకుండా చెడును ఖండించాలి. అప్పుడే ఈ సమాజానికి ఆరోగ్యం. శాస్త్రి ప్రవచించిన జై జవాన్ జై కిసాన్ నలిగిపోతున్నారు. దుర్మార్గమైన ప్రచారం జరుగుతుంది. అది శాశ్వతం కాదు. మేధావి లోకం ఖండించి ముందుకు పోవాలని కేసీఆర్ సూచించారు.