నన్ను గెలిపించండి బీఆర్ఎస్‌లో జాయిన్ అవుతా.. కాంగ్రెస్ ఝూటా మాటలపై కేసీఆర్ ఫైర్
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. నన్ను గెలిపిస్తే బీఆర్ఎస్‌లో జాయిన్ అవుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారట, అది ఝూటా ముచ్చట అని కేసీఆర్ స్పష్టం చేశారు.

మంచిర్యాల: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. నన్ను గెలిపిస్తే బీఆర్ఎస్‌లో జాయిన్ అవుతామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారట, అది ఝూటా ముచ్చట అని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెసోళ్లు మొదలు పెట్టిన కొత్త పద్ధతిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు.
మీ దగ్గర కాంగ్రెసాయన గెలిస్తే మీకు వాడకట్టుకో పేకాట కబ్ల్. మంచిర్యాల నిండా పేకాట క్లబ్బులు.. ఇక క్లబ్బులకు కొదవ ఉండదు. ఇండ్లు అమ్ముకోవాలి పేకాటలో పెట్టాలి. చాలా ప్రమాదం సుమా.. దెబ్బతింటరు. జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. ఇక కాంగ్రెస్ నాయకులు కొత్త పద్దతి మొదలుపెట్టారు. నన్ను గెలిపించండి నేను బీఆర్ఎస్‌లో జాయిన్ అవుతా అని అంటున్నరట. ఇక్కడ ఉన్నాయన కూడా అట్లనే చెప్తున్నడట.. నాకు వార్త వచ్చింది. అదేం లేదు. అదంతా అబద్దం, ఝూటా ముచ్చట. ఏదన్న లంగతనం చేసి గెలవాలనే బద్మాష్‌గిరి తప్ప అది వాస్తవం కాదు. మేం పదేండ్లు కష్టపడి అన్ని రంగాల్లో నంబర్‌వన్‌లో ఉన్నాం.
ఎల్లమ్మ కూడబెడితే మల్లమ్మ మాయం చేసిందనట్టు ఈ పదేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతది. దివాకర్ రావు గెలిస్తే మంచి లాభం జరుగుతది. దివాకర్ రావు నన్ను ఎప్పుడూ వ్యక్తిగత పనులు అడగలేదు. పొలాలకు నీళ్లు రావాలి. లిఫ్టులు కావాలని అడిగారు. గోదావరిపై కరకట్ట కట్టి మంచిర్యాలకు చుక్క వరద నీరు రాకుండా చేసే బాధ్యత నాది. ఆ పని కూడా చేస్తాం. అవసరమైతే ఈ ఎండాకాలంలో మొదలుపెట్టి శరవేగంగా పూర్తి చేయిస్తాం. దివాకర్ రావును గెలిపిస్తే మంచి జరుగుతది అని కేసీఆర్ తెలిపారు.