తెలంగాణను ముంచింది ఆంధ్రోళ్ల కంటే తెలంగాణ కాంగ్రెస్సే ఎక్కువ : సీఎం కేసీఆర్
తెలంగాణను ముంచింది ఆంధ్రోళ్ల కంటే తెలంగాణ కాంగ్రెస్సే ఎక్కువ ముంచింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు

జగిత్యాల: తెలంగాణను ముంచింది ఆంధ్రోళ్ల కంటే తెలంగాణ కాంగ్రెస్సే ఎక్కువ ముంచింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ తరుణంలో రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటుందో ఆలోచించి, ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. జగిత్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కు మద్దతుగా ప్రసంగించారు.
జగిత్యాల చైతన్యవంతమైనప్రాంతం. రాష్ట్రం ఎవరి చేతుల్లో సురక్షితంగా ఉంటుంది. అన్ని వర్గాలకు మేలు జరుగుతదనే విషయాన్ని చర్చించాలి. మనషుల గురించి ఆలోచించాలి. డంబాచారం చెప్పేటోడు, ఎవడు నిజం మాట్లాడేతోడు, నీతిమంతుడు ఎవడు అనే విషయాలు ఆలోచించాలి. అభ్యర్థుల గురించి కూడా ఆలోచన చేయాల్సిందే. అదే విధంగా అభ్యర్థుల వెనుకన్న పార్టీల చరిత్ర, నడవడిక గురించిఆలోచించాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఓటు వేస్తేనే భవిష్యత్ ఉంటుంది అని కేసీఆర్ తెలిపారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలన గురించి, 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనను బేరిజు వేసుకొని ఓటు వేయాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కరెంట్ లేదు. సాగు, మంచినీళ్లు లేవు. రైతులు ఉరిపోసుకుని సచ్చుడు. చేనేత కార్మికుల ఆకలి చావులు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితే ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్సే. 2004లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 2005, 2006లో తెలంగాణ ఇవ్వలేదు. మళ్లీ మోసం చేశారు. పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణరావు ఉండే. మీకు తెలుసు. మాతోనే మీరు గెలిచారు.
మీతోని మేం గెలిచామా..? దమ్ముంటే రుజువు చేయమని నాకు సవాల్ విసిరారు. నేను రాజీనామా చేశాను. దమ్ముంటే రా.. నువ్వు, మీ సంగతి, మా సంగతి తేలుతది రా అని ముఖాన కొట్టిన. ఆరోజు ఎంపీగా మళ్లీ పోటీ చేశాను. ఇదే జీవన్ రెడ్డి నా మీద సమైక్యవాదుల తరపున నా మీద పోటీ చేశారు. ఆ రోజు మీరంతా 2 లక్షల 50వేలమెజార్టీతో మళ్లీ నన్ను గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్నిఆకాశమంతా ఎత్తు లేపారు. ఆ పోరాటంలో మీరంతా పాత్రధారులే అని కేసీఆర్ పేర్కొన్నారు.
మీరు చరిత్ర చూడండి. తెలంగాణను ముంచింది ఆంధ్రా వాళ్ల కంటే తెలంగాణ కాంగ్రెస్సే ఎక్కువ ముంచింది. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలే 58 ఏండ్ల తెలంగాణ దుఃఖానికి ప్రధాన కారణం. ఇదంతా ప్రపంచానికి, ఇండియాకు తెలుసు. తెలంగాణ కాంగ్రెస్ గట్టిగా నిలబడి ఉంటే ఈ గతి, ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే. మీ దగ్గరనే ఉంది ఉదాహరణ. వరద కాల్వలో బురద కూడా లేకుండే. ఏమన్న వానకు నీళ్లు వస్తే మోటార్లు పెడితే అవి ఎత్తుకుపోయి పోలీసుస్టేషన్లలో పెట్టేవారు. వరద కాల్వకు నాలుగు తూములు పెట్టి కనీసం నీళ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ పాలనలనో తీగలు కోసి కాల్వల్లో పడేసేవారు అని కేసీఆర్ గుర్తు చేశారు.
ఆంధ్రోళ్లకు కాంగ్రెస్ నేతలే వంత పాడారు. కత్తి ఆంధ్రోనిదే కానీ పొడిచేటోడు మన తెలంగాణోడే అని ఉద్యమ స్పీచ్‌లో చెప్పాను. నిజంగా బాధతో చెప్తున్నాను ఈ మాట. తెలంగాణను ముంచింది ఈ నోరు మెదపని కాంగ్రెస్ నాయకుల చేతకాని తనమే. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజానీకాన్ని చాలా బాధ పెట్టింది. ఇవన్నీ మీరు ఆలోచించాలి. పార్టీల వైఖరి ఆలోచించాలి. అవకాశం వాదం తప్ప ఆరాటపడి తెలంగాణ కోసంపోరాటం చేయలేదు.
కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను ఏం చేసుకుంటావో చేస్కో అంటే ఒక్క తెలంగాణ ఎమ్మెల్యే మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రంలో భాగం కాదారా సన్నాసి అని తిరగబడ్డారా..? తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది. 24 గంటల కరెంట్ ఇచ్చింది. మంచినీళ్లు ఇచ్చింది. జగిత్యాల జిల్లాను చేసింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ రాష్ట్రానికి నిజమైనసిపాయిలు ఎవరో గుర్తించి ఓటువేయాలి. కులం, మతం పేరిట ఓట్లు వేయొద్దు. వీటికి అతీతంగా ప్రజల ప్రయోజనాల కేంద్ర బిందువుగా ఓట్లు వేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే.
గోదవారి పక్కనే ఉన్న మంచినీళ్లకు జగిత్యాల నోచుకోలేదు. ఇందిరమ్మ రాజ్యంలో జగిత్యాల కల్లోలిత ప్రాంతంగా డిక్లేర్ అయింది. యువకులను పిట్టల్లా కాల్చిచంపారు. పొద్దున లేస్తే నెత్తురు పారుడే కదా..? ఇందిరమ్మరాజ్యంలో దళితులు, గిరిజనులు రైతులు బాగుపడ్డారా..? వారిని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప.. అభివృద్ధి జరగలేదు. ఇందిరమ్మరాజ్యం నలుపేందో తెలుపేందో ప్రజలకు తెల్వదా..? ఇవన్నీ ఆలోచించాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు.