తెలంగాణ కేడీ కేసీఆర్‌

కేంద్రంలో ప్రధాని మోదీ, తెలంగాణ కేడీ కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటేనని, నాణేనికి మోదీ ఒక వైపు, కేసీఆర్ రెండో వైపు వంటివారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు

తెలంగాణ కేడీ కేసీఆర్‌
  • మోదీ, కేసీఆర్‌ నాణేనికి రెండు ముఖాలు
  • దేశ స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ ఎక్కడ?
  • దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు
  • ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీల అమలు
  • ఫిబ్రవరి నెలాఖరుకల్లా పూర్తిగా రైతు బంధు
  • బీఆరెస్‌ చేసిన విధ్వంసాన్ని సరిచేసే మేస్త్రీని
  • పార్లమెంటు ఎన్నికల్లో మోదీతోనే యుద్ధం..
  • గల్లీలో ఉన్న బిల్లారంగాలతో కాదు
  • పులి పట్టుకునేందుకు బోను రెడీ ఉంది
  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
  • కేసీఆర్‌ను చార్లెస్‌ శోభరాజ్‌తో పోల్చిన సీఎం


విధాత: కేంద్రంలో ప్రధాని మోదీ, తెలంగాణ కేడీ కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటేనని, నాణేనికి మోదీ ఒక వైపు, కేసీఆర్ రెండో వైపు వంటివారని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆరెస్‌ ఒకటో రెండో సీట్లు గెలిస్తే వాటిని కూడా మోదీకి కేసీఆర్‌ తాకట్టు పెడతారని విమర్శించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర ఏమిటో చెప్పాలని ఆ పార్టీ నాయకులను రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పారు. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికై 6 నెలలు కాక ముందే మంత్రి, కేంద్ర మంత్రి కావాలని అడిగే ఈ రోజుల్లో రాహుల్ గాంధీ ఏనాడూ తనను ప్రధానిని చేయాలని కోరలేదని అన్నారు.


తెలంగాణ ఇచ్చిన గాంధీ పార్టీని మనం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మోదీతోనే యుద్ధమని, గల్లీలో ఉన్న బిల్లారంగాలతో కాదని కేటీఆర్‌, హరీశ్‌రావును ఉద్దేశించి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ను ఒడించామని, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలిచి బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులను దాటిస్తామని స్పష్టం చేశారు. ‘బిల్లారంగాలు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. చార్లెస్ శోభరాజ్‌ (కేసీఆర్‌) ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. పులి బయటికి వస్తుందని కేటీఆర్‌ అన్నాడు కదా.. రమ్మని చెప్పండి బోను పట్టుకుని రెడీగా ఉన్నాం’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.


‘ఈ నెలాఖరుకు ఇంద్రవెల్లికి వస్తున్నా.. కాసుకోండి బిడ్డల్లారా.. 17 పార్లమెంట్ స్థానాల్లో నేను సభలు పెడుతా’ అని చెప్పారు. ప్రజలు బీఆరెస్‌ను ఊరికే ఓడగొట్టలేదని, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఆ పార్టీని ఓడగొట్టారని అన్నారు. బీఆరెస్‌ ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని, ఏ హామీనీ అమలు చేయని బీఆరెస్‌ నాయకులకు మమ్ములను అడిగే హక్కు లేదన్నారు. ‘ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల లోపు మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నాం. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశాం. ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తాం. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతు బంధు పూర్తిగా వేస్తాం’ అని చెప్పారు.

మీరు చేసిన విధ్వంసాన్ని సరి చేసే మేస్త్రీని


తాను మేస్త్రీనని చేసిన వ్యాఖ్యలను గేలి చేస్తున్న బీఆరెస్‌ నేతలకు ముఖ్యమంత్రి గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. ‘రేవంత్‌రెడ్డి నిజంగానే మేస్త్రీనే. మీరు చేసిన విధ్వంసాన్ని సరిచేసే మేస్త్రిని నేనే. మిమ్మల్ని 100 మీటర్ల లోతులో ఘోరీ కట్టే మేస్త్రినీ నేనే’ అని అన్నారు. కరోనా కాలంలో వేల కోట్లు దోచుకున్న పార్థసారథిరెడ్డిని, రవిచంద్రను, దామోదర్‌రావును రాజ్యసభ సభ్యులను చేశారని కేసీఆర్‌పై రేవంత్‌ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ చిన్న చిన్న కార్యకర్తలకు టికెట్‌లు ఇస్తే ఎమ్మేల్యేలు అయ్యారని, మరి కేసీఆర్‌ ఎవరికి టికెట్‌లు ఇచ్చారని నిలదీశారు. కాంగ్రెస్ ఒక దళితుడిని ఏఐసీసీ చీఫ్ చేసిందన్న రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌ ఎవరిని చేశారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలుకు ఇందిరమ్మ కమిటీలు వేస్తామని, అందులో బూత్ లెవల్ కమిటీ సభ్యులు ఉంటారని రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికలు అత్యంత కీలకమని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ను ఓడించామని, పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా తరమికొడుదామని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే బీఆరెస్ మిగలదు: డిప్యూటీ సీఎం భట్టి


బీఆరెస్ నాయకులు బట్టలు ఊడదీసి కొడతామంటే కాంగ్రెస్ కార్యకర్తలు చేతులు ముడుచుకొని లేరని, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారి కన్నెర్ర చేస్తే రాష్ట్రంలో బీఆరెస్ మిగలదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. తమ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీని గౌరవించడం తమ చేతగానితనంగా భావించవద్దని బీఆరెస్‌కు హితవు పలికారు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తూ, మతం పేరిట విద్వేషాన్ని చిమ్ముతున్న బీజేపీని గద్దె దించాల్సిన అవసరం ఉన్నదని భట్టివిక్రమార్క చెప్పారు. దేశంలో మతసామరస్యాన్ని కాపాడాలని భారత్ జోడో యాత్ర చేస్తున్న మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ సందేశాన్ని గడపగడపకూ తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలను కోరారు. లౌకికవాదం కలిగిన దేశంలో ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశ పౌరుడేనని, ప్రతి బిడ్డకు పాలించే అర్హత ఉందని చెప్పారు.


రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి 15 సీట్లు గెలిపించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కానుకగా ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ గౌరవంగా తలెత్తుకునే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన అందిస్తామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అధిగమించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టడానికి 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. ఈ దేశాన్ని పాలించే శక్తి అర్హత కాంగ్రెస్ పార్టీకి తప్పా ఇతర పార్టీలకు లేదన్నారు.