సంత్‌ సేవాలాల్‌ ఉత్సవాలకు 2కోట్లు: సీఎం రేవంత్‌రెడ్డి

బంజారాల ఆరాధ్యదైవం సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం 2కోట్లు విడుదల చేస్తుందని, తక్షణమే అందుకు జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు

సంత్‌ సేవాలాల్‌ ఉత్సవాలకు 2కోట్లు: సీఎం రేవంత్‌రెడ్డి
  • అన్ని తండాలకు పాఠశాలలు..రోడ్లు, మంచినీటి వసతులు
  • సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి


విధాత : బంజారాల ఆరాధ్యదైవం సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం 2కోట్లు విడుదల చేస్తుందని, తక్షణమే అందుకు జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం బంజారాభవన్‌లో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ జయంతి ఉత్సవాల్లో రేవంత్‌ రెడ్డి హాజరై మాట్లాడారు. మా ప్రభుత్వం మీ ఆశీర్వాదంతో ఏర్పాటైందని, సేవాలాల్‌ జయంతిని ఇప్పటికే ఆప్షనల్‌ హాలీడేగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. సంత్ సేవాలాల్ మార్గంలో బంజారాలు ముందడుగు వేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, గ్రామ పంచాయతీలుగా మారిన తండాలన్నింటికి బీటీ రోడ్లు, విద్యుత్తు, తాగునీటి వసతి కల్పిస్తామన్నారు.


మౌలిక వసతులు ఇతరాత్ర ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుందని, నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బంజారా సోదరులతో సమావేశమంటే కాంగ్రెస్ కుటుంబసభ్యులను కలిసినంత ఆనందమని రేవంత్‌రెడ్డి అన్నారు. 1976లో బంజారాలను ఎస్టీ జాబితాలో ఇందిరాగాంధీ చేర్చారని, దామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియాగాంధీదని, దొరల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలని నినదించారన్నారు. మీ అభ్యున్నతికి కష్టపడే ప్రభుత్వం మాదన్నారు.70 రోజుల్లో ఏ ఒక్క రోజు తాను సెలవు తీసుకోలేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయండని కోరారు.