బీఆరెస్‌, బీజేపీ రాజకీయ డ్రామానే కవిత అరెస్టు

బీఆరెస్‌, బీజేపీల రాజకీయ డ్రామాలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను పార్లమెంటు ఎన్నికల ముందు అరెస్టు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు

బీఆరెస్‌, బీజేపీ రాజకీయ డ్రామానే కవిత అరెస్టు
  • వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడ్టే పనిలో ఉంటే మేం నిలబెట్టే పనిలో ఉంటాం
  • పార్లమెంటు ఎన్నికలు మా పాలనకు రెఫరెండమ్‌
  • మార్పు పల్లెలదాకా తీసుకెలుతాం
  • వంద రోజుల పాలనపై సంతృప్తి
  • పార్లమెంటు ఎన్నికలు ముగియ్యగానే మాస్టర్ ప్లాన్‌-2050 అమలు
  • సీఎం రేవంత్‌రెడ్డి


విధాత, హైదరాబాద్: బీఆరెస్‌, బీజేపీల రాజకీయ డ్రామాలో భాగంగానే ఎమ్మెల్సీ కవితను పార్లమెంటు ఎన్నికల ముందు అరెస్టు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన తన ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీఆరెస్‌, బీజేపీల ఎత్తుగడలో భాగంగా, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కవిత అరెస్టుతో నాటకాలు వేస్తున్నాయన్నారు. టీవీ సీరియల్ మాదిరిగా లిక్కర్ కేసును సాగిదీస్తూ రాజకీయాలకు వాడుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.


సానుభూతితో బీఆరెస్‌, అరెస్టు చర్యతో బీజేపీ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయన్నారు. కూతురు కవిత అరెస్టుపై తండ్రి మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పందించలేదని, ప్రధాని మోదీ సైతం కవిత అరెస్టును ప్రస్తావించలేదన్నారు. కవిత అరెస్టుపై కేసీఆర్, మోదీ మౌనం దేనికి సంకేతమని, దానివెనుక వ్యూహం ఏమిటని ప్రశ్నించారు. కవిత అరెస్టు అవుతుంటే తండ్రిగా కేసీఆర్ ఆమె ఇంటికి రావాలని కదా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముందుగా ఈడీ తర్వాతా మోదీ వచ్చేవారని, ఈ సారి ఇద్దరు ఒకేసారి వచ్చారని వ్యాఖ్యానించారు.


యాదాద్రిలో దళితడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అవమానించారంటూ ప్రధాని మోదీ అవాస్తవాలు మాట్లాడారన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసింది కాంగ్రెస్ మాత్రమేనని, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే దళితుడేనని మోదీ గుర్తు చేసుకోవాలన్నారు. మోదీ ప్రధాని స్థాయిలో చౌవకబారు విమర్శలు చేయడం సరికాదన్నారు. డ్రామాలు కట్టిపెట్టి ప్రధానిమోదీ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని, విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో , మెట్రో విస్తరణకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో చెప్పాలని, చెప్పుకోవడానికి ఏం లేకనే బీజేపీ అరెస్టు డ్రామాకు తెర లేపిందన్నారు.


తెలంగాణను అవమానించిన మోదీకి తెలంగాణ అనే పదం పలకడానికి అర్హత లేదన్నారు. పదేళ్ల కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణ చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికలు మా పాలనకు రెఫరెండమ్‌గా తాము భావిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తాము 12పార్లమెంటు స్థానాలు గెలుస్తామన్నారు. రాష్ట్రంలో బీఆరెస్ పాలనలో జరిగిన అవినీతికి సంబంధించి విచారణలు సాగుతున్నాయని, లెక్కలు తేలాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణ సాగుతుందని, మా ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడిన, అక్రమాలకు పాల్పడినవారిపై విచారణ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని, ఎవరిని వదలబోమని స్పష్టం చేశారు.


మా ప్రభుత్వాన్ని పడగొడితే నిలబెట్టడానికి మేం దేనికైనా సిద్ధం


మా ప్రభుత్వాన్ని పడగొట్టే పనిలో విపక్షాలు ఉంటే నిలబెట్టుకునే పనిలో నేనుంటానని, నా పని నన్ను చేయనిస్తే అందరికి మంచిదని, లేదంటే దేనికైనా సిద్దమేనన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే.. వాళ్లు నిద్ర లేచేలోగా పక్కన ఎవరూ ఉండరని తేల్చిచెప్పారు. డిసెంబర్ 7నుంచి మొదలైన కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రజాపాలనకు మార్చి 17కు వంద రోజులు పూర్తి చేసుకుందన్నారు. మేం గత ప్రభుత్వం సృష్టించిన సమస్యలను పరిష్కరించుకుంటూ తెలంగాణ సమాజంలోని అందరి అభిప్రాయాలను తీసుకుంటు సంతృప్తికరంగా పాలన సాగించామని నమ్ముతున్నామని తెలిపారు.


అయితే వందరోజుల్లోనే మేం అన్ని చేశామని చెప్పడం లేదని, ఇచ్చిన ఆరు గార్యంటీల్లో ఉచిత బస్సు ప్రయణం ద్వారా 26కోట్ల మంది మహిళలకు ఉచిత బస్ ప్రయణం అందించామన్నారు. 10లక్షల ఆరోగ్య బీమా, 8లక్షల మంది మహిళలకు ఇప్పటికే 50రూపాయల సిలిండ్ అందించామన్నారు. ఇప్పటికే 37లక్షల మందికి 200యూనిట్ల గృహజ్యోతి ఉచిత విద్యుత్తు అందించామన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో అమలు కాలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని 25వేల కోట్లతో ప్రారంభించుకున్నామని, ప్రతి నియోజవర్గానికి 3,500ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లుగా తెలిపారు.


మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి ఒక చరిత్ర సృష్టించిందన్నారు. గత ప్రభుత్వం అవినీతి అడ్డగా మార్చిన టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. పన్నులు సక్రమంగా వసూలు చేస్తూ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఒకట తారీఖునే జీతాలు వేస్తున్నామన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో ముంచారని, గతపాలనలోని చిక్కుముడులను ఒక్కోక్కటిగా విప్పుతున్నామన్నారు.


ప్రజాప్రభుత్వంలో స్వేచ్చాయుతల పాలన


ఒకప్పుడు సీఎం దర్శనమే మహాభాగ్యమన్నట్లుగా ఉండేనని, నిషేధిత ప్రాంతంగా ఉన్న ఆనాటి ప్రగతి భవన్‌ను నేడు ప్రజాభవన్‌గా మార్చి ప్రజలకు అందుబాటులో తెచ్చామని, సచివాలయానికి కూడా సైతం ప్రజలు స్వేచ్చగా వచ్చివెళ్లే రీతిలో మార్పులు తెచ్చామన్నారు. అధికారులు, మంత్రులు పాలకులుగా కాకుండా సేవకులుగా సేవలందించేలా చూస్తున్నామన్నారు. ధర్నాచౌక్‌ను తెరిచి బీఆరెస్ నాయకులకు కూడా ధర్నాలకు అనుమతించామన్నారు.


పౌర హక్కుల సంఘాలతో పాటు వివిధ ప్రజా సంఘాలు, సంస్థలతో నేను స్వయంగా సంప్రదించి వారి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మైనార్టీ సంఘాలతో భేటీయై వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటామన్నారు. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించుకున్నామని తెలిపారు. నలబై ఏండ్ల రాజకీయ అనుభవమున్న మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ సభలో చేసిన వ్యాఖ్యలను, వాడిన భాషను ఏ విధంగా సమర్దించుకుంటారో చెప్పాలన్నారు. కేసీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు.


పల్లెల వరకు పాలన మార్పు


తెలంగాణలో మార్పు మొదలైందని, మార్పు తెలంగాణలో మారుమూల పల్లెలకు చేరే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారం కూడా కార్యాచరణ తీసుకున్నామన్నారు. స్థూలంగా ఈ 100రోజుల్లో తెలంగాణ సమాజంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని సచివాలయంలో కలిసి వారి లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర అభివృద్దికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని సహా మంత్రులను కలిసి నిధుల మంజూరీకి కృషి చేస్తున్నామన్నారు.


కేంద్రంతో పంతానికి పోతే రాష్ట్రాభివృద్ధికి నష్టం జరుగుతుందని, అందుకే మేం ఓ మెట్టు దిగైనా కేంద్రంతో సయోధ్యతో వెలుతున్నామన్నారు. కేంద్రం కూడా మెట్రో విస్తరణ సహా తాము కోరిన రోడ్లు, ఫ్లైఓవర్లకు ఇతర అభివృద్ధి పనులకు సహకారం అందించిందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం 2050-మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేశామని, పార్లమెంటు ఎన్నికలు ముగియ్యగానే మాస్టర్ ప్లాన్ అమలుపై సంప్రదింపులతో ముందుకెలుతామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.