మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలిచ్చాం: సీఎం రేవంత్ రెడ్డి

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెల‌ల కాలంలోనే ఎల్బీ స్టేడియం వేదికగా 30 వేల మందికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే సంత‌కాలు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు

  • Publish Date - March 4, 2024 / 02:09 PM IST
  • బీఆరెస్ పాలకులు అమరుల స్ఫూర్తిని మరిచి దోపిడికి మరిగారు
  • ఫామ్‌హౌజ్ మత్తులో యువత ఆకాంక్షలను విస్మరించారు
  • 6వేల పాఠశాలలు మూసేశారు
  • పిల్లలను బర్రెలు..గొర్రెల కాపరులుగా చూశారు
  • కేసీఆర్ పాలనలో మరోసారి భగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి
  • విద్యపై ఖర్చు పెట్టుబడి కాదు..భవిష్యత్ తరాలకు ఇంధనం
  • నేను సర్కార్ బడిలో చదివి ఈ స్థాయికి ఎదిగాను
  • 119నియోజకవర్గాల్లో నమూనా క్యాంపస్‌లు
  • రైతును రాజును చేసే పునాది పడింది ఇక్కడే

విధాత, హైదరాబాద్ : తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెల‌ల కాలంలోనే ఎల్బీ స్టేడియం వేదికగా 30 వేల మందికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే సంత‌కాలు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి సగర్వంగా ప్రకటించారు. నూతనంగా నియమింపబడిన 5192 మంది లెక్చరర్లు,టీచర్లు, కానిస్టేబుల్స్‌, మెడికల్ ఉద్యోగులకు సోమవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గత బీఆరెస్ ప్రభుత్వ పాలన తీరుపై మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్య‌మంలో యువ‌త ముందుండి పోరాడిందని, మా ఆత్మ బ‌లిదానాల‌తో త‌మ భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని న‌మ్మారని గుర్తు చేశారు. ఆ బ‌లిదానాల‌తో సాధించిన తెలంగాణ‌లో గత బీఆరెస్‌ ప్ర‌భుత్వం అమరుల స్ఫూర్తితో వారి ఆకాంక్షలను సాకారం చేసేందుకు ప‌ని చేయాల్సింది పోయి.. వాళ్ల లాభార్జ‌న‌, ధ‌న‌దాహం తీర్చుకోవ‌డానికే ప‌ని చేశారని దుయ్యబట్టారు. ఫాంహౌస్ మ‌త్తులో వారు ఉండి ల‌క్ష‌లాది యువ‌కుల ఉద్యోగ ఆకాంక్ష‌లను నెర‌వేర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యారని విమర్శించారు. త‌ల్లిదండ్రులు గ్రామాల్లో రూపాయి రూపాయి కూడ‌బెట్టి మిమ్మ‌ల్ని కోచింగ్ సెంట‌ర్ల‌కు పంపితే నాడు ఎప్పుడు నోటిఫికేష‌న్ వ‌స్తుందో తెలియ‌కపోగా పోటీ పరీక్షల ప్ర‌శ్నాప‌త్రాలు జిరాక్స్ సెంట‌ర్ల‌లో దొరికే దుస్థితి నెలకొందన్నారు. కడుపు మండిన నిరుద్యోగ యువ‌త ముందుకొచ్చి కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు, కుమార్తెల ఉద్యోగాలు ఊడ‌గొట్ట‌డంతోనే మేం అధికారంలోకి వచ్చి నియామ‌కాలు చేప‌డుతున్నామన్నారు.

విద్యపై ఖర్చు భవిష్యత్ తరాలకు ఇంధనం

విద్యపై పెట్టే ఖర్చు పెట్టుబ‌డి కాదని, భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే ఇంధనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ‌త ప్ర‌భుత్వం రేష‌న‌లైజేష‌న్ పేరిట 6 వేల పాఠ‌శాల‌ల‌ను మూత‌వేసి ద‌ళితులు, గిరిజ‌నులు, వెనుక‌బ‌డిన ప్రాంతాల్లోని పిల్ల‌లకు విద్య‌ను దూరం చేసి బ‌ర్రెలు కాసుకునే వారు బ‌ర్రెలు కాసుకోవాలె, గొర్రెలు పెంచుకునే వారు గొర్రెలు కాసుకోవాలె, చేప‌లు ప‌ట్టుకునే వారు చేప‌లు ప‌ట్టుకోవాలె అనే రీతిలో ప‌థ‌కాలు తీసుకొచ్చారని విమర్శించారు. కేసీఆర్ మనవడి పెంపుడు కుక్క చనిపోతే వెటర్నరీ డాక్టర్‌పై కేసు పెట్టారని విమర్శించారు. మ‌న తాత‌లు, తండ్రులు గొర్రెలు కాస్తే, బ‌ర్రెలు కాస్తే, చెప్పులు కుడితే మ‌న పిల్ల‌లు అవే ప‌నులు చేయాలా..? అని ప్రశ్నించారు. ఈ ప్ర‌భుత్వంలో వారు భాగ‌స్వాములు కావ‌ద్దా అని, వారు గొర్రెలు, బర్రెలు కాసుకోవాలా అని మండిపడ్డారు.

అన్ని నియోజకవర్గాల్లో నమూనా క్యాంపస్‌లు

రాష్ట్రంలో 119 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో అవ‌కాశం ఉన్న చోట న‌మూనా క్యాంప‌స్‌లు ఏర్పాటు చేయాలని, పేద విద్యార్థుల‌కు విద్య‌ను అందించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోందన్నారు. ప్ర‌తి కిలోమీట‌ర్‌కు సింగిల్ టీచ‌ర్ పాఠ‌శాల‌, ప్ర‌తి మూడు కిలోమీట‌ర్ల‌కు ప్రాథ‌మిక పాఠ‌శాల, ప్ర‌తి అయిదు కిలోమీట‌ర్ల‌కు ప్రాథ‌మికొన్న‌త పాఠ‌శాల‌, ప్ర‌తి ప‌ది కిలోమీట‌ర్ల‌కు ఒక హైస్కూల్‌, ప్ర‌తి మండ‌ల కేంద్రంలో జూనియ‌ర్ కాలేజీ, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో డిగ్రీ క‌ళాశాల‌, ప్ర‌తి రెవెన్యూ డివిజ‌న్‌లో ఇంజినీరింగ్ క‌ళాశాల‌, ప్ర‌తి జిల్లాలో మెడిక‌ల్ క‌ళాశాల ఉండాల‌నే విద్యా విధానం ప్ర‌కారం 2004 నుంచి 2014 వ‌ర‌కు నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ని చేసిందన్నారు. గ‌త ప‌దేళ్లో గ‌త ప్ర‌భుత్వం ఒక్క డీఎస్సీ ఇచ్చిందని, 2004 నుంచి 2014 వ‌ర‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం నాలుగు డీఎస్సీలు వేసి ల‌క్ష మంది ఉపాధ్యాయ నియామ‌కాలు చేప‌ట్టి పేద పిల్ల‌ల‌కు విద్య‌ను అందించిందని గుర్తు చేశారు.

నేను సర్కార్ బడిలో చదివి ఈ స్థాయికి ఎదిగాను

ఉద్యోగులు మీ ఉద్యోగాలతో తెలంగాణ‌కు అఖిల భార‌త స్థాయి ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, ఐఆర్ఎస్‌ల‌ను, డాక్ట‌ర్లు, ఇంజినీర్ల‌ను త‌యారు చేసే బాధ్య‌త‌ను చేప‌ట్ట‌బోతున్నారని,స‌ర్పంచులు మొద‌లు ప్ర‌ధాన‌మంత్రి వ‌ర‌కు త‌యారు చేసే బాధ్య‌త మీదేనని రేవంత్‌రెడ్డి ఉద్బోదించారు. నేను కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే చ‌దువుకున్నానని, నేను ఈ రోజు రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయ్యానంటే నాడు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో అందించిన విద్య‌నే కార‌ణమన్నారు. నేను గుంటూరులోనో, గుడివాడ‌లోనో చ‌దువుకోలేదన్నారు. గుంటూరులోనో మ‌రెక్క‌డో చ‌దువుకున్న కొంద‌రు నాకు ఇంగ్లిష్ రాద‌ని అవ‌హేళ‌న చేస్తున్నారన్నారు. చైనా, జ‌పాన్‌, జ‌ర్మ‌నీలో వారికి ఇంగ్లిష్ రాదని, కానీ ప్ర‌పంచంతోనే పోటీప‌డే అభివృద్ధి, ఉత్ప‌త్తుల‌ను ఆయా దేశాలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. ఇంగ్లిష్ అనేది ఓ భాష‌, ప్ర‌పంచంలో ఉద్యోగం, ఉపాధికి ఉప‌యోగ‌ప‌డుతుందన్నారు. మా రోజుల్లో నాడు ఉన్న అవ‌కాశాల‌ను ప‌ట్టి మేం నేర్పిన చ‌దువులు నేర్చుకున్నామన్నారు. నేడు ప్ర‌పంచంలో ఉద్యోగ అవ‌కాశాలు వ‌చ్చే ఇంగ్లిషును నేర్పండని, మీ ద‌గ్గ‌ర చ‌దువుకునే పిల్ల‌ల‌కు ఇంగ్లిష్ రాదని అవ‌హేళ‌న చేసే ప‌రిస్థితి రావ‌ద్దన్నారు. మీ ద‌గ్గ‌ర చదువుకునే పిల్ల‌ల‌కు మంచి భాష‌ను, భావాన్ని దేశ‌భ‌క్తిని నేర్పండని, వారే రేప‌టి పాల‌కులు అవుతారని చెప్పారు.

రాష్ట్రంలో గురుకుల పాఠ‌శాల‌లు ఇచ్చామ‌ని గ‌త పాల‌కులు చెబుతున్నారని, వాటిలో ఎక్క‌డైనా మౌలిక వ‌స‌తులు క‌ల్పించారా అని ప్రశ్నించారు. అందుకే మోడ‌ల్ గురుకుల పాఠ‌శాలు తీసుకురావాల‌ని రూ.25 ఎక‌రాల్లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ.150 కోట్ల‌తో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో వాటిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామన్నారు.

రైతును రాజును చేసే పునాది పడింది ఇక్కడే

ఎల్‌బీ స్టేడియం చ‌రిత్ర‌లో శాశ్వ‌తంగా నిలిచిపోతుందని, ఇదే ఎల్బీ స్టేడియం 2004లో నాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి రైతుల‌కు ఉచిత క‌రెంటు, రైతుల‌పై ఉన్న అక్ర‌మ కేసులు, విద్యుత్ బ‌కాయిలు ర‌ద్దు చేస్తూ మొద‌టి సంత‌కం చేసి మ‌న ప్రాంతంలో రైతును రాజును చేస్తూ పునాది పడిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2023, డిసెంబ‌రు 7 తేదీన కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే స‌మ‌క్షంలో మ‌రోసారి కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డిందని, ఇదే స్టేడియంలో అభ‌య‌హ‌స్తం పేరిట ఆరు గ్యారెంటీల అమ‌లుకు ఇదే స్టేడియంలో సంత‌కం చేశామని వివరించారు. ఉద్యోగ నియామ‌క ప‌త్రాలు అందుకొని తెలంగాణ భ‌విష్య‌త్‌ను, విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్ద‌డానికి వ‌చ్చిన వారంద‌రికి మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలుపుతున్నానన్నారు.