విధాత, హైదరాబాద్ : లాభసాటి వ్యవసాయం కోసం రైతులకు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా అవగాహాన కల్పించనున్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావులతో కలిసి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫెరెన్స్‌లో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతు వేదికలకు
వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం అని చెప్పారు. దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన చేస్తామని, ఇందుకు రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలు చేస్తామన్నారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు రూ. 4.07 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లక్ష్యమన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు నిర్వహిస్తారని తెలిపారు. గ్రామాల నుంచే రైతులు ఆన్ లైన్ లో పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం, తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటం దీని ఉద్ధేశమన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుందని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందని వెల్లడించారు. గత వర్షాకాలంలో సరైన వర్షాపాతం లేకపోవడంతో ఈ ఏడాది కరవు పరిస్థితులు ఎదుర్కోవాల్సివుంటుందన్నారు. రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటిపోయాయని, కరీంగనర్, నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలన్న డిమాండ్ వస్తుందన్నారు. కరవు పరిస్థితులను ఎదుర్కోనేందుకు అంతా సిద్ధం కావాలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ మాట్లాడుతూ రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతు నేస్తంతో రైతులకు వ్యవసాయ విస్తరణ సేవలతోపాటు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందించనున్నామని తెలిపారు