కొడంగల్ ఎత్తిపోతలకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
ఎన్నో ఏళ్లుగా రైతులు కలలుగన్న నారాయణ పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఎన్నో ఏళ్లుగా రైతులు కలలుగన్న నారాయణ పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. రూ.2945 కోట్ల నిధులతో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాల ఆయకట్టు సాగునీరు అందే విధంగా ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఈ ఎత్తిపోతల పథకం చేపట్టాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2012 లోనే పరిపాలన అనుమతులు వచ్చాయి.
ఇందుకు సంబంధించి అప్పటి గవర్నర్ 69 జీవో విడుదల చేశారు. భీమా ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి, నారాయణ పేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల ఆయకట్టుకు అందించాలనేది ముఖ్య ఉద్దేశం. కానీ 2014లో బీఆరెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది. భీమా నుంచి కాకుండా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి కొడంగల్ ప్రాంతానికి సాగునీరు ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా ఆ వైపు అడుగులు వేయలేదు.అప్పటి నుంచి ఈ ఎత్తిపోతల పథకం అన్ని పార్టీలకు ఎన్నికల ప్రచారానికి మాత్రమే ఉపయోగపడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టడంతో ఈ పథకం పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేశారు. బుధవారం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పథకం పనులకు శంకుస్థాపన జరుగబోతోంది. దీనితోపాటు.. కొడంగల్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాల, కోస్గిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించనున్నారు. రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, దామోదరం రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొననున్నారు.