BJP | మళ్లీ తెర పైకి ఉమ్మడి పౌరస్మృతి.. దేశ అవసరమా? బీజేపీ రాజకీయమా?

BJP | కఠిన సవాళ్లు.. ఏండ్లుగా చర్చలు భోపాల్‌లో మోదీ నోటి వెంట మళ్లీ భిన్న సంప్రదాయాలు, ఆచారాల దేశం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతి దేశంలో యూసీసీ సాధ్యమేనా? వదిలేస్తే మంచిదన్న 2018 కమిషన్‌ మళ్లీ పరిశీలిస్తామన్న తాజా కమిషన్‌ తీవ్ర వ్యతిరేకతతో పర్సల్‌ లా బోర్డ్‌ ప్రజలను పక్కదారి పట్టించే యత్నమే మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు అనుకూలతలు దేశంలోని ప్రజలందరికీ కుల, మత, వర్గ, లింగ బేధాలు లేకుండా సమాన హక్కులు కల్పించడం. లింగ […]

BJP | మళ్లీ తెర పైకి ఉమ్మడి పౌరస్మృతి.. దేశ అవసరమా? బీజేపీ రాజకీయమా?

BJP |

  • కఠిన సవాళ్లు.. ఏండ్లుగా చర్చలు
  • భోపాల్‌లో మోదీ నోటి వెంట మళ్లీ
  • భిన్న సంప్రదాయాలు, ఆచారాల దేశం
  • ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంస్కృతి
  • దేశంలో యూసీసీ సాధ్యమేనా?
  • వదిలేస్తే మంచిదన్న 2018 కమిషన్‌
  • మళ్లీ పరిశీలిస్తామన్న తాజా కమిషన్‌
  • తీవ్ర వ్యతిరేకతతో పర్సల్‌ లా బోర్డ్‌
  • ప్రజలను పక్కదారి పట్టించే యత్నమే
  • మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు

అనుకూలతలు

  • దేశంలోని ప్రజలందరికీ కుల, మత, వర్గ, లింగ బేధాలు లేకుండా సమాన హక్కులు కల్పించడం.
  • లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం
  • యువత ఆకాంక్షలకు స్థానం కల్పించడం.
  • జాతీయ సమైక్యతకు మద్దతునివ్వడం.
  • ప్రస్తుతం అమల్లో ఉన్న పర్సనల్‌ చట్టాలను సంస్కరించడం అనే వివాదాస్పద అంశాన్ని అధిగమించడం.

ప్రతికూలతలు

  • భారతదేశంలో ఉన్న వైవిధ్యం కారణంగా ఆచారణలో ఎదురయ్యే ఇబ్బందులు.
  • మత స్వేచ్ఛను ఉమ్మడి పౌరస్మృతి ఉల్లంఘిస్తుందనే భావన.
  • వ్యక్తిగత అంశాల్లో ప్రభుత్వాల జోక్యం.
  • సున్నితమైన, కఠినమైన పని.
  • ఈ తరహా సంస్కరణకు ఇది అనువైన సమయం కాదు.

న్యూఢిల్లీ : ఏండ్ల తరబడి చర్చల్లో ఉన్న ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ భోపాల్‌ సభ సందర్భంగా మళ్లీ ముందుకు తీసుకువచ్చారు. ముస్లిం సమాజం దీనిని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ప్రతిపక్షాలే ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొడుతున్నారని ప్రధాని అదే సభలో ఆరోపించారు. అసలు ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అంటే ఏమిటి? అన్న అంశం సహజంగానే మరోసారి చర్చల్లోకి వచ్చింది.

ఉమ్మడి పౌరస్మృతి అనేది.. దేశంలోని ప్రజలందరికీ.. వారి కులమతాలతో, లింగబేధాలతో సంబంధం లేకుండా సమాన హక్కులు కల్పించే ఉద్దేశంతో తెస్తున్నట్టు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. ఉమ్మడి పౌరస్మృతిని ప్రధాని మోదీ మళ్లీ లేవనెత్తడాన్ని కాంగ్రెస్‌, డీఎంకే, ఎంఐఎం సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. మోదీ విచ్ఛిన్నకర రాజకీయాలను ఆశ్రయిస్తున్నారని ఆరోపించాయి. ఒక కుటుంబాన్ని, మొత్తం దేశాన్ని పోల్చి చూడటం సరికాదని, ఉమ్మడి పౌరస్మృతిని ఏ ఒక్కరిపై బలవంతంగా రుద్దజాలరని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం అన్నారు.

నిరసించిన విపక్షాలు

మతపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకే మోడీ ప్రభుత్వం యూసీసీని తెరపైకి తెస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ‘యూసీసీ అనేది ఒక ఆకాంక్ష మాత్రమే. దానిని మెజారిటీవాద ఎజెండాతో పనిచేసే ప్రభుత్వం బలవంతంగా ప్రజలపై రుద్దడం తగదు’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం అన్నారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్ని అంటున్న ధరలు, నిరుద్యోగిత, పెరుగుతున్న విద్వేష పూరిత వాతావరణం, రాష్ట్రాల హక్కుల విషయంలో వివక్ష వంటి అంశాలనుంచి దేశాన్ని పక్కదారి పట్టించేందుకే మోదీ ఈ అంశాన్ని లేవనెత్తారని ఆయన మండిపడ్డారు.

‘యూసీసీని ముందుగా హిందూ సమాజంపై అమలు చేయాలి. ఎస్సీలు, ఎస్టీలకు దేశంలోని ఏ దేవాలయంలోనైనా పూజలు చేసుకునే అవకాశం కల్పించాలి. రాజ్యాంగం దేశంలోని అన్ని మతాలకు రక్షణ ఇచ్చింది కనుక మేం యూసీసీని కోరుకోవడం లేదు’ అని డీఎంకే నేత టీకేఎస్‌ ఇలంగోవన్‌ అన్నారు. మణిపూర్‌ మండిపోతుంటే ఇప్పటి వరకూ నోరు మెదపని మోదీ.. దాని నుంచి దృష్టి మరల్చేందుకే యూసీసీ వివాదాన్ని తెచ్చారని ఆరోపించారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న దేశ స్ఫూర్తిని ఇది నాశనం చేస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పారు.

ఐదేళ్ల తర్వాత మళ్లీ నోటిఫికేషన్‌

చట్టం విషయానికి వస్తే.. ఉమ్మడి పౌరస్మృతిపై అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు కోరుతూ గత జూన్‌ 14వ తేదీన దేశ లా కమిషన్‌ బహిరంగ నోటీసు జారీ చేసింది. 21వ లా కమిషన్‌ ఇదే అంశంపై 2018లో సంప్రదింపుల ప్రతాన్ని విడుదల చేసిన తర్వాత ఐదేళ్లకు తాజా నోటీసు జారీ అయింది. ఈ విషయంలో ఉన్న ప్రాముఖ్యత, ఆవశ్యకతను పరిగణించడంతోపాటు.. దీనికి సంబంధించి కోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో 22వ లా కమిషన్‌ ఈ అంశాన్ని తిరిగి చేపట్టడం తప్పని సరైందని పేర్కొన్నది.

ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను, ఆలోచనలను కమిషన్‌ కోరుతున్నదని, అదే సమయంలో వివిధ మత సంస్థల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. నోటిఫికేషన్‌ జారీ అయిన 30 రోజులలో లా కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించి తమ అభిప్రాయాలను పేర్కొనవచ్చని తెలిపింది. లేదా membersecretary-lci@gov.inకు వివరంగా మెయిల్‌ పంపవచ్చని పేర్కొన్నది. ఈ అంశంపై వివరంగా చర్చించేందుకు వ్యక్తులను, లేదా సంస్థల ప్రతినిధులను సమావేశాలకు కూడా కమిషన్‌ ఆహ్వానించవచ్చని తెలిపింది.

ఏళ్ల తరబడి వివాదం

యూసీసీ అనేది చాలా కాలంగా భారత రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా కొనసాగుతున్నది. 1998, 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపర్చింది. 2019లో నారాయణ్‌ లాల్‌ పంచరియా దీని విషయంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ.. ప్రతిపక్షాల వ్యతిరేకతతో ప్రభుత్వం ఉపసంహరించింది. 2020లో బిల్లు తెచ్చారు కానీ పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు. వివాహాలు, విడాకులు, దత్తత, వారసత్వం విషయంలో సమానతను కోరుతూ సుప్రీం కోర్టులో అనేక పిటిషన్‌లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలోని వివిధ కుటుంబ చట్టాలు మహిళల పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నాయని, దీనిపై దృష్టి సారించాల్సి ఉన్నదని 2018 నాటి సంప్రదింపుల పత్రం పేర్కొన్నది.

అనేక ఇబ్బందులు ఉన్న కారణంగా.. ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తెచ్చే బదులు ప్రస్తుతం ఉన్న వివిధ పర్సనల్‌ చట్టాల్లో సవరణలు చేయడం ద్వారా హక్కులు కల్పిస్తే సరిపోతుందని 2018 నాటి సంప్రదింపుల పత్రం పేర్కొన్నది. ఒక విధంగా ఉమ్మడి పౌరస్మృతిని పక్కనబెట్టాలని సూచించింది. కానీ.. 22వ లా కమిషన్‌ మాత్రం సంప్రదింపుల కోసం తాజా నోటిఫికేషన్‌ జారీ చేసింది. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో అనేక సందర్భాల్లో ఉమ్మడి పౌరస్మృతి డిమాండ్‌ వస్తూనే ఉన్నది. కానీ.. ఈ చట్టం అమలులో అనేక సవాళ్ల ఉన్నాయి. రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం, మత సంస్థల నుంచి వ్యతిరేకతలు, చట్టంలోనే ఉన్న విరుద్ధ అంశాల కారణంగా ఇది వివాదాస్పదం అవుతున్నది.

ముసాయిదా తయారీలో ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌

యూసీసీపై లా కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడం, దీనిపై ముందుకు వెళ్లనున్నట్టు ప్రధాని మోదీ భోపాల్‌ సభలో సంకేతాలివ్వడంతో దానిని వ్యతిరేకిస్తూ ముసాయిదా నివేదిక తయారీలో ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ నిమగ్నమైంది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బోర్డ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. లా కమిషన్‌కు సమర్పించాల్సిన నివేదిక ముసాయిదాపై చర్చించినట్టు బోర్డ్‌ సభ్యుడు ఖలీద్‌ రషీద్‌ ఫారంగి మహిల్‌ చెప్పారు.

ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ అనేది ప్రభుత్వేతర సంస్థ. దేశంలోని ముస్లింల చట్టాల విషయంలో ప్రాతినిథ్యం వహిస్తుంటుంది. ‘ఉమ్మడి పౌర స్మృతి అనేది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అనేదే మా వైఖరి. దీనిని మేం గట్టిగా వ్యతిరేకిస్తాం’ అని మహిల్‌ చెప్పారు. భారతదేశం అనేక మతాలు, సంస్కృతుల నిలయమని అన్నారు. ఉమ్మడి పౌర స్మృతి అనేది ఒక్క ముస్లిం సమాజాన్నే ప్రభావితం చేయదని, హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, జైనులు, యూదులు, పార్సీలు, ఇతర చిన్నచిన్న మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.