CONGRESS | లక్ష కోట్ల అవినీతి.. 10 వేల ఎకరాల భూ ఆక్రమణ.. సీఎం కేసీఆర్ అక్రమాలు
CONGRESS | మండిపడిన కాంగ్రెస్ నాయకత్వం కేసీఆర్ చేతిలో దగాపడ్డ ఎస్సీ, ఎస్టీలు సామాజిక న్యాయం, స్వేచ్ఛ మా విధానం బెల్టుషాపుల్లోనే తెలంగాణ నంబర్ వన్ కాంగ్రెస్‌కు తెలంగాణతో మూడో విజయం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విధాత: తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను గౌరవించి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తొమ్మిదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు వెనుకేసుకున్నాడని, 10వేల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి […]

CONGRESS |
- మండిపడిన కాంగ్రెస్ నాయకత్వం
- కేసీఆర్ చేతిలో దగాపడ్డ ఎస్సీ, ఎస్టీలు
- సామాజిక న్యాయం, స్వేచ్ఛ మా విధానం
- బెల్టుషాపుల్లోనే తెలంగాణ నంబర్ వన్
- కాంగ్రెస్‌కు తెలంగాణతో మూడో విజయం
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
విధాత: తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను గౌరవించి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ తొమ్మిదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు వెనుకేసుకున్నాడని, 10వేల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బీఆరెస్ వాళ్లు రూ.100 కోట్లకు ఎకరం కొనగల ఆస్తులు సంపాదిస్తే, పేదలు 100 గజాలు కొనగలిగే పరిస్థితి లేదన్నారు. రెండుసార్లు సీఎంగా ఉన్న కేసీఆర్ తో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదు, ఉద్యమకారులను గుర్తించలేదు, అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేదు, దళితుడిని సీఎం చేస్తానని చేయలేదన్నారు.
తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేతిలో అత్యధికంగా దగాకు గురైంది దళితులు, గిరిజనులేనని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడెకరాలు, మైనారిటీలకు, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ల హామీలను అటకెక్కించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 115 సీట్లకు ప్రకటించిన బీఆరెస్ అభ్యర్థుల జాబితాలో ఒక్క ముదిరాజ్ కు కూడా టికెట్ ఇవ్వలేదన్నారు.
50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారన్నారు. ఒక్క మాదిగ బిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని తెలిపారు. దళితులు, గిరిజనులు ఆదుకునేందుకు సోనియా సూచనతో ఖర్గే ఇక్కడకు వచ్చారని తెలిపారు. వైఎస్ హయాంలో చేవెళ్ల గడ్డపై నుంచి కాంగ్రెస్ జెండా ఎగిరిందన్నారు. అలాంటి ఈ గడ్డపై నుంచి డిక్లరేషన్ ను ప్రకటించడం ద్వరా నా జన్మ ధన్యమైందని రేవంత్ వ్యాఖ్యానించారు.
లక్ష సరే.. వంద ఎకరాలకూ నీళ్లు రాలే
ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తానన్న కేసీఆర్ ఈ నియోజకవర్గంలో100 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీ జిల్లాకు, మీ నియోజకవర్గానికి చుక్క నీళ్లైనా ఇచ్చాడా అని సభకు హాజరైన జనాన్ని ప్రశ్నించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ నుంచి గోదావరి నీళ్లు చుక్క కూడా ఈ చేవెళ్లకు రాలేదన్నారు. అలాగే పాలమూరు- రంగారెడ్డి ద్వారా కృష్ణా నీళ్లు కూడా ఒక్క చుక్క కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్… ఒవైసీలు ఒక్క మాట మీద నిలబడరన్నారు.
సామాజిక తెలంగాణ కోసమే తుదిపోరాటం
సామాజిక తెలంగాణ కోసమే మనం తుది దశ తెలంగాణ పోరాటం మొదలుపెట్టామని రేవంత్ అన్నారు. ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం, స్వేచ్ఛ అందాలని, అలాగే ప్రతి ప్రాంతం సమానంగా అభివృద్ధి జరగాలన్నదే కాంగ్రెస్ విధానం అని రేవంత్ తెలిపారు. అయితే హైదరాబాద్ పక్కన ఉన్న వికారాబాద్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఎన్నడు కూడా కేసీఆర్ నిజం మాట్లాడడన్నారు. ‘‘దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అని అంటున్నారు. అవును.. 3 వేల వైన్ షాపులు 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు’’ అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ ఎద్దేవా చేశారు.
తెలంగాణను తాగుబోతుల అడ్డా చేయడం కోసం కేసీఆర్ మద్యం షాపుల దరఖాస్తులు పిలిస్తే 1.25 లక్షలు వచ్చాయన్నారు. తాము ప్రజల కోసం, సామాజిక న్యాయం కోసం, 119 నియోజవర్గాలలో పోటీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తే 1200 వచ్చాయని తెలిపారు. అసలు తెలంగాణలో సామాజిక న్యాయం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు.
రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టిన తరువాత, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టాక.. మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్ లో సాధించామని, రెండో విజయం కర్ణాటకలో నమోదు చేసుకున్నామని, మూడో విజయం ఎక్కడ సాధిస్తామని సభకు హాజరైన ప్రజలను అడిగారు. ప్రజలు మూడవ విజయం తెలంగాణలో అని నినదించారు. తెలంగాణ విజయయం సాధిస్తుందని అనే వాళ్లంతా చేతులెత్తాలని రేవంత్ కోరగా సభికులు రెండు చేతులెత్తి విజయ సూచికతో నినదించారు.
దళిత, గిరిజనుల ఆకాంక్షల సాధనకే డిక్లరేషన్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
విధాత: పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో దళిత, గిరిజన, ఆదివాసీల సమస్యలు, వారి ఆకాంక్షలను తెలుసుకుని, పార్టీ నిపుణులతో చర్చించి కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం చేవెళ్ల ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడారు. 12 అంశాలతో రూపొందించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఫలాలు అందుకోవాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని, ఇందుకు డిక్లరేషన్ అంశాలను ఇంటింటికి తీసుకెళ్లానని పిలుపునిచ్చారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ చారిత్రక సభగా నిలుస్తుందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు దక్కకపోగా, ఎస్సీ, ఎస్టీలు ఆత్మగౌరవంతో, హక్కులతో స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేకుండెనని ఆవేదన చెందారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తో ఆత్మగౌరవంతో బతికే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకురానుందన్నారు. సంపద సృష్టించే భూమి, పారిశ్రామిక, విద్య, వైద్య రంగాలలో వారిని భాగస్వామ్యం చేస్తూ, వారికి హక్కులు కాపాడే రీతిలో డిక్లరేషన్ ప్రకటించామన్నారు.
కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ గద్దర్ ఆశయం మేరకు, ఆయన చివరి కోరికను అనుసరించి రూపొందించ బడిందని, డిక్లరేషన్ ప్రకటన ద్వారా ఆయనకు నివాళులర్పిస్తున్నామన్నారు. బీఆరెస్ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని ఇవ్వకపోగా, కాంగ్రెస్ ఇచ్చిన లక్షల ఎకరాలను లాక్కుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి భూములపై వారికి హక్కులు కల్పించడంతో పాటు అటవీ హక్కుల చట్టం మేరకు పోడు భూముల గిరిజన, ఆదివాసీలకు పోడు పట్టాలివ్వాలని చారిత్రక నిర్ణయం తీసుకున్నామన్నారు. దళిత, గిరిజన పేదలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల సహాయం అందిస్తామన్నారు.
అప్పడు సబ్ ప్లాన్.. ఇప్పుడు డిక్లరేషన్: దామోదరం రాజనరసింహ
‘మాట ఇస్తే నిలబెట్టుకునే చరిత్ర కాంగ్రెస్ సొంతం. ఎస్సీ, ఎస్టీలకు గతంలో సబ్ ప్లాన్ అమలు చేశాం. ఇప్పుడు డిక్లరేషన్ ప్రకటించాం. దీని ద్వారా రూ.12లక్షలు పేద, దళిత, ఆదివాసీలకు అంబేడర్ అభయ హస్తం ఇవ్వబోతున్నాం’ అని సీడబ్ల్యుసీలో శాశ్వత ఆహ్వానిత సభ్యుడు దామోదరం రాజనరసింహ అన్నారు. వర్గీకరణకూ కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ సమాజం మౌనంగా గమనించి చైతన్యాన్ని చాటుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
దళిత నేతగా తనకు సీడబ్ల్యుసీలో శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా అవకాశం కల్పించారన్నారు. పేద దళిత, గిరిజన, ఆదివాసీ, బీసీ లకు 25లక్షల అసైన్డ్ భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్‌దే అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పట్టాలిచ్చిన చరిత్ర కాంగ్రెదేనన్నారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో దళిత సీఎం, వేయికోట్ల నిధి, మూడెకరాలు, పోడు భూముల హక్కులపై ఇచ్చిన హామీలేవి నిలబెట్టుకోలేదన్నారు.
ఎన్నికలంటే కేసీఆర్ ఒక ఆటలాగా మారిందన్నారు. మళ్లీ దోచుకున్న డబ్బుతో ఎన్నికల జాతరతో ప్రజల ముందుకొస్తున్న సీఎం కేసీఆర్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తగిన గుణపాఠం చెప్పి తమ చైతన్యాన్ని చాటుకోవాలన్నారు. బీఆరెస్ సర్కార్ రియల్టర్‌గా మారి అసైన్డ్ భూములు గుంజుకుంటుందన్నారు. ఆత్మగౌరవంతో బతికేందుకు తెలంగాణ తెచ్చుకుంటే కుటుంబం చేతిలో నలిగిపోతున్నామన్నారు. బంగారు తెలంగాణ బెల్డ్ షాపుల తెలంగాణ అయ్యిందన్నారు.
అసైన్డ్ భూములూ గుంజుకున్న సర్కార్: ఎమ్మెల్యే సీతక్క
సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో మూడెకరాల భూమి దళితులకు ఇవ్వకపోగా, కాంగ్రెస్ ఇచ్చిన అసైన్డ్ భములనూ గుంజుకుందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. మూడెకరాల భూమిని మరిపించేందుకే దళిత బంధు పేరుతో నామమాత్ర పథకంతో మోసం చేశారన్నారు. కాంగ్రెస్‌తోనే దళిత, గిరిజనులకు న్యాయం, ఆత్మగౌరవం దక్కుతుందన్నారు. రైతుబంధు పేరుతో ఎస్సీ, ఎస్టీ రైతులకంటే ఎక్కువగా వందల ఎకరాల ఫామ్‌హౌజ్‌లున్న వారే కోట్లు దండుకుంటున్నారన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన అంబేద్కర్ రాజ్యాంగ హక్కుల ద్వారానే తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లతో ముందుకెళుతున్నామన్నారు. కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తో దళిత, గిరిజనుల అభివృద్ధి సాధనకు కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని హాఫ్ పర్సంట్ ఉన్న వాళ్లు నడిపిస్తున్నారన్నారు.
కాంగ్రెస్ వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆత్మగౌరవం, హక్కులు, న్యాయం లభిస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి, తాను పునఃప్రతిష్టంచదలచిన అంబేద్కర్ విగ్రహాన్ని మూల పడేయించిందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయించాలని కోరారు.