Congress
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజలకు చేరువ చేశామని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడు మల్లు బిట్టివిక్రమార్క అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై కొమురం భీం స్పూర్తితో పోరాడుదామన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్పూర్తితో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ను చేపట్టామని, ఈ పాదయాత్ర ద్వారా తెలంగాణలోని సకల జనుల కష్టసుఖాలను తెలుసుకున్నామన్నారు.
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్విరామంగా చేపట్టిన పీపుల్స్ మార్చ్ కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన మార్చ్ కాదన్నారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ నియంతృత్వంపై తెలంగాణ ప్రజలు చేసిన మార్చ్ అన్నారు. అధికార మధంతో తెలంగాణ ప్రజల ఆస్తులను దోచుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే సమయం ఆసన్నమైందన్నారు. నాడు ఇందిరాగాంధీ పేద రైతులకు పంచిన 24లక్షల ఎకరాల భూములనే నేడు కేసీఆర్ ప్రభుత్వం రైతుల నుంచి తీసుకుంటుందన్నారు.
ధరణి పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్‌లోని ఓ గ్రామంలో వేల మంది గిరిజనులు తనను వాళ్ల గ్రామంలోకి తీసుకెళ్లి కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులపై చేస్తున్న ఆటవిక చర్యలను తన దృష్టికి తీసుకురావడంతో పాటు కొమురం భీం స్పూర్తితో పోరాడి కేసీఆర్ ప్రభుత్వంను గద్దె దించుదామన్నారని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గుర్తు చేశారు.
కాంగ్రెస్ వస్తేనే పేద ప్రజలకు మేలు జరుగుతుందని, కార్మికులకు ఉపాధి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు భరోస, పోడు రైతులకు పోడు భూములు, నీళ్లు, నిధులు అందుతాయన్నారు. దేశంలో, రాష్ట్రంలో మళ్లీ ఇందిరాజ్యం వస్తుందన్నారు. నేడు చదువుకున్న యువత బజ్జీల బండ్లు, సోడా బండ్లు నడుపుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నతెలంగాణ ఇది కాదన్నారు.
తెలంగాణ సంపద దోపిడికి గురవుతుందని, ఐదు లక్షల కోట్లు అప్పు మిగిలిందన్నారు. మళ్లీ రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా కూలీలు, బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ కొండంత అండ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు. పేద ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రావాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో సంపదను పెంచి ప్రజలకు పంచితేనే సమసమాజం నిర్మితమైతుందని, ఈ పని కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుందన్నారు. 2023-24లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, ఈ ఖమ్మం వేదికగా నిర్వహించిన తెలంగాణ జన గర్జన సభ నుంచి ఈ రాష్ట్రానికి దిశా నిర్ధేశం జరుగుతుందన్నారు.