2024 ఎన్నికలకు.. కాంగ్రెస్‌ రూట్‌ మ్యాప్‌

చత్తీస్‌ఘడ్‌ వేదికగా 85వ ప్లీనరీ అధికారమే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు ఊపు తీసుకొచ్చిన రాహుల్ జోడో యాత్ర‌ కొన‌సాగింపుగా హాత్ సే హాత్ జోడో యాత్ర‌.. విధాత: కాంగ్రెస్‌ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్దం చేసుకుంటున్నది. చత్తీస్‌ ఘడ్ రాష్ట్ర రాజధాని రాయపూర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోనున్నది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం ఎలా అన్న దానిపైనే ప్రధాన […]

2024 ఎన్నికలకు.. కాంగ్రెస్‌ రూట్‌ మ్యాప్‌
  • చత్తీస్‌ఘడ్‌ వేదికగా 85వ ప్లీనరీ
  • అధికారమే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు
  • ఊపు తీసుకొచ్చిన రాహుల్ జోడో యాత్ర‌
  • కొన‌సాగింపుగా హాత్ సే హాత్ జోడో యాత్ర‌..

విధాత: కాంగ్రెస్‌ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్దం చేసుకుంటున్నది. చత్తీస్‌ ఘడ్ రాష్ట్ర రాజధాని రాయపూర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకోనున్నది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం ఎలా అన్న దానిపైనే ప్రధాన చర్చ జరుగనున్నది. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ 2024 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ నేతృతంలో ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత కమిటీ అయిన సీడబ్ల్యుసీలో 50 శాతం నిమ్నవర్గాలకు చెందిన నేతలను తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే ఎన్నికల నిర్వహణ కాకుండా నామినేట్‌ చేసుకోవాలని తీర్మానించారు. ఇందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంపై కొంత మంది పార్టీ నేతలు విభేదించినప్పటికీ వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్లీనరీ చేసిన ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక పోయారు.

ప్లీన‌రీకి ఉత్సాహంతో హాజ‌రైన ప్ర‌తినిధులు

చత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయపూర్‌లో ఈ నెల 24 నుంచి 26 వరకు కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్లీనరీకి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రా నుంచి 15 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ డెలిగేట్లు సమావేశానికి వెళ్లకుండా బీజేపీ అడ్డకునే ప్రయత్నం అక్కడక్కడ చేసినా ప్రతినిధులు రెట్టించిన ఉత్సాహంతో వెళ్లారు. ఈ సమావేశాలు ఆదివారం సాయంత్రం ముగుస్తాయి.

పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న న‌మ్మ‌కం..

ప్లీనరీలో కాంగ్రెస్‌ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్ర ముగిసిన తరువాత నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కాంగ్రెస్‌ శ్రేణుల్లో పార్టీపై నమ్మకం పెరిగింది. రాహుల్‌ గాంధీ జోడో యాత్ర సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చే విధంగా ఆయా రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర కొనసాగుతున్నది. ఈ యాత్ర కొనసాగుతున్న సమయంలోనే ఈ ప్లీనరీ జరగుతుండడం విశేషం. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర మధ్యలో నుంచే ప్లీనరీలో పాల్గొనడానికి వెళ్లారు.

భ‌విష్య‌త్ ప‌రిణామాల‌పై నేత‌ల చ‌ర్చ‌లు..

ప్లీనరీ ప్రాంగణంలో హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర గురించే నాయకులు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో యాత్ర సమయంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నేతలు చర్చిస్తున్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ఏమి చేయాలి? కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఏమి చేస్తామో ప్రజలు వివరిస్తూ ఏవిధంగా భరోసా కల్పించాలన్న దానిపై నేతలు చర్చింకుంటున్నారు.

బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను ఐక్యం చేసే బాధ్య‌త‌..

2024 ఎ న్నికల్లో దేశంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని, ఈ మేరకు కలిసి వచ్చే శక్తులన్నింటిని కూడ గట్టాలని నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఐక్యం చేసే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపధ్యంలో కలిసి వచ్చే శక్తులను ఏవిధంగా కలుపుకోవాలి? అదే సమయంలో బలంగా ఉన్న రాష్ట్రాల్లో తిరిగి ఏవిధంగా అధికారంలోకి రావాలన్న దానిపై కీలకంగా చర్చిస్తున్నారు.

ఈ మేరకు కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం అనుసరించాల్సిన కార్య‌క్రమాలు, ఆయా రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న కర్ణాటక, చత్తీస్‌ఘడ్‌, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, మిజోరం రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చే విధంగా పని చేయాలని క్యాడర్‌కు ప్లీనరీ దిశానిర్దేశం చేయనున్నది. ప్లీనరీలో అనేక విషయాలను కూలంకుశంగా చర్చించనున్నారు.