తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పై తాజా అప్డేట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు జరగనున్న 49 కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు జరగనున్న 49 కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తులో ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో టపాసులు కాల్చేందుకు అనుమతులు నిరాకరించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారని వెల్లడించారు. కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కింపు చేపట్టనున్నారు. తొలి ఫలితం ఉదయం 10:30 గంటలకు వెలువడే అవకాశం ఉంది