‘ధరణి’తో భూమి పట్టా మార్చారని.. కలెక్టరేట్‌ బిల్డింగ్ పైకెక్కి దంపతుల ఆత్మహత్యయత్నం

చాక‌చాక్యంగా ర‌క్షించిన పోలీసులు భూసమస్యలతో అన్నదాత ఆందోళన జనగామ కలెక్టరేట్ వద్ద కలకలం ప్రజావాణిలో ఆగని భూ ఫిర్యాదులు అసెంబ్లీలో విపక్షాలపై అధికార పక్షం ఫైర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నిన్ననే ధరణి సమస్యపై అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతి పక్షాలు విరుచుక పడగా సమస్యలే లేవంటూ చక్కటి పథకం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పాలకపక్షం ఎదురుదాడి చేసిన దృశ్యాలు ఇంకా కనుమరుగుకాక ముందే జనగామలో రైతు దంపతుల ఆత్మహత్య సంఘటన కలెక్టరేట్ వద్ద జరిగింది. […]

‘ధరణి’తో భూమి పట్టా మార్చారని.. కలెక్టరేట్‌ బిల్డింగ్ పైకెక్కి దంపతుల ఆత్మహత్యయత్నం
  • చాక‌చాక్యంగా ర‌క్షించిన పోలీసులు
  • భూసమస్యలతో అన్నదాత ఆందోళన
  • జనగామ కలెక్టరేట్ వద్ద కలకలం
  • ప్రజావాణిలో ఆగని భూ ఫిర్యాదులు
  • అసెంబ్లీలో విపక్షాలపై అధికార పక్షం ఫైర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నిన్ననే ధరణి సమస్యపై అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతి పక్షాలు విరుచుక పడగా సమస్యలే లేవంటూ చక్కటి పథకం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పాలకపక్షం ఎదురుదాడి చేసిన దృశ్యాలు ఇంకా కనుమరుగుకాక ముందే జనగామలో రైతు దంపతుల ఆత్మహత్య సంఘటన కలెక్టరేట్ వద్ద జరిగింది.

భూ అంశాల పరిష్కారానికే ధరణి తెచ్చామని ప్రభుత్వం, అధికార పార్టీ సమర్థించుకునేందుకు సాహసం చేశాయి. ధరణితో లాభాలే తప్ప, సమస్యలు ఎక్కడివి అంటూ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి రెవెన్యూ అంశం పైన మాట్లాడారు. విపక్ష పార్టీలు విమర్శలు చేయడం తప్ప, ఆరోపణల్లో వాస్తవాలు లేవంటూ ఆరోపించారు.

సమస్యలు లేని చోట ప్రభుత్వంపైనా, పథకంపైనా అనవసర ఆరోపణలు చేస్తూ సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. పైగా ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారనీ అసలు మీకో పాలసీ ఉందా అంటూ ఎదురు ప్రశ్నించారు.

అసెంబ్లీ ముగిసిందో లేదో… అన్నదాత ఆత్మహత్యాయత్నం

బడ్జెట్ సెషన్‌ మొత్తంగా శాసనసభలో ఏదైనా సీరియస్ అంశం చర్చకు వచ్చిందంటే ధరణి వల్ల జరిగిన లాభ నష్టాలపైనే అనేది అందరికి తెలిసిన విషయం. నిన్న శాసనసభ సమావేశం ముగిసిందో లేదో? ప్రభుత్వం భూమి సమస్యలే లేనట్టు ప్రకటిస్తూ వచ్చిన దానికి భిన్నంగా జనగామ కలెక్టరేట్ సాక్షిగా రైతు దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడడం చర్చనీయాంశంగా మారింది.

ప్రజావాణిలో ఆగని రైతుల ఫిర్యాదులు

ప్రభుత్వం చెప్పినట్టు భూ లావాదేవీలకు సంబంధించిన సమస్యలే లేకుంటే అనేక మంది రైతులు సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో తమ భూమి సమస్యలను విన్నవించడం గమనార్హం. పదుల సార్లు తిరిగినా గానీ తమ సమస్య పరిష్కారం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి మండలం, రెవెన్యూ, ఆఖరికి జిల్లా కలెక్టర్లను కూడా సంప్రదించినా భూ సమస్య పరిష్కారానికి తగిన చొరవ చూపడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆవేదనకు గుర‌వుతున్న రైతన్నలు

ఒకవైపు రైతులు తమ ఆవేదన, బాధను వ్యక్తపరుస్తున్నా పరిష్కారం లభిస్తలేదు. మరోవైపు అక్రమాలపై రైతులు విసిగిపోయి ఆత్మహత్యకు ప్రయత్నించడం భూముల సమస్య తీవ్రతను ప్ర‌త్య‌క్ష్యంగా చూపెడుతుందని ప‌లువురు చెబుతున్నారు.

జనగామ కలెక్టరేట్ వద్ద కలకలం

సోమవారం జనగామలో జరిగిన సంఘటన కలకలం సృష్టిస్తుంది. ఇటీవల ఇది రెండో సంఘటన కావడం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు, అతని భార్య తమ భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ జనగామ కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ పైకెక్కి దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో ముప్పు తప్పింది.

జనగామ ఎమ్మార్వో తమ భూమిని ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బిల్డింగ్ మీది నుంచి క్షేమంగా కిందకి దింపారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో శ్రద్ధ వహించి అక్రమాలకు చెక్ పెట్టాలని రైతులు కోరుతున్నారు.

ధరణి ప్రవేశపెట్టినప్పటి నుంచి అధికారుల అక్రమార్జన పెరిగిపోయిందని, కావాలని తంటాలు పెట్టి అక్రమ సంపాదనకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వీటన్నింటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ ప్రదర్శించాలని రైతులు కోరుతున్నారు. లేదంటే ఇలాంటి సంఘ‌ట‌న‌లు మున్ముందు ఇంకెన్ని చూడాల్సి వ‌స్తుందో అని ఆందోళ‌న చెందుతున్నారు.