లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే సీపీఎం పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం పార్టీ నిర్ణయించింది. మొత్తం 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించుకుంది.

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే సీపీఎం పోటీ
  • 17స్థానాల్లో పోటీ.. భువనగిరి అభ్యర్థి ప్రకటన
  • అనిశ్చితిలో సీపీఐ


విధాత, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం పార్టీ నిర్ణయించింది. మొత్తం 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించుకుంది. పోటీలో భాగంగా భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి రామన్నపేటకు చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నేత ఎండి.జహంగీర్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. త్వరలోనే 16 స్థానాల అభ్యర్థులను ప్రకటించనున్నట్లుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్య ప్రకటించారు.


కాగా సీపీఎం ఒంటరి పోటీపై పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఇండియా కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లోనూ పొత్తులు, సీట్ల సర్ధుబాటుపై చొరవ తీసుకుని తమతో చర్చించలేదన్నారు. అందుకే తాము అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని, సీపీఐ పోటీ చేయని చోట ఆ పార్టీ మద్దతు కోరుతామని తెలిపారు.


అటు సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుని కొత్తగూడెం సీటును గెలిచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం సాధించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఒక్క సీటైనా తమకు కేటాయించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ముందు ప్రతిపాదన ఉంచింది. అయితే కాంగ్రెస్‌లో ఎంపీ టికెట్ల పోటీ తీవ్రంగా ఉండటంతో సీపీఐకి సీటు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సీపీఐ ఏమి చేయబోతున్నది ఆసక్తికరంగా మారింది.


సీపీఎం ఇప్పటికే మొత్తం 17స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. అదే బాటలో సీపీఐ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా లేక కాంగ్రెస్‌కు మద్దతునిస్తుందా తేలాల్సివుంది. ఇప్పుడు సీపీఐ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన పక్షంలో ఇప్పటికే అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన సీపీఎం సోదర సీపీఐ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో నుంచి తప్పుకోవాల్సివుంటుంది. లేని పక్షంలో ఉభయ కమ్యూనిస్టుల మధ్య పోటీ తప్పని పరిస్థితి నెలకొననుండటం ఆసక్తికరం.