తిరుమలలో ఇసుకేస్తే రాలనంత జనం.. గరుడ వాహనంపై శ్రీమలయప్ప సాక్షాత్కారం
విధాత, తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వాహన సేవగా గుర్తింపు పొందిన పున్నమి గరుడ సేవ శనివారం రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభమైంది. గరుడ వాహనంపై శ్రీవారు తిరుమల మాఢ వీధుల్లో విహరించారు. శ్రీవారి గరుడ సేవను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా మాఢ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. భారత […]

విధాత, తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వాహన సేవగా గుర్తింపు పొందిన పున్నమి గరుడ సేవ శనివారం రాత్రి 7 గంటల సమయంలో ప్రారంభమైంది. గరుడ వాహనంపై శ్రీవారు తిరుమల మాఢ వీధుల్లో విహరించారు.

శ్రీవారి గరుడ సేవను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా మాఢ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ సతీసమేతంగా పున్నమి గరుడ సేవలో పాల్గొన్నారు. సీజేఐతో పాటు ఏపీ, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా స్వామి వారి గరుడ సేవకు హాజరయ్యారు.

మహతి కళాక్షేత్రంలో మైమరపింపచేసిన భరతనాట్య విన్యాసాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా మహతి కళాక్షేత్రంలో తమిళనాడులోని కారైకల్‌కు చెందిన నాట్యాలయ సంస్థ కళాకారులు ప్రదర్శించిన భరతనాట్య విన్యాసాలు ఆహూతులను అలరించాయి. ముఖ్యంగా కాళీయమర్దనం ఘట్టం, పాండురంగ భజన, ముద్దుగారే యశోద, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం కీర్తనలకు కళాకారులు చక్కగా నృత్య ప్రదర్శన చేశారు.

శ్రీనిధి, ఐశ్వర్య, స్వాతి, కౌశిక, బేబీ మీనాక్షి, హరిణి, అనూరాధ, అభినయదర్శిని తదితర నర్తకీమణులు చేసిన భరతనాట్యం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది.

అదేవిధంగా, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు అనంత పురానికి చెందిన ఆరవింద్ ఆర్ట్స్ అకాడమి సభ్యులు పలు భక్తి సంకీర్తనలు చక్కగా ఆలపించారు. అదేవిధంగా, రామచంద్ర పుష్కరిణిలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు మైదుకూరుకు చెందిన కొండపల్లి ఉదయకుమార్ బృందం బుర్రకథ వినిపించారు.

ఇసుకేస్తే రాలనంత జనం
బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమల భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులతో మాడవీధుల్లోని గ్యాలరీలు ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. కొండపై పార్కింగ్ ఫుల్ అయింది. దీంతో అలిపిరి దగ్గరే వాహనాల నిలిపివేస్తున్నారు. అలిపిరి నుంచి ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. తిరుపతిలో 13 చోట్ల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.
పెరటాశి రెండవ శనివారం కూడా కలసిరావడంతో భక్తులు భారీగా తిరుమలకు వచ్చారు. ఆలయంలోని మూలవర్లకు అలంకరించే సహస్రనామమాల, లక్ష్మీహారం, మకరకంటి, పచ్చ, సూర్యకఠారి, ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాలతో అలంకృతుడై గరుత్మంతుడిని అధిరోహించి మాడవీధుల్లో ఊరేగే మలయప్పను చూసి తరించేందుకు చాలామంది ముందు రోజే తిరుమలకు చేరుకోవడం ఆనవాయితీ.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం మధ్యాహ్నం నుంచే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్టుమెంట్లు భక్తులతో నిండాయి. ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేసి సర్వ దర్శనాలను మాత్రమే అమలు చేస్తున్న క్రమంలో వేగంగా స్వామిని దర్శించుకుంటున్నారు.
శుక్రవారం స్వామిని దర్శించుకుంటే శనివారం వాహనసేవలో పాల్గొనవచ్చనే అభిప్రాయంతో చాలా మంది భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో భక్తులకు క్యూలైన్ల వద్ద నిరంతరాయంగా అన్న ప్రసాదాలు వితరణ చేస్తున్నారు.