CTET 2024 | సీటెట్-2024 జూలై నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటిదాకా అంటే..!

CTET 2024: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 జూలై (CTET-2024 July) నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండుసార్లు సీటెట్ నిర్వహిస్తారు. ఏటా జూలై, డిసెంబర్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తాజా నోటిఫికేషన్‌కు సంబంధించి ఈ ఏడాది జూలై 7న సీటెట్ పరీక్ష జరుగుతుంది. అయితే ఈ పరీక్ష కోసం దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది..? ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి..? దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు లాంటి వివరాలను ఇప్పుడు చుద్దాం…
ఈ పరీక్ష కోసం రాయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (ctet.nic.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 7 నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఏప్రిల్ 2వ తేదీతో ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది. దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 20 భాషల్లో రెండు పేపర్లుగా సీటెట్ పరీక్ష నిర్వహిస్తారు. CTET పేపర్-1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 1 నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి, పేపర్-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి అర్హులవుతారు.
సీటెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, ఆర్మీ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. CTET సర్టిఫికెట్ చెల్లుబాటు జీవితకాలం ఉంటుంది. పరీక్షకు రెండు రోజుల ముందు అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. ఆగస్టు చివరలో ఫలితాలను ప్రకటిస్తారు. దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే ఏప్రిల్ 8 నుంచి 12 తేదీల మధ్య సరిచేసుకోవచ్చు.
పేపర్-1 దరఖాస్తుకు అర్హతలు
50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు 4 సంవత్సరాల B.EI.Ed లేదా 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా చేసి ఉండాలి.
పేపర్-2 దరఖాస్తుకు అర్హతలు
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్‌తోపాటు డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ 50% మార్కులతో ఉత్తీర్ణతతోపాటు B.Ed లేదా 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు 4 సంవత్సరాల B.EI.Ed. లేదా 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు 4 సంవత్సరాల B.A.Ed/B.Sc.Ed లేదా 50% మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు B.Ed (స్పెషల్ ఎడ్యుకేషన్) పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు రుసుము
జనరల్, OBC అభ్యర్థులకు పేపర్-1 లేదా పేపర్-2 ఏదో ఒకటే రాస్తే రూ.1000, రెండు పేపర్లకు అయితే రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2లలో ఏదో ఒకటే రాస్తే రూ.500, రెండు పేపర్లు రాయాలనుకుంటే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష షెడ్యూల్
సీటీఈటీ పేపర్-2 జూలై 7న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా సీటీఈటీ పేపర్-1 జూలై 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు జరుగుతుంది.