ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్‌

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనుంది. వాయుగుండం ఆదివారం సాయంత్రం కల్లా మిచౌంగ్ తుఫాన్‌ గా బలపడనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది

  • By: Somu    latest    Dec 02, 2023 12:35 PM IST
ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్‌
  • తమిళనాడు.. ఏపీలలో అప్రమత్తత


విధాత: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనుంది. వాయుగుండం ఆదివారం సాయంత్రం కల్లా మిచౌంగ్ తుఫాన్‌ గా బలపడనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. డిసెంబర్ 4 సాయంత్రం తుఫాన్‌ చెన్నై- మచిలీపట్నం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) అంచనా వేసింది.


తుఫాను కారణంగా తిరువళ్లూరులో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. చెన్నైకి ఆగ్నేయం నుంచి 790 కి.మీ దూరంలో ఉన్న అల్పపీడన ద్రోణి వాయువ్య దిశలో కదిలి తీవ్ర అల్పపీడనంగా మిచౌంగ్‌ తుఫాన్‌గా మారి డిసెంబర్ 4 నాటికి చెన్నై, మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని వాతావరణ అధికారులు భావిస్తున్నారు. రానున్న మూడు రోజులులో గంటకు 50 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఆంధ్ర ప్రదేశ్ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.


తుఫాన్‌ ప్రభావంతో ఉత్తర తమిళనాడులో డిసెంబర్ 4న తిరువళ్లూరులో అతి భారీ వర్షాలు కురుస్తాయని, చెన్నై, కాంచీపురం, రాణిపేట్, వెల్లూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, చెంగల్‌పట్టులో భారీ నుంచి అతి భారీ వర్షాలు… విలుపురం, కళ్లకురిచిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణలో కూడా 4,,5,6తేదీల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని భావిస్తున్నారు.


కోస్తాంధ్ర సీమా జిల్లాల్లో మిచౌంగ్‌ తుఫాన్ నేపధ్యంలో కలెక్టరేట్లు, రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలో చేపల పెట్టకు వెళ్ళద్దని ఆదేశాలిచ్చారు. ఏపీలో ఇప్పటికే 70% పంట కోత జరిగినప్పటికి మిగిలిన 30% పంటలను, కుప్పలను కాపాడుకునేందుకు రైతాంగం అప్రమత్తంగా ఉండాలని అధికార యంంత్రాంగం సూచించింది. కాగా మిచౌంగ్ తుఫాన్‌ నేపథ్యంలో విశాఖలో డిసెంబర్ 4న జరగాల్సిన నేవీ డే వేడుకలను ఇండియన్‌ నేవి వాయిదా వేసింది.