పదేళ్లలో మీరెంత సంపాదించారు: దానం నాగేందర్

- బీఆరెస్ నేతలపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
విధాత, హైదరాబాద్: బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి మూడు నెలల పాలనలో 3500కోట్లు సంపాదిస్తే పదేళ్ల పాలనలో బీఆరెస్ నేతలు ఎంత సంపాదించారో ప్రజలు లెక్కలేసుకోవాలని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎద్దేవా చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ నా అనర్హత పిటిషన్‌పై కోర్టులో సమాధానం చెబుతానన్నారు.
ఆనాడు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను మీరు పార్టీలో చేర్చుకోవడం సబబైతే నా పార్టీ మార్పు కూడా సబబేనన్నారు. తాను ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీలు మారలేదని, బీఆరెస్ పాలనలో ఆ పార్టీ పెద్దలకు కమిషన్లు ఇస్తూ ఎమ్మెల్యేలు వందల కోట్లు పోగేసుకున్నారని ఆరోపించారు. నేను అలాంటి పని చేయలేదన్నారు. బీఆరెస్‌లో సరైన గుర్తింపు దక్కకపోవడం మూలంగానే పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. స్వతహాగా కేసీఆర్ మంచి నాయకుడేనని, చుట్టు ఉన్న వారే ఆయనను భ్రష్టుపట్టించారని దానం చెప్పారు.