Data leak: అన్నీ రాష్ట్రాల డేటా లీక్.. షాపింగ్‌మాల్స్‌, విద్యార్థులు, ఫుడ్‌ యాప్స్‌ నుంచి చోరీ

విధాత: అంగట్టో సరుకులా ఏకంగా 66.9 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటాను విక్రయిస్తున్న మరో నేరగాడిని సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. 16.8 కోట్ల డేటా చోరీ మరవకముందే 66.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచార దొంగిలించి ఇంటర్‌నెట్‌లో అమ్మకానికి పెట్టిన ఘరానా నేరగాడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. 24 రాష్ట్రాలు, 8 మెట్రో నగరాలకు చెందిన వ్యక్తిగత డేటా నిందితుడి దగ్గర లభించడం కలకలం సృష్టిస్తున్నది. విలువైన వ్యక్తిగత సమాచారాన్ని 104 కేటగిరీలుగా విభజించి […]

  • By: krs    latest    Apr 02, 2023 3:27 AM IST
Data leak: అన్నీ రాష్ట్రాల డేటా లీక్.. షాపింగ్‌మాల్స్‌, విద్యార్థులు, ఫుడ్‌ యాప్స్‌ నుంచి చోరీ

విధాత: అంగట్టో సరుకులా ఏకంగా 66.9 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటాను విక్రయిస్తున్న మరో నేరగాడిని సైబరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. 16.8 కోట్ల డేటా చోరీ మరవకముందే 66.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచార దొంగిలించి ఇంటర్‌నెట్‌లో అమ్మకానికి పెట్టిన ఘరానా నేరగాడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. 24 రాష్ట్రాలు, 8 మెట్రో నగరాలకు చెందిన వ్యక్తిగత డేటా నిందితుడి దగ్గర లభించడం కలకలం సృష్టిస్తున్నది.

విలువైన వ్యక్తిగత సమాచారాన్ని 104 కేటగిరీలుగా విభజించి విక్రయిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన నేరగాళ్లు పౌరుల వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతూ..కోట్లు కొల్లగొడుతున్నారు. 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసు మరవకముందే తాజాగా మరో సంచలన కేసును సైబరాబాద్‌ పోలీసులు ఛేదించారు. ఏకంగా 66.9 కోట్ల మంది డేటాను ఢిల్లీకి చెందిన వినయ్‌ భరద్వాజ్‌ దర్జాగా విక్రయిస్తున్నాడు.

అమరక్ష సోహైల్‌, మదన్‌ గోపాల్ నుంచి డేటా కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరగాళ్లతో పాటు ఇతర వ్యాపార ప్రకటనలు అవసరం ఉన్నవారికి అమ్ముతున్నాడు. ఫరీదాబాద్‌ కేంద్రంగా 8 నెలలుగా ఈ దందా చేస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది.

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలకు చెందిన రహస్య, సున్నిత సమాచారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ చెల్లింపులు, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, బిగ్‌ బాస్కెట్‌, ఇన్‌స్టా గ్రామ్‌, .జొమాటో, పాలసీ బజార్‌ వినియోగదారుల వివరాలు లభించాయి.

హర్యానాల ఫరిదాబాద్‌ కేంద్రంగా క్లౌడ్‌ డ్రైవ్‌ లింక్‌ల ద్వారా సమాచారం విక్రయిస్తున్నారు. డేటా విక్రయించడానికి నిందితులు ఇన్‌స్పైర్‌ వెబ్‌ పేరుతో వెబ్‌సైట్‌ సృష్టించారు. సోషల్‌ మీడియాలు, ఆన్‌లైన్‌ ప్రచారం చేస్తున్నారు. ఏ రాష్ట్రంలో ప్రజల ఏ డేటా అవసరం తెలుసుకుని దాని ధర నిర్ణయిస్తున్నారు.

త్వరగా డౌన్‌లోడ్‌ కావాలంటే తాను పంపే సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని దీని కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నిందితుడి వద్ద ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రెండున్నర కోట్ల మంది వ్యక్తిగత డేటా లభ్యమైంది. ఏపీకి చెందిన 2 కోట్ల 10 లక్షల మంది, హైదరాబాద్‌కు చెందిన 55 లక్షల మంది డేటా నిందితుడి వద్ద పోలీసులు కనుగొన్నారు.

యూపీకి చెందిన 21 కోట్ల మంది, మహారాష్ట్రకు చెందిన 4.5 కోట్ల మంది ప్రజల సమాచారం వినయ్‌ భరద్వాజ వద్ద లభించింది. నిందితుడు ఇన్‌స్పైర్‌ వెబ్‌సైట్‌ ద్వారా 10 వేల మంది ఫాలోవర్ల డేటాను రూ. రెండున్నర వేలకు, 50 వేల ఫేస్‌బుక్‌ ఫాలోవర్ల డేటాను రూ. 15 వేలకు విక్రయించాడు. డబ్బు చెల్లించగానే డేటా వచ్చేలా పకడ్బందీ వ్యవస్థ రూపొందించాడు.

సమస్యలు ఉంటే సంప్రదించేందుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు. వివరాలు బైట పడకుండా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నాడు. ప్రచారం కోసం సోషల్‌ మీడియాలోఖాతాలు ఏర్పాటు చేసుకున్నాడు. పేరు, మొబైల్‌ నంబర్‌, పిన్‌కోడ్‌, ఈ-మెయిల్‌ ఐడీ, చిరునామా, విద్యార్థులు వారి తల్లిదండ్రుల వృత్తి, పేటీఎం ఖాతా దారుల వివరాలు, జీఎస్టీ కట్టే వ్యక్తుల వార్షికాదాయం, వాహనదారుల డేటా వంటివి నిందితుడి వద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

డేటా లీక్‌ కావడానికి వాటిని సేకరించిన సంస్థల వైఫల్యమే కారణమని.. వారికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమౌతున్నారు. పౌరుల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ కేసులో మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉన్నది. వ్యక్తిగత డేటా చౌర్యం కేసు తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు నిందితుడి కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించాలని భావిస్తున్నారు.