వేగంగా ఉద్యోగ భర్తీల హామీలు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్న హామీ అమలు దిశగా మూడు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని

  • Publish Date - March 3, 2024 / 12:05 PM IST

గ్యారంటీలలో నాలుగు అమలు చేశాం

పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామన్న హామీ అమలు దిశగా మూడు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరిన్ని ఉద్యోగాల భర్తీకి వేగంగా చర్యలు తీసుకుంటు వరుస నోటిఫికేషన్లు వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం గ్రామంలో 6.50 కోట్ల రూపాయల తో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. బీమవరంలో గ్రామస్థులను కలిశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగ నియామకాల కోసం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పి మూడు నెలల్లోనే 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసామని స్పష్టం చేశారు. గ్రూప్-1, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ వెయ్యడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మార్చి ఒకటో తేదీన 3,65,262 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2 లక్షల 85 వేల మంది పెన్షన్ దారులకు వేతనాలను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. 2019 ఆగస్టు ఒకటో తేదీ నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చిన చరిత్ర లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఆర్థిక పరిస్థితిని బాగు చేసి ఒకటో తేదీ నాడు ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఈ ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలను, ఆరు గ్యారెంటీ ల హామీల అమలులో అలసత్వం లేకుండా ఉద్యోగులు పారదర్శకంగా బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.

పోటీ పరీక్షల కోచింగ్‌కు ప్రభుత్వం తోడ్పాటు

ప్రభుత్వం నియామకం చేయనున్న ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి పేద, మధ్య తరగతి నిరుద్యోగ యువతీ యువకులు హైదరాబాద్ వచ్చి లక్షల రూపాయలు వెచ్చించే ఆర్థిక స్థోమత లేనందున వారికి వెసులుబాటు కల్పించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జి కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని భట్టి తెలిపారు. 119 నియోజకవర్గాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జి కేంద్రాలకు పక్కా భవనాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే శంకుస్థాపన చేయనున్నామని ప్రకటించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో అద్భుతమైన స్టూడియో నిర్మించి నిష్ణాతులైన లెక్చరర్లలతో నిరుద్యోగ యువతీ యువకులకు ఆన్ లైన్ ద్వారా కోచింగ్ ఇప్పించనున్నామని తెలిపారు. కోచింగ్ కు సంబంధించి టైం టేబుల్ ముందుగానే ప్రకటించి ఆ టైం టేబుల్ అనుగుణంగా తరగతులు నిర్వహిస్తామని పేర్కోన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ కోచింగ్ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు, ప్రభుత్వ ఆకాంక్షల మేరకు జీవితంలో ఎదగాలని సూచించారు.