ధ‌ర‌ణి కొంత‌మందికి ఆభ‌ర‌ణం.. చాలా మందికి భారం : భ‌ట్టి విక్ర‌మార్క‌

బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల స‌మ‌యంలో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పైనే ఇరు పార్టీలు ప్ర‌చారం సాగించాయి.

ధ‌ర‌ణి కొంత‌మందికి ఆభ‌ర‌ణం.. చాలా మందికి భారం : భ‌ట్టి విక్ర‌మార్క‌

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల స‌మ‌యంలో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పైనే ఇరు పార్టీలు ప్ర‌చారం సాగించాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను బంగాళాఖాతంలో విసిరేస్తామ‌ని ప‌లుమార్లు కాంగ్రెస్ నాయ‌కులు వ్యాఖ్యానించారు. ఆ నేప‌థ్యంలోనే తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.


ధ‌ర‌ణి కొంత‌మందికి భ‌ర‌ణంగా మారింది.. మ‌రికొంత మందికి ఆభ‌ర‌ణంగా, చాలా మందికి భారంగా మారింద‌ని విమ‌ర్శించారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌తో ఎంతో మంది త‌మ అవ‌స‌రాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేక‌పోయార‌ని గుర్తు చేశారు. పిల్ల‌ల పెళ్లిళ్ల‌కు, చ‌దువుల‌కు ఇత‌ర అవ‌స‌రాల‌ను తీర్చుకోలేక రైతులు తీవ్ర ఆవేద‌న చెందార‌ని తెలిపారు. ఇదంతా లోప‌భూయిష్ట‌మైన ధ‌ర‌ణి పోర్ట‌ల్ కార‌ణంగానే జ‌రిగింది. త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ త‌ర్వాత విచార‌ణ జ‌రిపితే అది నిజ‌మేన‌ని తేలింద‌న్నారు భ‌ట్టి. అందుకే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు త‌మ ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌త‌ను ఇచ్చింద‌ని తెలిపారు.


ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు స‌త్వ‌ర చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని విక్ర‌మార్క పేర్కొన్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేయ‌డానికి ఇప్ప‌టికే ఐదుగురు స‌భ్యుల‌తో ఒక క‌మిటీని నియమించిన‌ట్లు చెప్పారు. అధికారంలోకి వ‌చ్చిన నెల రోజుల్లోనే ఇంత‌టి కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుని నిపుణుల క‌మిటీకి బాధ్య‌త అప్ప‌గించ‌డం గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌లేద‌ని భ‌ట్టి విక్ర‌మార్క గుర్తు చేశారు.