ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న మోడీ సర్కార్: డిప్యూటీ సీఎం భట్టి
లోక్‌సభలో జరిగిన దాడిపై ప్రకటన చేయకపోగా, ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు

- ఇండియా కూటమి నిరసనలో డిప్యూటీ సీఎం భట్టి
- వారిద్దరు ఏదో ఒక రోజు జైలుకెళ్లక తప్పదు సీపీఐ : నేత కూనంనేని
విధాత : కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం లోక్‌సభలో జరిగిన దాడిపై ప్రకటన చేయకపోగా, ప్రశ్నించిన ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఇండియా కూటమి పిలుపు మేరకు ధర్నాచౌక్ వద్ద శుక్రవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం పైనా పెద్ద ఎత్తున దాడి జరుగుతుందని అందుకే బాధతో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు.
ప్రజాస్వామ్యా దేవాలయంగా భావించే భారత పార్లమెంట్ పైనా దాడి జరిగితే ప్రధాని ,హోంమంత్రి ఒక ప్రకటన ఇవ్వాలని ఎంపీలు కోరారని, ప్రధాని వైఖరి అసలు దాడి జరగనట్లుగా ఉందని విమర్శించారు. పార్లమెంట్ పైన దాడి అంటే దేశ ప్రజాస్వామ్యం పైన దాడి అన్నారు. దాడి పై సభలో చర్చ జరగాలి..వివరణ ఇవ్వాలని అడిగిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని, దేశ చరిత్రలో ఎప్పుడు ఇలా జరుగలేదన్నారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు.. ప్రశ్నిస్తే జైళ్లు అన్నట్లుగా మోడీ పాలన ఉందన్నారు.
పొగ బాంబులు వేసిన ఆగంతకులు ఇంకా వేరే దాడి చేసి ఉంటే ప్రపంచం దేశాల ముందు భారత్ చులకనగా మారేదని, పార్లమెంట్ నే రక్షించలేని భారత ప్రభుత్వం దేశాన్ని ఏం రక్షిస్తుందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బోర్డర్ లో ఏదో ఒక అలజడి సృష్టిస్తారని, దేశానికి తలమానికమైన పార్లమెంటును మాత్రం దాడుల నుంచి కాపడలేకపోతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా ,రాహుల్ గాంధీ లు ప్రజలకు బాసట గా నిలిచారన్నారు.
మాజీ పీసీసీ అధ్యక్షుడువి.హనుమంతరావు మాట్లాడుతూ మణిపూర్ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్న ఇంత వరకు ప్రకటన చేయలేదని, లోక్‌సభలో దాడిపైన కూడా మోడీ ప్రభుత్వం అదే రీతిన వ్యవహరిస్తుందన్నారు. పార్లమెంట్ పై దాడి చేసిన ఆగంతకులకు పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీ అని, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. 146 మంది ఎంపీలు లేకుండా బిల్ పాస్ చేసుకుంటారా అని, ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే వైఖరి మంచిది కాదన్నారు. తాను ఎంతో మంది ప్రధానులను చూసానని..మోడీ లాంటి వారిని చూడలేదన్నారు.
రాష్ట్రాల్లో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలదోయడం, చట్టసభల్లో విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే రీతిలో మోడీ పాలన సాగుతుందని విమర్శించారు. సేవ్ డెమోక్రసి పేరుతొ దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు తెలుపుతుందని, వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఔట్.. ఇండియా కూటమి ఇన్ కాబోతుందన్నారు.
సీపీఐ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పార్లమెంట్ మీద దాడి జరగడం అంటే అంబేద్కర్ గుండెపైన దాడి జరిగినట్లేనన్నారు. దాడిపై చర్యలు తీసుకోవాలని కోరితే ఎంపీలను సస్పెండ్ చేసి ప్రధాని ,హోంమంత్రులు హిట్లర్, ముస్సోలిని మాదిరిగా ప్రవర్తించారన్నారు. వారిలాగా ఏదో ఒక రోజు మోడీ, షాలు కూడా జైలుకెళ్లక తప్పదన్నారు. దాడి చేసిన ఆగంతకులకు పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీ అని, ఆయనను ఎందుకు సస్పెండ్ చేయడం లేదన్నారు. రాహుల్ గాంధీ, తృణముల్ ఎంపీ మహువాలు ప్రశ్నిస్తే సభ్యత్వం రద్దు చేస్తారా అని విమర్శించారు.
నరేంద్ర మోడీ తప్పులను ప్రజల్లో ఎండగట్టేందుకు కలిసి నడుద్దామన్నారు. వెంటనే కేంద్రం విపక్ష ఎంపీల సస్పెండ్‌ను ఎత్తివేయాలని లేదంటే ఎన్నికలు సమీపిస్తున్నాయన్న ఆలోచనతో మీరే ఈ కుట్ర చేశాని భావించాల్సివస్తుందని, దీనిపై నిజాలు నిగ్గు తేలాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అధికార ప్రతినిధి మల్లు రవి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, విప్ ఆది శ్రీనివాస్, సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు, ఆప్ పార్టీ, సీపీఐ పార్టీల నాయకులు పాల్గొన్నారు.