‘ధరణి’ సర్వరోగ నివారిణి కాదు.. సవరణో, రద్దు చేయడమో పరిష్కారం కాదు

Dharni, Bhumi Sunil ‘ధరణి’ సవరణో, రద్దు చేయడమో సమస్యకు సంపూర్ణ పరిష్కారం కాదు భూచట్టాల నిపుణుడు, న్యాయవాది భూమి సునీల్ ప్రత్యేక చర్చా పత్రం: పార్ట్‌ -2 ధరణితోనే భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం ధరణిని రద్దు చేయడంపైనేనని కాంగ్రెస్‌ నాయకత్వం ప్రకటిస్తున్నది. క్షేత్రస్థాయిలో ధరణి సమస్యలు ఉన్నాయని రైతుల గోస చూస్తే అర్థమవుతున్నది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ధరణిని రద్దు చేయాలా? లేక […]

  • By: krs    latest    Feb 19, 2023 9:53 AM IST
‘ధరణి’ సర్వరోగ నివారిణి కాదు.. సవరణో, రద్దు చేయడమో పరిష్కారం కాదు

Dharni, Bhumi Sunil

  • ‘ధరణి’ సవరణో, రద్దు చేయడమో సమస్యకు సంపూర్ణ పరిష్కారం కాదు
  • భూచట్టాల నిపుణుడు, న్యాయవాది భూమి సునీల్ ప్రత్యేక చర్చా పత్రం: పార్ట్‌ -2

ధరణితోనే భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. తాము అధికారంలోకి రాగానే మొదటి సంతకం ధరణిని రద్దు చేయడంపైనేనని కాంగ్రెస్‌ నాయకత్వం ప్రకటిస్తున్నది. క్షేత్రస్థాయిలో ధరణి సమస్యలు ఉన్నాయని రైతుల గోస చూస్తే అర్థమవుతున్నది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ధరణిని రద్దు చేయాలా? లేక దాంట్లో సవరణలు తేవాలా? అసలు ధరణి సర్వరోగ నివారిణి అవుతుందా? ప్రత్యామ్నాయమేంటి? ఉన్న సమస్యలేంటి? వాటికి పరిష్కారాలేంటి? ఈ అంశాలపై ప్రముఖ భూచట్టాల నిపుణుడు న్యాయవాది రూపొందించిన అధ్యయనం పత్రం ఇది. దీనిపై మీరూ చర్చించండి. మీ అభిప్రాయాలను పంచుకోండి. మీ వాదనకు మా విధాత వేదికవుతుంది. మీ వాదనను ప్రపంచానికి చాటుతుంది. – విధాత

ఎడారి లాంటి భూమిని పూర్తి హక్కులతో ఒక రైతుకు ఇస్తే ఆ భూమిని కొన్నేళ్లలో బంగారం పండే భూమిగా మారుస్తాడు. అదే బంగారం పండే భూమిని ఎలాంటి హక్కులు లేకుండా అప్పగిస్తే కొన్నేళ్లలో ఆ భూమి ఎడారి భూమిగా మారుతుంది అని ఒక ఆర్థిక శాస్త్రవేత్త పేర్కొన్నాడు. సాగుచేసుకోవడానికి భూమి ఉంటేనే సరిపోదు. ఆ భూమి ఏ హక్కుల చిక్కుల్లో లేకుండా ఉంటేనే సాగు సాఫీగా సాగుతుంది. స్వానుభవంలో భూమి, ఆ భూమికి హక్కుదారు ఎవరో తెలిపే పత్రాలు, భూమి రికార్డుల్లో సరైన వివరాలు నమోదు అయ్యి ఉంటేనే ఆ భూమిపై హక్కుకి భద్రత. ఆ భూమి నుంచి పూర్తి లబ్ధి పొందగలిగే అవకాశం. ఈ తొమ్మిదేళ్ల ప్రయాణంలో సమస్యల పరిష్కారానికి కొంత ప్రయత్నం జరిగింది. కొన్ని భూమి సమస్యలు తీరాయి. మరికొన్ని కొత్త భూమి సమస్యలు పుట్టుకొచ్చాయి. తెలంగాణ రాకముందు ఊరికో వంద సమస్యలు ఉంటే ఇప్పుడు ఊరికో రెండొందల సమస్యలు ఉన్నాయని అంచనా.

భూహక్కుల చిక్కులు లేని తెలంగాణ సాకారం కావాలంటే?

ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన భూమి సమస్యలు

  • సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం చిన్న, సన్నకారు రైతులు పెట్టుకున్న తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరు సాగు చేసుకుంటున్న భూమికి పట్టా లేదు. కొత్త చట్టంలో సాదా బైనామా క్రమబద్ధీకరణ నిబంధన లేకపోవడం, పాత చట్టం కింద ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా దరఖాస్తులు తీసుకోవడంతో హైకోర్టు క్రమబద్ధీకరణపై స్టే విధించింది.
  • భూమి రికార్డులన్నీ ధరణికి ఎక్కాయి. కానీ, ధరణిలో తప్పులను సరి చేయించుకోవడం క్లిష్టతరంగా మారింది. ధరణిలో వివరాలను సరిచేయడానికి పెట్టుకున్న లక్షల దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించే రికార్డు (ధరణి) లో తప్పుల సవరణ కోసం రైతుల దగ్గర వెయ్యి రూపాయల ఫీజు తీసుకోవడం వారికి భారంగా మారింది.
  • లక్షల ఎకరాల పట్టా భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో చేరింది. పట్టా భూమిని నిషేధిత చెరనుండి విడిపించుకోవడం రైతుకు గగనంగా మారింది.
  • ఆర్.ఓ.ఆర్. చట్టం కింద భూ రికార్డులను సవరించే అధికారం మాత్రమే రెవెన్యూ కోర్టుల నుంచి ప్రభుత్వం తొలిగించింది. కానీ అసైన్డ్ భూముల అన్యాక్రాంతం, ఇనాం, పి.టి. భూముల సమస్యలు లాంటి ఇతర భూవివాదాలు ఇంకా రెవెన్యూ కోర్టుల పరిధిలోనే ఉన్నాయి. అయినా ఈ అంశంపై స్పష్టత లేకపోవడం వల్ల రెవెన్యూ యంత్రాంగం ఏ భూమి సమస్యలనూ పరిష్కరించకుండా కోర్టుకు వెళ్ళమని సూచిస్తున్నది. దీనివలన రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
  • 2017 లోపు ఎవరైనా భూమిలేని నిరుపేదలు అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే వారికే ఆ భూమిపై పట్టా ఇచ్చేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ (పీవోటీ) చట్టానికి సవరణ చేసింది. ఇంకా ఈ చట్ట సవరణ అమలుకు నోచుకోలేదు. అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని పలు సందర్భాలలో ప్రభుత్వం చెప్పింది. కొన్ని రకాల అసైన్డ్ భూములను అమ్ముకోవడానికి ఇప్పటికే అవకాశం ఉంది. ఇలాంటి భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుండి తొలగించాల్సి ఉంది. 1958 కి ముందు అసైన్‌ చేసిన భూములు, రాజకీయ బాధితులకు ఇచ్చినవి, మాజీ సైనికులకు, స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన భూములను 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చని చట్టం, కోర్టు తీర్పులు చెబుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
  • తెలంగాణ ఏర్పడిన నాటి నుండి సమగ్ర భూ సర్వే గురించి ప్రభుత్వం ప్రకటనలు చేస్తూనే ఉంది. సర్వే కోసం మొదటి, రెండో బడ్జెట్లలో వెయ్యి కోట్ల కేటాయింపులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 83.85 కోట్లు ఇచ్చింది. 30 ఏండ్లకు ఒకసారి జరగాల్సిన సర్వే తెలంగాణలో 80 ఏళ్లు దాటినా జరగలేదు. భూముల సర్వే చేస్తామని రికార్డుల ప్రక్షాళనకే పరిమితం చేశారు. “ధరణి” తెచ్చినప్పుడు కూడా సర్వే చేస్తామన్నారు కానీ 33 గ్రామాలలో పైలట్ కార్యక్రమం కోసం కసరత్తు చేయడంతోనే ఆగిపోయింది.
  • భూమి రికార్డులలో ఉన్న వివరాలకు ప్రభుత్వమే జిమ్మేదారిగా ఉంటుందని, రికార్డుల్లో పేరు ఉన్న భూయజమాని హక్కులకు భంగం కలిగితే ప్రభుత్వమే జుర్మానా కడుతుందని, అలాంటి వ్యవస్థను తెస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రినే ప్రకటించారు. కానీ ఇంకా అలాంటి చట్టమేదీ రాలేదు. భూ హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ వ్యవస్థను తెచ్చే ప్రయత్నాలు ఈ దేశంలో మూడు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. టైటిల్ గ్యారెంటీ చట్టం అమలులోకి వస్తే భూములన్నింటికీ ఒకే రికార్డు ఉంటుంది. ఆ రికార్డులోని వివరాలకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంది. యజమానికి నష్టం జరిగితే నష్టపరిహారం అందుతుంది.
  • పోడు భూములకు హక్కు పత్రాల కోసం ఇటీవల వచ్చిన నాలుగు లక్షల ధరఖాస్తులను పరిశీలించి, హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉంది. అటవీ, రెవెన్యూ సరిహద్దు వివాదాలు, డీమ్డ్ ఫారెస్ట్ సమస్యలను పరిష్కరించాల్సి ఉంది.
  • కౌలు రైతులు భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నా, సాగుదారుగా గుర్తింపులేక పోవటం వలన రైతుగా పొందాల్సిన ఏ మేలూ పొందలేక పోతున్నారు. కౌలు కాగితమో, రికార్డులో పేరో ఉంటేనే ఏ మేలైనా వారికి దక్కేది. కానీ, ఇవి ఉంటే భూములు పోతాయేమోనని భూయజమానుల భయం. అందుకే కౌలు ఒప్పందాలన్నీ నోటి మాటమీదనే జరుగుతున్నాయి. వెరసి కష్టాల కొలిమిలో కౌలు రైతులు ఉన్నారు. భూమి సాగు చేసుకుంటున్నా కానీ పంట రుణాలు, పంటల బీమా(Crop Insurance) , ఇన్‌పుట్‌ సబ్సిడీ (Input Subsidy), పంట నష్ట పరిహారం.. ఇలా రైతులకు అందే ఏ సహాయం కూడా కౌలుదార్లకు అందటం లేదు. తెలంగాణలో 10 లక్షలకు పైగా కౌలుదారులు ఉంటారు. పాత కౌలు చట్టాలలోని నియమాలతో వీరికి రైతులకు అందే ఏ మేలు దక్కడం లేదు. కౌలుదార్లకు రుణ అర్హత కార్డులు ఇవ్వడం కోసం 2012లో వచ్చిన చట్టం ఇప్పుడు రాష్ట్రంలో అమలు జరగడం లేదు.
  • తెలంగాణలో 100కి పైగా భూమి చట్టాలు అమలులో ఉన్నాయి. నియమాలు, ప్రభుత్వ ఉత్తర్వులు కలుపుకొంటే ఈ సంఖ్య మరెన్నో రెట్లు ఉంటుంది. వీటిల్లో చాలా వరకు కాలం చెల్లినవే. లక్ష్యాలు నెరవేరాక అనవసరంగా మిగిలిన చట్టాలు అనేకం ఉన్నాయి. కొన్ని చట్టాలే ప్రస్తుత అవసరాలకు ఉపయుక్తమైనవి. చట్టాల్లోని వైరుధ్యాలు, ఒకే అంశంపై పలు చట్టాలు ఉండటం, కాలం చెల్లినవి అమలులో ఉండటం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతోంది. కొన్ని సందర్భాలలో చట్టాలు దురుపయోగమవుతుండటానికి ఇదో కారణంగా మారుతుంది.
  • ఏ భూమి సమస్యకు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఎంతకాలంలో పరిష్కరిస్తారు? యాజమాన్య హక్కు వివాదాలు, గెట్టు / హద్దు తగాదాలు, రికార్డుల్లో సమస్యలు, భూముల అన్యాక్రాంతం, భూ ఆక్రమణ, ఇలా భూములకు సంబంధించి దాదాపు ఎనభై రకాల సమస్యలు ఉంటాయని అంచనా. భూచట్టాలు ఒక్కో రకమైన సమస్యకు ఒక్కో రకమైన పరిష్కార మార్గం, పరిష్కరించే వ్యవస్థ, దరఖాస్తు చేసుకునే పద్ధతిని పేర్కొన్నాయి. ఈ అంశాలపై స్పష్టత లేకపోవడం వలన గందరగోళం నెలకొంది, సమస్యల పరిష్కారంలో విపరీత జాప్యం జరుగుతున్నది. ఈ గజిబిజి గందరగోళాల వలన భూతగాదాలు పరిష్కరించడంలో విపరీత కాలయాపన జరుగుతున్నది. ప్రజలు న్యాయం కోసం సరైన కోర్టును / అధికారిని ఆశ్రయించలేక పోతున్నారు. భూ యజమానులకు తీరని నష్టం చేస్తుంది. వివిధ స్థాయిల్లోని రెవిన్యూ కోర్టుల్లో, సివిల్ కోర్టుల్లో, హైకోర్టులో పెండింగ్ లో ఉన్న వివాదాలు/సమస్యలు లక్షల్లో ఉంటాయి. ఇంకా నమోదు కాని కేసులు, గుర్తించని భూమి సమస్యలు కలుపుకొంటే ఈ సంఖ్య మరికొన్ని రెట్లు ఉంటుంది. ఈ వివాదాలు అపరిష్కృతంగా ఉన్నన్నాళ్ళు ప్రజలకు, ప్రభుత్వానికి ఆర్థిక నష్టం. శాంతి భద్రతలకు విఘాతం. నేరాలు పెరగడానికి కారణమౌతాయి.

DHARANI: ‘ధరణి’పై తహసీల్దార్‌, ఆర్డీవోలకూ అధికారాలు? వికేంద్రీకరణ దిశగా యత్నాలు!

తక్షణ కర్తవ్యం

ప్రతి భూ యజమాని కోరుకునేది తన భూమి హద్దులకు స్పష్టత, ఆ భూమిపై హక్కులకు పూర్తి భద్రత; సమస్య వస్తే సత్వరం పరిష్కరించే వ్యవస్థ. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎనభయ్యవ దశకం నుండి ప్రయత్నం చేస్తున్నది. వచ్చే ఏడాది నాటికి ఈ లక్ష్యం నెరవేర్చాలంటున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, భూములకు ఒకే రికార్డు, దస్తావేజుల రిజిస్ట్రేషన్ కాకుండా హక్కుల రిజిస్ట్రేషన్ చేసే విధానం, భూహక్కులకు ప్రభుత్వమే హామీ, భూహక్కులకు ఇన్సురెన్స్, ఎక్కడి నుండైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు, వివాద పరిష్కారాలకు ట్రిబ్యునళ్ల ఏర్పాటు కేంద్రం అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా (Digital India) భూరికార్డుల ఆధునీకరణ పథక లక్ష్యాలు. కానీ అమలు రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుంది. భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం.

  • భూమి సమస్యలు పరిష్కారం కావాలంటే సర్వే తప్పనిసరి. ఒకప్పుడు భూముల సర్వేకు కొన్ని సంవత్సరాలు పట్టేది. కానీ, ఇప్పుడు. ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ETS), జీపీఎస్(GPS), డీజీపీఎస్‌ (DGPS), డ్రోన్స్ లాంటి అధునాతన పరిజ్ఞానాలు అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో చాలా తక్కువ సమయంలో సర్వే చేయవచ్చు. భూయజమానులు, ప్రజలను భాగస్వాములను చేస్తూ, గ్రామీణ యువతీ యువకుల సేవలను వినియోగించుకుంటూ సర్వే నిర్వహిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. 1923లో చేసుకున్న సర్వే మరియు హద్దుల చట్టం స్థానంలో కొత్త చట్టం రూపొందించుకోవాలి. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యేలోపు కొన్ని తాత్కాలిక చర్యలు తీసుకోవాలి. భూమి లావాదేవీ జరిగిన ప్రతిసారీ ఆ భూభాగానికి సర్వే తప్పనిసరి చేయాలి. సర్వే సెటిల్మెంట్ శాఖలో ఉన్న సర్వేయర్లతో పాటు లైసెన్స్‌డ్‌ సర్వేయర్స్ (Surveyors) కూడా భూములు కొలవడానికి ప్రభుత్వం అనుమతించింది. అందుకనుగుణంగా ఎక్కువమందికి లైసెన్సుడ్ సర్వేయర్లుగా శిక్షణ ఇవ్వాలి. తద్వారా ఇప్పుడున్న సర్వేయర్ల కొరత తీరుతుంది. అంతేకాక, గ్రామీణాభివృద్ధి శాఖలో దశాబ్దకాలంగా పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్ల సేవలను సర్వే సెటిల్మెంట్ శాఖ వినియోగించుకోవాలి.
  • భూమి హక్కులకు పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారెంటీ వ్యవస్థను తేవాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నట్లుగా టైటిల్ గ్యారెంటీ చట్టం చెయ్యాలి.
  • భూ సంబంధిత అంశాలపై ఒకే చట్టం ఉండి, అది సులభమైన భాషలో ఉంటే రైతులకు అర్థం అవుతుంది. అమలు చేసే వారికి సులభంగా ఉంటుంది. అన్ని భూమి చట్టాలను కలిపి ఒక రెవిన్యూ కోడ్ (Revenue Code)లేదా భూమి చట్టంగా రూపొందించాలి.
  • “ధరణి” సమస్యలు పరిష్కరించడం కోసం అందులోని వివరాలను కాగితాలకు ఎక్కించాలి. వాటిని గ్రామాలకు పంపి, ప్రజల భాగస్వామ్యంతో సర్వే నంబర్ల వారీగా సమస్యలను గుర్తించాలి. అలా గుర్తించిన సమస్యలను గ్రామంలోనే రెవెన్యూ కోర్టు పెట్టి పరిష్కరించాలి. సవరించిన దస్త్రాలను కంప్యూటరుకు ఎక్కించాలి. ఎలా చెయ్యాలో మహబూబాబాద్ జిల్లాలోని పుట్టల భూపతి అనే మారుమూల గిరిజన గ్రామం ఓ ఉదాహరణ. ప్రజల భాగస్వామ్యంతో భూరికార్డులను సవరించి, అందరికీ పట్టాలు అందజేశాము. ఈ గ్రామానికి పదిహేడు రాష్ట్రాల బృందం వచ్చి పరిశీలించింది. వీరు పొగిడారనే రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని బహిరంగ సభలలో చెప్పింది. అన్ని గ్రామాలు పుట్టల భూపతులు అయితే ధరణి సమస్యలు తీరిపోతాయి.
  • అన్ని రకాల భూమి వివాదాలకు సత్వర పరిష్కారం దొరకాలంటే భూవివాదాల పరిష్కార చట్టం (Land Disputes Act) తేవాలి. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో భూమి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. నిర్ణీత గడువులో వివాద పరిష్కారాలు జరగాలి. భూవివాదాల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో తేవాలి. వివాదాల పరిష్కారాల పురోగతిని ప్రభుత్వం తరుచు సమీక్షించాలి.
  • కౌలు రైతుల కష్టాలు తీరాలంటే చట్టాలు మారాలి. కౌలు చట్టాలలో సంస్కరణలు తక్షణ అవసరం అని నీతి ఆయోగ్ నియమించిన కౌలు సంస్కరణల నిపుణుల కమిటీ 2016 లో తన నివేదికలో పేర్కొంది. ఈ కమిటీ ఒక నమూనా చట్టాన్నికూడా రూపొందించింది. ఈ నమూనా చట్టం ఆధారంగా తమ రాష్ట్రంలో ఉన్న కౌలు చట్టాలను మార్చుకోవాలని లేదా కొత్త చట్టాన్ని రూపొందించుకోవాలని సూచించింది. రైతుకు అందే ప్రతి మేలు కౌలు రైతుకు కూడా అందాలి. అందుకోసం ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించాలి.
  • పోడు సాగు చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలి.
  • పేద ప్రజలకు భూమి సమస్యలు, వివాదాలు వచ్చినపుడు సాయమందించడానికి పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వ్యవస్థ లక్షలమంది పేదలకు సాయమందించి వారికి భూమి హక్కులు దక్కేలా చేసింది.
  • భూమిలేని నిరుపేద కుటుంబాలకు భూములు ఇచ్చే మార్గాలు వెతకాలి.
  • భూ విధానం, భూమి వినియోగ విధానాలను రూపొందించాలి.
  • భూపరిపాలను మెరుగు పరచాలి. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు భూపరిపాలన సిబ్బందిని నియమించాలి. భూమి అకాడమీని ఏర్పాటు చెయ్యాలి.
  • సమగ్ర చర్యల కోసం ఒక భూమి కమిషన్‌ను (Land commission) ఏర్పాటు చెయ్యాలి.

ఆర్థిక ప్రగతికి, అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, సామాజిక ఆర్థిక సమన్యాయం సాధించడానికి, అందరూ అభివృద్ధిలో సమభాగం కావడానికి భూమే కీలకం. భూమి సంబంధిత అంశాలపై దృష్టిపెట్టడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రభుత్వాల కనీస బాధ్యత. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలంటే భూమి ఎజెండా అమలు కీలకం. భూ చట్టాల అమలు, భూ పరిపాలన మెరుగు తప్పనిసరి. భూమి ముఖ్యమైన అంశం. సంక్లిష్టమైన అంశం కూడా. అందుకే భూమి సమస్యలు తీరాలంటే సమగ్ర, శాశ్వత పరిష్కారాలు ఆలోచించాలి. వాటిని చిత్తశుద్ధితో అమలు చెయ్యాలి. అంతేకానీ, ధరణి చుట్టే చర్చ పరిమితమైతే తెలంగాణలో భూమి సమస్యలు పరిష్కారం కావు.

(తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు అయింది. ఈ సందర్బంగా మరో సారి.. 2014 లో ‘ల్యాండ్ కారవాన్’ నిర్వహించిన దారిలోనే మళ్ళీ ప్రయాణించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నాం. వారి అభిప్రాయాల ఆధారంగా మరోసారి తెలంగాణ ప్రజల భూమి మ్యానిఫెస్టో రూపొందిస్తాము. మీరూ కలిసి రండి). తెలంగాణ అంటేనే భూమి.. భూమి అంటేనే తెలంగాణ.. భూమి అజెండా అందరి అజెండా కావాలని ఆకాంక్షిస్తూ…

భూమి సునీల్
భూచట్టాల నిపుణులు, న్యాయవాది
ఫోన్‌ నెంబర్‌ : 9000222674
ఈ మెయిల్: landsunilindia@gmail.com , vidhathanews@gmail.com