Train: స్టేషన్ దాటడానికే గంట.. ప్రపంచంలో పొడవైన ట్రైన్! ఎక్కడ ఉందంటే

విధాత: ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా భారతీయ రైల్వేకు ఎప్పటి నుంచో పేరుంది. ప్రతీ రోజూ సుమారు 4 కోట్ల మంది ప్రయాణికులను ఇండియన్ రైల్వే తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది. అయితే.. ఎక్కడైనా ..ఏ దేశంలోనైనా గూడ్స్ రైలుకు 25 నుంచి 50 బోగీలు ఉంటాయి. కానీ ఈ రైలు అందుకు భిన్నం. దీనికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 295 బోగీలతో ఉండి అందరినీ ఆశ్యర్య పరుస్తోంది. అయితే ఈ ట్రైన్ మరే దేశంలోనో కాదు మన దేశం అందులోనూ మన సమీప రాష్ట్రం కావడం మరింత విడ్డూరం.
ప్రపంచంలోనే అతి ఎత్తైన వంతెనలపై, అడవుల్లో నడిచే, ప్రకృతి అందాల మధ్యలో నడిచే రైళ్లు చాలానే ఉన్నాయి. ఈ కోవలోనే ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రైలు ఇటీవల డాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. భారతదేశంలో అత్యంత పొడవైన రైలు మార్గంగా, పెద్ద రైలుగా దీనికి పేరుండగా దీనిని సూపర్ వాసుకి (Vasuki) కార్గో ట్రెయిన్‌గా పిలుస్తుంటారు. ఈ కార్గో రైలు పొడవు సుమారు 3.5 కిలోమీటర్లు ఉండగా ఈ రైలు ఏ స్టేషన్ అయినా దాటాలంటే గంట సమయం పట్టడం గమనార్హం. అంతేకాదు ఈ భారీ ట్రెయిన్‌ను లాగేందుకు 6 ఇంజన్లు పని చేస్తాయి.
కాగా ఈ సూపర్ వాసుకి (Vasuki) ట్రైన్‌ను జనవరి 2021నుంచి ప్రారంభించగా ఈ ట్రైన్ ద్వారా దేశంలోని వివిధ గనుల నుంచి సేకరించిన బొగ్గు పెద్ద విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేస్తున్నారు. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్‌లోని రాజ్‌నంద్‌గావ్ వరకు సుమారు 27 వేల టన్నుల బొగ్గును తీసుకెళ్తుంది. ఈ రెండు నగరాల మధ్య దూరాన్ని ఈవాసుకి ట్రైన్ 11.20 గంటల్లో కవర్ చేస్తుంది. శివుడి మెడలో ఉండే సర్పం వాసుకి పేరును రైల్వే పెద్దలు ఈ రైలుకు నామకరణం చేయడం విశేషం.