విధాత, హైదరాబాద్ : తెలంగాణలో 9 మంది పార్లమెంటు అభ్యర్థులతో బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాపై టికెట్ ఆశించి భంగపడిన నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. హైదరాబాద్ టికెట్ ఆశించిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకంగా తనను కాదని నగరంలోని విరించి హాస్పిటల్స్ యజమాని, స్థానికేతర మహిళ కొంపెల్ల మాధవీలతకు టికెట్ ఇవ్వడంపై భగ్గుమన్నారు. కరోనా సమయంలో ఇష్టారీతిన బిల్లులు వేయడం, ట్రీట్‌మెంట్లు చేయడంతో ప్రభుత్వం విరించి హాస్పిటల్‌లో వైద్యాన్ని నిలిపివేసిందని గుర్తు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేయించడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డికి మగాడే దొరకలేదా అంటూ రాజా సింగ్ ఏకంగా ఆయన మీదే విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పటికీ కూడా పార్టీలో చేరలేదని, సోషల్ మీడియాలో సొల్లు చెబుతారని ఆరోపిస్తూ.. మాధవీలతకు సీటు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తనదారి తాను చూసుకుంటానన్న బాపూరావు
హైదరాబాద్‌తోపాటు జహీరాబాద్, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి స్థానాల అభ్యర్థుల ఎంపిక పట్ల కూడా పార్టీ సీనియర్ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అటు అదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు తొలి జాబితాలో లేకపోవడం పట్ల ఆయన సీరియస్‌గా ఉన్నారు. ఆదివాసీ నేతనైన తనకు టికెట్ దక్కకుండా పావులు కదిపారని అవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడ గెలుస్తానో అనే భయం వాళ్లకు పట్టుకుందని సీరియస్ కామెంట్స్ చేశారు. తాను కొమ్మపై ఆధారపడిన మనిషిని కాదని.. స్వతహాగా ఎదిగిన వ్యక్తినని చెప్పుకొన్నారు. మలి జాబితాలో టికెట్ రాకపోతే తన దారి తాను చూసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు తనదేనని, గెలిచేది కూడా తానేనని ధీమా వ్యక్తం చేశారు. తనకు రెండో జాబితాలో టికెట్ దక్కుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు.
అసంతృప్తితో మురళీధర్‌రావు
మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశించిన పార్టీ సీనియర్ నేత పొల్సాని మురళీధర్ రావు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానంటూ సంచలన ట్వీట్ చేశారు. పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆయన సహకరిస్తారా? లేదా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే విషయాల్లో కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొన్నది. అలాగే నాగర్ కర్నూల్ ఎంపీ స్థానాన్ని ఆశించిన బీజేపీ జాతీయ నేత బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి నిరాశతో పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తున్నది.
అసమ్మతి గుబులుతో పెండింగ్‌లో కీలక సీట్లు..
టికెట్ల కోసం పోటీ అధికంగా ఉండి ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు అసమ్మతి గళం వినిపించే అవకాశముండటంతో పాటు వలస నేతలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధిష్ఠానం మహబూబ్‌నగర్, మెదక్ స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్లుగా సమాచారం. వరంగల్, పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, అదిలాబాద్ స్థానాల కూడా అభ్యర్థులను ప్రకటించాల్సివుంది. తొలి జాబితాలో అభ్యర్థుల ఎంపిక చూస్తే పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్లుగా కనిపిస్తుందని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. తొలి జాబితాలోని తొమ్మిది మందిలో ఏడుగురు జంపింగ్ అభ్యర్థులకే టికెట్లు ఇచ్చారని విమర్శిస్తున్నారు. పార్టీ మారిన వారికే తప్ప సిద్ధాంతాలను నమ్ముకున్న వారికి మొండి చేయి ఎదురైందని వాపోతున్నారు. ‘టికెట్ సాధించిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ 2024లో బీజేపీలో చేరారు. ఒక రోజు ముందు నాగర్ కర్నూల్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ పార్టీలో చేరారు. హైదరాబాద్ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత పార్టీలో ఇంకా చేరనేలేదు. భువనగిరి, చేవెళ్ల అభ్యర్థులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 2022లో బీజేపీలో చేరారు. నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ 2017లో పార్టీలో చేరగా, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ 2021లో చేరారు’ అని సీనియర్ నేతలు గుర్తు చేస్తున్నారు. సీనియర్ నేతలు పొల్సాని మురళీధర్ రావు, బంగారు శృతి లాంటి వారికి పార్టీ మొండి చేయి చూపిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా మురళీధర్ రావుకు ఏ పదవీ ఇవ్వలేదు. రెండేండ్ల కింద రాజ్యసభ సీటు ఆశిస్తే బీసీ కోటా కింద డాక్టర్ కోవ లక్ష్మణ్‌కు కేటాయించారు. ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశించినా.. మళ్లీ అధిష్ఠానం హ్యాండ్ ఇవ్వడం ఆయనను నిరాశకు గురిచేసిందని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. గత పది సంవత్సరాల నుంచి ఆయన మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు సన్నిహితంగా ఉండడం, బీజేపీ అంతర్గత విషయాలను చేరవేస్తున్నారనే అనుమానం బలపడటంతో అగ్రనాయత్వం ఆయనను దూరం పెట్టిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. జాతీయ నాయకుడినని చెప్పుకొన్నప్పటికీ రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గాన్నీ ఎంపిక చేసుకోకుండా పారాచూట్ లీడర్‌గా ఎదగాలని చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడం ఆయనకు మైనస్‌గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలియగానే ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా జట్టుకట్టి ప్రసార సాధనాల్లో ఆయనకు వ్యతిరేకంగా వార్తలు పోగు చేయించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మహబూబ్ నగర్ సీటు కోసం మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పోటీ పడుతున్నారు. తాజాగా జితేందర్ రెడ్డి పార్టీ నాయకుల తీరుపై చేసిన ట్వీట్ అరుణకు అడ్డంకిగా మారిందంటున్నారు. అందుకే ఈ సీటును తేల్చడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. మెదక్ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఎం రఘునందన్ రావు, సీనియర్ నాయకురాలు గోదావరి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. తనకు మూడుసార్లు టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఈసారి కచ్చితంగా ఇవ్వాల్సిందేనని ఆమె పట్టుపడుతున్నారు. దుబ్బాకలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన రఘునందన్‌కు మళ్లీ ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని నాయకులు ప్రశ్నించడంతో పార్టీ పెద్దలు పునరాలోచనలో పడ్డారని సమాచారం. పెండింగ్‌లో ఉన్న వాటిలో వివాదంగా మారిన సీట్లను మలి విడత జాబితాలో ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.