BRS కు అసంతృప్తులు, రెబల్స్‌ బెడద!.. 78 స్థానాల్లో సంకటం..!

బీఆరెస్‌కు అసంతృప్తులు, రెబల్స్‌ బెడద! పలుచోట్ల పోటీలో ఇద్దరికి మించి.. సిటింగులపై తిరుగుబావుటాలు అక్రమాలపై అసంతృప్తి జ్వాలలు ద్వితీయ నాయకత్వంలో అసమ్మతి అవసరమైనచోట అధిష్ఠానం జోక్యం కొన్ని చోట్ల ఎందుకో మౌన ముద్ర! హైదరాబాద్‌లో ఎంఐఎం సీట్లు మినహా 34 చోట్ల సిటింగ్‌లకు పోటీ లేరు విధాత క్షేత్రస్థాయి పరిశీనలో వెల్లడి (విధాత న్యూస్‌ నెట్‌వర్క్‌) BRS | సిట్టింగ్‌లపై వ్యతిరేకత, పార్టీలో అసంతృప్తులు, తమకే టికెట్‌ కావాలంటూ నేతల పోటీ పడుతున్న తీరు బీఆరెస్ (BRS) […]

BRS కు అసంతృప్తులు, రెబల్స్‌ బెడద!.. 78 స్థానాల్లో సంకటం..!
  • బీఆరెస్‌కు అసంతృప్తులు, రెబల్స్‌ బెడద!
  • పలుచోట్ల పోటీలో ఇద్దరికి మించి..
  • సిటింగులపై తిరుగుబావుటాలు
  • అక్రమాలపై అసంతృప్తి జ్వాలలు
  • ద్వితీయ నాయకత్వంలో అసమ్మతి
  • అవసరమైనచోట అధిష్ఠానం జోక్యం
  • కొన్ని చోట్ల ఎందుకో మౌన ముద్ర!
  • హైదరాబాద్‌లో ఎంఐఎం సీట్లు మినహా
  • 34 చోట్ల సిటింగ్‌లకు పోటీ లేరు
  • విధాత క్షేత్రస్థాయి పరిశీనలో వెల్లడి

(విధాత న్యూస్‌ నెట్‌వర్క్‌)

BRS | సిట్టింగ్‌లపై వ్యతిరేకత, పార్టీలో అసంతృప్తులు, తమకే టికెట్‌ కావాలంటూ నేతల పోటీ పడుతున్న తీరు బీఆరెస్ (BRS) అధిష్ఠానాన్ని కలవర పెడుతున్నాయి. తెలంగాణ సాధించిన పార్టీగా హ్యాట్రిక్‌ సాధించాలన్న ఉత్సాహంతో ఉన్న బీఆరెస్‌లో స్వంత పార్టీ నేతలకు అసంతృప్త నేతలే చెక్‌ పెడతారా? అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నాయి.

అధికార పార్టీలో నియోజవర్గాల వారీగా పార్టీలో అసంతృప్తులు, తిరుగుబాటు నేతల తీరుపై విధాత ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. కనీసం 78 స్థానాల్లో అసంతృప్త నేతలు, రెబల్స్‌ ఉన్నాయని తెలుస్తున్నది. కొన్ని జిల్లాల్లో నేతలు తమకు టికెట్‌ రాకుంటే పార్టీ మారుతామని కూడా తమ అనుచరుల వద్ద అంటున్నట్లు సమాచారం. కొన్ని నియోజక వర్గాలో అసంతృప్త నేతలు విడిగా సమావేశాలు నిర్వహించడంతోపాటు.. ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు కూడా చేశారు.

అదే సమయంలో టికెట్ కోసం కొందరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే (Sitting MLAs) లకు టెన్షన్ పట్టుకున్నది. ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా సర్వేలు చేయిస్తున్నారని తెలియడంతో అసంతృప్త నేతలు తమ కార్యకలాపాల్లో వేగం పెంచారు. వర్గాలుగా విడిపోయి టికెట్ల కోసం అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

78 స్థానాల్లో రెబ్సల్‌, అసంతృప్త నేతలు, పోటీదారులు

119 నియోజవర్గాలున్న తెలంగాణ (Telangana) రాష్ట్రంలో 78 స్థానాల్లో బీఆరెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నేతల నుంచే గట్టి పోటీ ఎదురవుతున్నదని విధాత పరిశీలనలో తేలింది. ఒక్కో స్థానంలో ఇద్దరు, ముగ్గురు నేతలు టికెట్‌ ఆశిస్తున్నారు. లేదంటే తమ దారి తాము చూసుకుంటామని కొంత మంది నేతలు బెదిరిస్తున్నట్లు సమాచారం. బీఆరెస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.

కేసీఆర్ (KCR) కామారెడ్డి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. కేసీఆర్‌ తమ వద్దకు వస్తే సరి.. లేదంటే టికెట్‌ తమకే ఇవ్వాలంటూ కామారెడ్డిలో ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారని తేలింది. 41 స్థానాలలో మాత్రమే సిట్టింగ్‌లకు పోటీ అభ్యర్థులు లేరు. ఇందులో హైదరాబాద్‌ నగరానికి చెందిన 7 నియోజకవర్గాల్లో ఎంఐఎం మొదటి నుంచీ ఆధిపత్యం చెలాయిస్తున్న కారణంగా ఇక్కడ బీఆరెస్‌ పోటీ నామమాత్రంగానే ఉంటుంది.

అందుకే ఇక్కడ పోటీ చేయడానికి నేతలు పెద్దగా ఆసక్తి చూపించరు. మిగిలిన 34 నియోజక వర్గాలలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్‌లో చేరడంతో 6 నియోజకవర్గాలలో సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా తమకు టికెట్‌ కావాలని అడిగే నేతలే లేరని సమాచారం. 28 స్థానాల్లోనే బీఆరెస్‌కు బలమైన నేతలున్నట్లు కనిపిస్తున్నది.

మసక బారుతున్న ప్రతిష్ఠ

రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాలలో ఉన్న అసంతృప్తులు, తిరుగుబాటు నేతల కారణంగా బీఆరెస్‌ తలనొప్పులు ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన బీఆరెఎస్‌.. మూడోసారి గెలిచి హ్యట్రిక్‌ సాధించాలన్న తపనతో ఉన్నది. అయితే.. ఆ ప్రయత్నాలకు సొంత పార్టీలోని టికెట్‌ ఆశావహులు, అసంతృప్త నేతలు, రెబల్‌ నాయకులు బ్రేకులు వేస్తారా? అన్న చర్చ ఆయా నియోజకవర్గాల్లో జోరుగా నడుస్తున్నది. పార్టీలో ఇలా పరిస్థితి ఉంటే ఓట్లు చీలి ప్రత్యర్థి కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరే ప్రమాదం ఉందన్న చర్చ బీఆరెస్‌ శ్రేణుల్లో కూడా వినిపిస్తున్నది.

అనేక చోట్ల సిటింగ్‌ ఎమ్మెల్యేలపై పార్టీలోని సెకండరీ లీడర్‌షిప్‌ బహిరంగంగానే భగ్గుమంటున్నది. ఎమ్మెల్యేలపై తిరుగుబావుటా ఎగురవేసి, తమ అసంతృప్తిని బాహటంగా చాటుతున్నారు. ఇక కేడర్‌లో నాయకుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరుపట్ల స్థానికుల్లో వ్యతిరేకత కనిపిస్తుండటం అధిష్ఠానాన్ని కలవరపెట్టే అంశమేనని జిల్లాల్లోని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పట్టించుకోక పోవడం వల్లే!

ఎమ్మెల్యేల అక్రమాలు, ఏకపక్ష విధానాలు, అక్రమ సంపాదన, పార్టీని పట్టించుకోకపోవడం తదితర అంశాలను ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగా ఏకరువు పెడుతున్నారు. సొంత పార్టీ నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యేల అక్రమార్జనపై లెక్కలు చెబుతుంటే విని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.

నిన్నటి వరకూ ఏ అసమ్మతి లేదని భావించిన నియోజకవర్గాల్లో కూడా ఈ పరిణమాలు చోటు చేసుకోవడం విశేషం. ఎమ్మెల్యేలకు అనుచరులుగా ముద్రపడిన వారే నిరసన గొంతెత్తుతుంటే మిగిలిన వాళ్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ వరుస పరిణామాలు రానున్న ఎన్నికల్లో బీఆరెస్‌కు ప్రమాద ఘంటికలుగా పరిశీలకులు చెబుతున్నారు.

బుజ్జగింపులు షురూ..

పార్టీ అధిష్ఠానం నిర్వహించుకుంటున్న అంతర్గత సర్వేల్లో అసంతృప్తుల వ్యవహారం స్పష్టం కావడంతో మంత్రి కేటీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరో వైపు పలు స్థానాలకు అధిష్ఠానం విశ్వాసపాత్రులైన నాయకులను దూతలుగా పంపించి, బుజ్జగిస్తున్నట్లు తెలుస్తున్నది.

అయితే రానున్న ఎన్నికల్లో మార్పు తప్పదని భావిస్తున్న సెగ్మెంట్లలో ఈ నిరసన గళాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యామ్నాయం లేని చోట మాత్రం సిట్టింగులను కాపాడుకునే ప్రయత్నాలు వేగవంతం చేశారని చెబుతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో..

  1. 1. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తిరుగులేదు. రెండో స్థాయి నాయకులు పార్టీలో ఎదగకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. మంత్రిపై హైకోర్టులో అనర్హత వేటు పడితే ఆయన తమ్ముడు శ్రీకాంత్‌గౌడ్‌ను బీఆరెస్‌ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. రెబెల్స్ బెడద లేదు.
  2. దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి రెబల్స్ బెడద లేదు.
  3. నారాయణ పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఒకే ఒక్కడుగా ఉన్నారు. ఇక్కడ రెండో నేత లేకపోవడంతో ఆయనకు అసంతృప్తి నేతల బెడద లేదు.
  4. మక్తల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి రెబెల్స్ బెడద లేదు.
  5. జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డికి అసంతృప్తి బెడద లేదు.
  6. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఎదురు లేని నేతగా ఎదిగారు. రెండో క్యాడర్ లేదు. రెబెల్స్ బెడద లేదు.
  7. వనపర్తి నియోజకవర్గంలో మంత్రి నిరంజన్ రెడ్డికి రెబల్స్ బెడద లేదు.
  8. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి జడ్పీ చైర్మన్ సరిత మధ్య రెబల్ పోరు నడిచింది. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరడంతో రెబల్ పోరు తప్పింది.
  9. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి అదే పార్టీకి చెందిన మామిళ్లపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి మధ్య అసంతృప్తి జ్వాల రగులుతున్నది. గత ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. జూపల్లి కోసం త్యాగం చేసిన ఆయనకు ఈ టికెట్ వస్తుందనే ఆశలో ఉన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే బీరంకు విష్ణు వర్ధన్ రెడ్డి రెబల్‌గా మారే అవకాశం ఉంది.
  10. అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అసంతృప్తి బెడద లేదు, ఇక్కడ తనకు కానీ, తన కుమారుడికి కానీ టికెట్‌ ఇవ్వాలని నాగర్‌ కర్నూల్‌ ఎంపీ రాములు అడుగుతున్నారు.
  11. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌పై అదే పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇక్కడి బీఆరెస్‌ నాయకులు కసిరెడ్డికే మద్దతుగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో జైపాల్ యాదవ్‌కు కసిరెడ్డి రెబల్‌గా ఉండే అవకాశం ఉంది.
  12. ఆలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహంపై అసంతృప్తి లేదు కానీ మాజీ ఎంపీ మంద జగన్నాథం కొడుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
  13. కొడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి రెబల్ బెడద లేదు. ఉన్న ఒకే రెబల్ నేత గురునాథ్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఇక్కడ కూడా అసంతృప్తులు లేరు.
  14. షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు రెబల్ అభ్యర్థుల బెడద లేకున్నా టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.
    కొల్లాపూర్, కల్వకుర్తి, షాద్‌నగర్‌లో నియోజకవర్గాల్లో మాత్రమే అధికార పార్టీలో అసంతృప్తుల బెడద ఉంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకటి, అర మినహా అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఆ పార్టీ నాయకులు భగ్గుమంటున్నారు.

  1. 1. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీరుపై ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. భూకబ్జాలు, అక్రమాలు అంటూ విమర్శిస్తున్నారు.
  2. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపైన ఉద్యమకారులు కారాలు మిరియాలు నూరుతున్నారు. మొరం దందా చల్లా కనుసన్నల్లో సాగుతోందని విమర్శించారు. నాగూర్ల వెంకటేశ్వర్లుకు మద్దతుగా బహిరంగ ప్రకటనలు చేసి చల్లాకు కునుకులేకుండా చేస్తున్నారు.
  3. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై ఎమ్మెల్సీ రవీందర్ రావు అనుచరులు నిరసన జెండాలెత్తారు. భూకబ్జాదారుడైన ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ ప్రకటనలు చేశారు. మామిడి తోటల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
  4. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌పై పార్టీ నాయకులు, శ్రేణులు మండిపడుతున్నారు. గ్రామాలు, తండాలకు వెళితే నిరసనలతో అడ్డుకుని వాపస్ పంపిస్తున్నారు.
  5. పాలకుర్తి ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లికి వ్యతిరేకంగా అసమ్మతి నాయకులు రహస్య సమావేశం నిర్వహించి గట్టి ఝలక్ ఇచ్చారు. దీని నుంచి మంత్రి ఇంకా కోలుకున్నట్లు లేదు.
  6. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను ఆయన అనచరవర్గంగా ముద్రపడిన వారే వ్యతిరేకిస్తున్నారు. రహస్య సమావేశాలు నిర్వహించి అరూరి తీరుపై మంత్రి ఎర్రబెల్లి, బోయినపల్లికి ఫిర్యాదు చేశారు. రమేశ్‌ అంశంలో మాత్రం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రాంగం నిర్వహించారు. తాజాగా బోయినపల్లి కూడా వీరి మధ్య సయోధ్య కుదిర్చారని ప్రచారం సాగింది. ఈ రాజీ ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.
  7. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పైన ఆ పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, నాయకులు మెట్టు శ్రీనివాస్, రాజనాల శ్రీహరి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలుస్తున్నది. నరేందర్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్ఠానం వద్ద ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
  8. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూకబ్జాదారుడంటూ ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీనికి ఆయన కుమార్తె తుల్జా భవాని తోడయ్యారు. ముత్తిరెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోటీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇంకో వైపు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
  9. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య పట్ల అసంతృప్తి ఉన్నదని సమాచారం. ఇక్కడి నుంచి మాజీ డిప్యూటీ సీఎంగా పని చేసిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా టికెట్ కోసం త్రీవంగా ప్రయత్నిస్తున్నారు.
  10. ములుగులో బడె నాగజ్యోతి, ఆజ్మీరా ప్రహ్లాద్‌, పరశురామ్‌ నాయక్‌, ఎంపీ సీతారామ్‌ నాయక్‌ కూడా టికెట్‌ రేసులో ఉన్నారు. వరంగల్ పశ్చిమ, నర్సంపేటల్లో మాత్రం ప్రస్తుతానికి అసంతృప్తి బహిరంగం కాలేదు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో..

10 నియోజకవర్గాలున్న ఉమ్మడి మెదక్ జిల్లా అధికార బీఆరెస్లో అసమ్మతి సెగలు రోజు రోజుకూ రాజుకుంటున్నాయి.

  1. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికి పోటీగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతంలో సేవల పేరుతో గ్రామాలు తిరుగుతున్నారు. సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాస్‌రెడ్డి సైతం ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. మొత్తానికి అధికార పార్టీలో మూడు ముక్కలాట నడుస్తున్నదని అంటున్నారు.
  2. దుబ్బాక అధికార పార్టీలో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు సతీష్ టికెట్ ఆశిస్తున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తన వర్గాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు.
  3. గజ్వేల్ నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడి నుండి సీఎం తిరిగి పోటీ చేయకుంటే ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ యాదవ రెడ్డి టికెట్‌ కోసం పోటీ పడతారని సమాచారం. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తున్నది.
  4. నర్సాపూర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ విఠల్ రెడ్డి కోడలు సుహాసిని రెడ్డి, నియోజక వర్గం మాజీ ఇన్‌చార్జ్‌ దేవేందర్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు.
  5. అందోల్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌కు జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నదని చెబుతున్నారు. లోకల్ లీడర్‌కు పూర్తి మద్దతుతో జడ్పీ చైర్‌పర్సన్‌ వర్గం ఎమ్మెల్యేగా మరో వ్యక్తిని సూచిస్తున్నట్లు సమాచారం.
  6. పటాన్ చెరువులో సిటింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్సీ, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్ రెడ్డి, సర్పంచ్ నీలం మధు పోటీ పడుతున్నారని చర్చ నడుస్తున్నది.
  7. నారాయణఖేడ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి పోటీగా మాజీ జడ్పీటీసీ పెద్ద శంకరంపేట రామ గౌడ్ కుమారుడు శ్రీనివాస్ గౌడ్ మధ్య విభేదాలు ఉన్నాయి. శ్రీనివాస్‌రెడ్డికే టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతున్నది.
  8. సంగారెడ్డి నియోజక వర్గంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆరెస్‌లో చేరుతారన్న ప్రచారం ఉన్నది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర చేనేత కార్పొరేన్ చైర్మన్ చింతా ప్రభాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాజీ జడ్పీటీసీ నరహరిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.
  9. జహీరాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎంపీ బీబీ పాటిల్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నదని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ నుండి ఇటీవల బీఆరెస్‌లో చేరిన రఘోత్తంతో పాటు కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం ఉన్నది.
  10. సిద్దిపేటలో ఒకే ఒక్కడు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావకు ఎదురు లేదు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో..

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూర్యాపేట, హుజూర్‌నగర్‌ మినహా మిగతా నియోజకవర్గాల్లో బీఆరెస్ సిటింగ్లకు సొంత పార్టీ నాయకులతో టికెట్ల పంచాయతీ కనిపిస్తున్నది.

  1. 1. నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి పోటీగా నియోజకవర్గం నుండి పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్, గుత్తా అమిత్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతుందనే అంచనాలు ఉన్నాయి.
  2. మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి పోటీగా కర్నె ప్రభాకర్, పల్లె రవి గౌడ్, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు పోటీలో ఉన్నారు. గుత్తా అమిత్ రెడ్డి కూడా మునుగోడు టికెట్‌పై కన్నేశారని సమాచారం.
  3. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు పోటీగా మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జ్‌ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, ఎర్నేని వెంకటరత్నం బాబు రేస్‌లో ఉన్నారు.
  4. ఆలేరులో ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ప్రత్యామ్నాయంగా ఆమె భర్త మహేందర్ రెడ్డి ఈ దఫా టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. వీరికి పోటీగా మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మోత్కుపల్లి నరసింహులు కూడా టికెట్ ఆశిస్తున్నారు.
  5. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిక పెద్దగా పోటీ లేకపోయినా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారని సమాచారం.
  6. మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు టికెట్ విషయంలో పెద్దగా ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి రేసులో ఉన్నప్పటికీ.. అధిష్ఠానం భాస్కర్ రావు వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు.
  7. హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి పోటీగా టికెట్ రేసులో పెద్దగా పేర్లు వినిపించడం లేదు. ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆయనపై అసమ్మతిగా ఉన్నప్పటికీ టికెట్ విషయంలో మాత్రం పోటీనిచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
  8. సూర్యాపేటలో మంత్రి జీ జగదీశ్‌రెడ్డికి నియోజకవర్గంలో టికెట్ విషయంలో పోటీ లేదు. ద్వితీయ శ్రేణి, మండల స్థాయి నాయకులలో నెలకొన్న అసంతృప్తులను సర్దుబాటు చేసుకుంటే కలిసొచ్చే త్రిముఖ పోటీ.. నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి నేపథ్యం ఎన్నికల్లో అయనకు సానుకూలంగా ఉంది.
  9. నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్‌కు పోటీగా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, బుసిరెడ్డి పాండురంగారెడ్డి, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మన్నెం రంజిత్ యాదవ్ పోటీలో ఉన్నారు.
  10. తుంగతుర్తిలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌కు పోటీగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకురాలు జ్యోతి పద్మ టికెట్ రేసులోకి వచ్చారు. ఇటీవలే తుంగతుర్తి ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ మరోసారి గాదరి కిశోర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పడంతో టికెట్ ఆశించిన సీనియర్ నేత మందుల సామెల్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
  11. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోటీగా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ వేములకు మద్దతుగా ఉన్నారు.
  12. దేవరకొండలో ఎమ్మెల్యే ఆర్ రవీంద్రకుమార్‌కు పోటీగా మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్త్యా దేవేందర్ నాయక్ రేసులో ఉన్నారు. ఆయనకు గుత్తా వర్గం మద్దతుగా నిలుస్తుందని అంటున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో..

13 శాసనసభ నియోజకవర్గాలున్న కరీంనగర్‌ అధికార పార్టీలో అసమ్మతి బలంగా ఉంది.

  1. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ హ్యాట్రిక్ సాధించారు. అంతర్గతంగా అసంతృప్తులు ఉన్నా, అవి బయటపడే స్థాయిలో లేవు. అయితే అధిష్ఠానం మార్చాలని అనుకుంటే కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్‌రావు, మాజీ మేయర్, ప్రస్తుత రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
  2. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు పోటీగా ఇటీవల కాంగ్రెస్ నుండి బీఆరెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఓరుగంటి ఆనంద్ రేసులో ఉన్నారు. రసమయి స్థానికేతరుడు కావడంతో ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వవద్దని డిమాండ్ ఊపందుకుంటోంది.
  3. హుజురాబాద్‌లో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. ఇటీవలే పార్టీ నేత తుమ్మేటి సమ్మిరెడ్డి ఆయనపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఉప ఎన్నికలో పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ మరోసారి టికెట్ ప్రయత్నంలో ఉన్నారు. ఆయన సతీమణి గెల్లు శ్వేత కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన సతీమణికి టికెట్ ఇచ్చినా ఫరవాలేదనే భావనలో శ్రీనివాస్ ఉన్నారని సమాచారం. ఇక మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, వొడితల ప్రణవ్, డీఎస్పీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత పొనగంటి మల్లయ్య టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
  4. హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్‌ను మార్చే అవకాశం లేదు. ఇక్కడి నుండి ఆశావహులు కూడా లేరు.
  5. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌పై పలు ఆరోపణలున్న దృష్ట్యా, తిరిగి టికెట్ కేటాయించకపోవచ్చు. కరీంనగర్‌కు చెందిన కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, గంట కళ్యాణి టిక్కెట్ ఆశిస్తున్నారనే ప్రచారం ఉన్నది.
  6. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతతో పాటు ఎం జితేందర్‌రావు, పెగడపల్లి సింగిల్ విండో చైర్మన్ ఓరుగంటి రమణారావు టికెట్‌ ఆశిస్తున్నారు.
  7. ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రత్యామ్నాయ నేతలు లేరు.
  8. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు బదులుగా ఆయన తనయుడు డాక్టర్ సంజయ్ కుమార్‌కు టికెట్ కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.
  9. సిరిసిల్ల ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్‌కు మరో ప్రత్యామ్నాయం లేదు.
  10. వేములవాడ నుండి చెన్నమనేని రమేశ్‌బాబు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జర్మనీ పౌరసత్వ సమస్య ఆయనను వెన్నాడుతున్నది. దీంతో ఇక్కడి నుండి చలిమెడ లక్ష్మీనరసింహారావు, ఏనుగు మనోహర్‌రెడ్డి టికెట్ కోసం ప్రధానంగా పోటీ పడుతున్నారు. లక్ష్మీ నరసింహారావు ఏకంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
  11. పెద్దపల్లి నుంచి వరుసగా రెండుసార్లు ఎన్నికైన దాసరి మనోహర్ రెడ్డి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలే శాసనసభ్యునిపై బహిరంగ ఆరోపణలు చేసిన మునిసిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జూలపల్లి జడ్పీటీసీ బొద్ధుల లక్ష్మణ్, నల్ల మనోహర్ రెడ్డి, నీటిపారుదల అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి, బీసీ నేత గుర్రాల మల్లేశం ముదిరాజ్ ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారని చెబుతున్నారు.
  12. మంథనిలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్‌ పుట్ట మధుకర్ మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. అయితే న్యాయవాద దంపతుల హత్య కేసులో ఆరోపణలు, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు సన్నిహితుడని ముద్రపడటంతో ప్రత్యామ్నాయంగా కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణరెడ్డిని పార్టీ నేతలు తెర ముందుకు తీసుకువచ్చారు. దీంతో ఈసారి టికెట్ ఆయనకే దక్కే అవకాశం ఉందంటున్నారు.
  13. రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు గళం విప్పారు. పార్టీ అధినాయకత్వం హైదరాబాద్ పిలిపించి చర్చించినా, అసమ్మతి నేతలు వెనకకు తగ్గడం లేదు. జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కొంకటి లక్ష్మీనారాయణ, పాతపెల్లి ఎల్లయ్య, మిరియాల రాజిరెడ్డి, బయ్యపు మనోహర్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యేకు పోటీగా నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తున్నారు. తమలో ఎవరికి టికెట్ కేటాయించినా ఫర్వాలేదంటున్న నేతలు.. కోరుకంటికి టికెట్ ఇస్తే గెలుపు సాధ్యం కాదని తెగేసి చెప్తున్నారు.

ఉమ్మడి అదిలాబాద్‌లో..

10 స్థానాలున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నేతలు వర్గాలుగా విడిపోయి టిక్కెట్ల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

  1. 1. సిర్పూర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై అసంతృప్తి ఉన్నప్పటికీ స్థానికంగా టికెట్ ఆశించే అభ్యర్థులు ఎవరూ లేరు.
  2. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్, మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి మధ్య టికెట్ పోటీ నెలకొంది. కోవా లక్ష్మికి టికెట్ రాకపోతే పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది.
  3. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనేక అవినీతి ఆరోపణలు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట ప్రవీణ్ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
  4. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తమకు గుర్తింపు లేకుండా చేస్తున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
  5. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు పనితీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిలిం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూసుకురి రామ్మోహన్‌ రావు, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, బీసీ వాదంతో ముఖేష్ గౌడ్, పల్లె భూమేష్, అక్క తిరుపతి వర్మ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
  6. అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపై స్థానికంగా కొంత అసంతృప్తి ఉంది. ఆదిలాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.
  7. నిర్మల్ ఎమ్మెల్యే, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అసమ్మతి బెడద లేదు.
  8. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాం నాయక్‌పై తీవ్ర అసంతృప్తి ఉంది. ఇక్కడ జాన్సన్ నాయక్, రాథోడ్ జనార్దన్‌ టికెట్ కోసం పోటీ పడుతున్నారని సమాచారం.
  9. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావుకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ గేడం నగేశ్‌, నేరేడికొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని చర్చ నడుస్తున్నది.
  10. ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పై పార్టీలోని అసమ్మతినేతలు బహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ బాబు, ఎన్ఆర్ఐ విజయకుమార్, బీఆరెస్‌ సీనియర్ నాయకుడు జీవీ రమణారావు టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తున్నది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

జిల్లాలో మెజార్టీ నాయకులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. వీరిలో నియోజకవర్గాలలో బీఆరెస్‌లో టికెట్‌ ఆశించిన నేతలు కూడా ఉన్నారు.

  1. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కు వ్యతిరేకంగా టికెట్‌ అడిగే నేతలు లేరు.
  2. పాలేరులో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, తుమ్మల మధ్య టికెట్‌ పోటీ నెలకొనే అవకాశం ఉన్నది.
  3. వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్‌, మాజీ ఎమ్మెల్యే మధన్‌లాల్‌ మధ్య పోటీ ఉండొచ్చు.
  4. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు పోటీగా పార్టీలో టికెట్‌ ఆశించే నేతలు లేరు.
  5. మధిరలో కమల్‌రాజు, బొమ్మెర రామ్మూర్తి పోటీ పడుతున్నారు.
  6. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా రామేశ్వరరావుపై క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉందని అంటున్నారు. కానీ.. కానీ టికెట్‌ ఆశించే స్థాయి నేత లేరు.
  7. భద్రాచలంలో మానే రామకృష్ణ పోటీ చేసే అవకాశం ఉన్నది.
  8. కొత్తగూడెంలో వనమా నాగేశ్వరరావు, జలగం వెంకట్రావులతో పాటు డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌గా ఉన్న అధికారి గడల శ్రీనివాసరావుకూడా టికెట్‌ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.
  9. పినపాకలో ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వ్యతిరేకంగా టికెట్‌ అడిగే వారు లేరు.
  10. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌కు వ్యతిరేకంగా టికెట్‌ అడిగే వారు లేరు.

రంగారెడ్డి జిల్లాలో..

14 నియోజకవర్గాలున్నజిల్లాలో అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒక్క మల్కాజిగిరి మినహా మిగతా అన్నింటిలో అసమ్మతి నేతలు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

  1. ఎల్‌బీ నగర్‌లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికు వ్యతిరేకంగా రామ్మోహన్‌గౌడ్‌, వజీర్‌ ప్రకాశ్‌ గౌడ్‌లు టికెట్‌ ఆశిస్తున్నారని సమాచారం.
  2. మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మధ్య టికెట్‌ కోసం పోటీ ఉండొచ్చని చెబుతున్నారు.
  3. రాజేంద్రనగర్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారని చర్చ జరుగుతున్నది.
  4. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, బండి రమేశ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.
  5. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తి ఉందని చెబుతున్నారు. స్థానిక నేతలు అతనికి టికెట్‌ ఇవ్వవద్దని అంటున్నారు. క్యామ మల్లేష్‌ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం.
  6. తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిల మధ్య తీవ్ర పోటీ
  7. చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం మధ్య పోటీ ఉండొచ్చు.
  8. వికారాబాద్‌లో మెతుకు ఆనంద్‌పై తీవ్ర అసంతృప్తి ఉందని, సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడి నుంచి జడ్పీ వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజయ్‌కుమార్‌, భూముల కృష్ణయ్య, వడ్ల నందు, డాక్టర్‌ టీ ఆనంద్‌ టికెట్‌ కోసం ప్రతయత్నిస్తున్నారని సమాచారం.
  9. పరిగిలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డితో పాటు డీసీసీబీ చైర్మన్‌ బయ్యని మనోహర్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారని చెబుతున్నారు.
  10. ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, బండారి లక్ష్మారెడ్డి టికెట్‌ కోసం పోటీ పడే అవకాశం కనిపిస్తున్నది.
  11. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావుపై అసంతృప్తి ఉన్నా.. ఇక్కడ టికెట్‌ అడిగే నేత లేరని సమాచారం.
  12. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డితోపాటు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, నక్క ప్రభాకర్‌ గౌడ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.
  13. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు మధ్య టికెట్‌ కోసం తీవ్ర పోటీ ఉంటుందని అంచనా.
  14. కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు పాటిమీది జగన్‌, గొట్టెముక్కల వెంకటేశ్వరరావు టికెట్‌ ఆశిస్తున్నారని తెలుస్తున్నది.

హైదరాబాద్‌లో..

15 నియోజకవర్గాలున్న హైదరాబాద్‌ రెవెన్యూ జిల్లాలో 7 నియోజకవర్గాలలో ఎంఐఎందే ఆధిపత్యం.. కావున ఇక్కడ పార్టీ ఎవరిని నియమిస్తే వాళ్లే పోటీ చేస్తారు. మిగిలిన 8 నియోజకవర్గాలలో అసమ్మతి నేతలు పోటీకి నేనంటే నేనని అంటున్నారు.

  1. ముషీరాబాద్‌లో ఎమ్మెల్యే ముఠాగోపాల్‌పై తీవ్ర అసంతృప్తి ఉంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి నాయిని సరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, మరోనేత ఎంఎన్‌ శ్రీనివాస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.
  2. సికింద్రాబాద్‌లో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ పార్లమెంట్‌కు పంపించే ఆలోచన ఉంటే తనకే టికెట్‌ ఇవ్వాలని డిప్యూటీ మేయర్‌ భర్త మోతె శోభన్‌రెడ్డి అడుగుతున్నారు.
  3. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సెకండరీ లీడర్‌షిప్‌ను ఎదుగనివ్వలేదన్న చర్చ జరుగుతున్నది. ఇక్కడ టికెట్‌ ఇవ్వాలని అడిగే వారు లేరు.
  4. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉందని చెబుతున్నారు. మెజార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం. మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, బీజేపీ నుంచి వచ్చి కార్పొరేషన్‌ పదవి తీసుకున్న రావుల శ్రీధర్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు.
  5. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై నియోజక వర్గంలో అసంతృప్తి ఉంది. ఇక్కడి నుంచి మన్నెగోవర్థన్‌రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు.
  6. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌పై తీవ్ర అసంతృప్తి ఉంది. ఇక్కడ పార్టీ సీనియర్‌ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి, కార్పొరేటర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే కృష్ణయాదవ్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.
  7. గోషామహల్‌లో టికెట్‌ కోసం నందకిషోర్‌ వ్యాస్‌(బిలాల్‌) ఆనంద్‌కుమార్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే ప్రేం సింగ్‌ రాథోడ్‌, ఆర్వీ మహేందర్‌ కుమార్‌, గడ్డెం శ్రీనివాస్‌ యాదవ్‌ పోటీ పడుతున్నారు.
  8. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌పై ఎమ్మెల్యే సాయన్న చనిపోయాక చాలా మంది నేతలు పోటీకి సిద్ధమంటున్నారు. ముఖ్యంగా కృషాంక్‌, సాయన్న కూతురు లాస్య నందిత, గజ్జల నగేశ్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, మోత్కుపల్లి నర్సింహులు టికెట్‌ ఆశించే వారిలో ఉన్నారు. నాంపల్లి, మలక్‌పేట, చంద్రాయణగుట్ట, చార్మినార్‌, బహదూర్‌ పుర, కార్వాన్‌, యాకుత్‌పుర నియోజకవర్గాలలో ఎంఐఎం గెలుస్తుంది. ఇక్కడ బీఆరెస్‌ ఎవరికి టికెట్లు ఇస్తే వాళ్లే పోటీ చేస్తారు.

నిజామాబాద్‌ జిల్లాలో..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు 5 స్థానాల్లో బీఆరెస్‌లో అసమ్మతి ఉంది. అసమ్మతి నేతలు తమకే టికెట్‌ కావాలని అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు.

  1. నిజామాబాద్ అర్బన్‌లో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాపై అసంతృప్తి ఉందని చెబుతున్నారు. ఉద్యమకారుడు కార్మిక నేత ఏఎస్ పోశెట్టి, మేయర్ నీతు కిరణ్ భర్త దండు చంద్రశేఖర్ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.
  2. నిజామాబాద్ రూరల్‌లో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు అసమ్మతి నేత మండవ వెంకటేశ్వరరావు టికెట్‌ ఆశిస్తున్నారు.
  3. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌కు కాకుండా తనకే టికెట్‌ ఇవ్వాలని అసమ్మతి నేత, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ పద్మారెడ్డి భర్త శరత్ రెడ్డి కోరుతున్నారని సమాచారం.
  4. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి కాకుండా తనకే టికెట్‌ ఇవ్వాలని అసమ్మతి నేత, దళిత వర్గం నుండి డాక్టర్ మధు శేఖర్ కోరుతున్నారని తెలుస్తున్నది.
  5. కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు కాకుండా తమకే టికెట్‌ ఇవ్వాలని రాష్ట్ర నాయకుడు నర్సింగ్ రావు (కాంట్రాక్టర్) , ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దిన్ కోరుతున్నారని సమాచారం.
  6. బాల్కొండ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, 7. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, 8. బాన్సువాడ ఎమ్మెల్యే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, 9. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే లకు అసమ్మతి లేదు.