బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం.. హౌజ్‌లో కంటెస్టెంట్‌గా శునకం

బుల్లితెర ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని పంచుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. విదేశాల నుండి వచ్చిన ఈ షో ముందుగా హిందీలో ప్రసారం అయింది. ఆ తర్వాత అనేక భాషలకి పాకింది.ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఓటీటీలో కూడా ఈ షో ప్రసారం జరుపుకుంటుంది. బిగ్ బాస్‌కి రోజురోజుకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు కూడా సరికొత్తగా ప్రేక్షకులకి వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి కొద్ది రోజులలో కన్నడలో పదవ సీజన్ స్టార్ట్ కాబోతుండగా, ఈ షోకి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ కి సంబంధించి పలు వార్తలు వస్తుండగా, తాజాగా బిగ్ బాస్‌లో పాల్గొనే తొలి కంటెస్టెంట్ వివరాలు బయటకు వచ్చాయి.
అక్టోబర్ 8 నుంచి బిగ్ బాస్ కన్నడ షో ప్రారంభం కానుండగా, ఈ షోలో ఏకంగా 17 మంది కంటెస్టెంట్స్ ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఈ 17 మంది కంటెస్టెంట్స్‌కి సంబంధించి పలువురు పేర్లు ప్రచారంలో ఉండగా, తొలి కంటెస్టెంట్ ఎవరన్నది ముందుగానే ప్రకటించారు. ‘777 చార్లీ’ సినిమాలోని చార్లీ శునకం బిగ్‌బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతుందని ఓ వేడుకలో తెలియజేశారు.
ఇప్పటి వరకు బిగ్ స్క్రీన్‌పై సందడి చేసిన చార్లి అనే శునకం బిగ్‌బాస్ ఇంట్లో జాయిన్ కాబోతున్నారని అనుపమ గౌడ స్పష్టం చేశారు. ఇలా ఒక శునకం బిగ్ బాస్ హౌజ్‌లోకి రావడం ఇదే తొలిసారి కాగా, అనుపమ చెబుతూ.. బిగ్‌బాస్ ఇంట్లో కొన్ని నియమాలున్నాయి. బిగ్‌బాస్ పాటను ప్లే చేసినప్పుడు మీరు కూడా లేవాలి. టాస్క్ వంటివి చేయాలి. మీరు టాస్క్ చేస్తేనే లగ్జరీ బడ్జెట్ పొందే అవకాశం ఉంటుంది. లగ్జరీ బడ్జెట్ వస్తేనే నీకు బోన్ దొరుకుందని అనుపమ స్పష్టం చేశారు.
తొలిసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లనున్న శునకం ఎలా సందడి చేస్తుందో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 777 చార్లీ సినిమాలో హీరో రక్షిత్ శెట్టితో కలిసి చార్లీ చేసిన సందడి ఇప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేరు. ఒకవైపు తన చేష్టలతో సందడి చేసిన చార్లి హీరోపై అమితమైన ప్రేమని కురిపించిండమే కాక కొన్ని సన్నివేశాలలో జనాలను కూడా ఏడిపించింది. మరి 100 రోజులు బిగ్ బాస్ జరగనుండగా, ఆ షోలో చార్లీ ఎలా ఉంటుందనేది చూడాలని అంటున్నారు.