కాంగ్రెస్ మాట వినపడొద్దు.. అందుకు ఏం చేయాలి? సన్నిహితులతో కేటీఆర్ చర్చ?

విధాత, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా అక్టోబర్ రెండోవారంలో మోగుతుందని అంటున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీలు నువ్వా, నేనా అనేలా పోటీ పడుతున్నాయి. పోటీ మాత్రం బీఆరెస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీగా ఉంటుందని పలు సర్వేలు చెబుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఎక్కువ శాతం ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సారి మార్పు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఫలితాలే తెలంగాణలోను పునరావృతం అవుతాయని అంటున్నారు. ఈ వాతావరణం మీడియాతోపాటు ప్రజల్లో కూడా విసృతంగానే ఉన్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అయితే మూడోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్న బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ జోరు ప్రజల్లో తగ్గించేందుకు ఏం చేయాలనే అంశంలో కసరత్తు ముమ్మరం చేశారని తెలుస్తున్నది. దీనిపై తన సన్నిహితుల వద్ద చర్చలు జరుపుతున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై కేసీఆర్ వివిధ సమావేశాల్లోనూ, ట్విట్టర్‌లోనూ తీవ్రస్థాయిలో ఘాటు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారని, ఇదంతా కాంగ్రెస్‌కు పెరుగుతున్న క్రేజ్‌ను అడ్డుకునే ప్రయత్నాల్లో భాగమేనని అంటున్నారు.
ఇదిలా ఉంచితే ముఖ్యంగా అధికార బీఆరెస్‌పై ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత మొదలైందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణం కనిపిస్తున్నది. ఏ పార్టీ గెలుస్తుందనే చర్చలు నడుస్తున్నాయి. ఫలానా పార్టీ గెలుస్తుందంటే లేదు ఫలానా పార్టీయే గెలుస్తుందని బెట్టింగ్‌లు సైతం వేసుకుంటున్నారు.