Dubbaka | దుబ్బాక సీటు వేరీ హాట్‌.. కొత్త పుంత‌లో దుబ్బాక రాజ‌కీయం

Dubbaka బ‌రిలో నిలిచేందుకు నేత‌ల ప్ర‌య‌త్నాలు ఈసారి బీఆరెస్‌ నుంచి ప్రభాకర్‌రెడ్డినా ?..సోలిపేట సతీష్..కా? సోలిపేట ఫ్యామిలీ ప‌రిస్థితి ఏంటి!..కాంగ్రెస్..లో చెరుకుకు సీటు దక్కేనా..! డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి దారెటు.. సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ కే బీజేపీ టికెట్ ఖాయం.. బీజేపీలో ర‌ఘునంద‌న్‌కు అసంతృప్తుల సెగ‌ ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో నిలిచేలా నేత‌ల ప్ర‌య‌త్నాలు.. దుబ్బాక నియోజక వర్గ ముఖచిత్రం.. విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధిః మెదక్ ఉమ్మడి జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం ఒకప్పటి దొమ్మట […]

  • By: krs    latest    Aug 06, 2023 1:24 AM IST
Dubbaka | దుబ్బాక సీటు వేరీ హాట్‌.. కొత్త పుంత‌లో దుబ్బాక రాజ‌కీయం

Dubbaka

  • బ‌రిలో నిలిచేందుకు నేత‌ల ప్ర‌య‌త్నాలు
  • ఈసారి బీఆరెస్‌ నుంచి ప్రభాకర్‌రెడ్డినా ?..సోలిపేట సతీష్..కా?
  • సోలిపేట ఫ్యామిలీ ప‌రిస్థితి ఏంటి!..కాంగ్రెస్..లో చెరుకుకు సీటు దక్కేనా..!
  • డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి దారెటు..
  • సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ కే బీజేపీ టికెట్ ఖాయం..
  • బీజేపీలో ర‌ఘునంద‌న్‌కు అసంతృప్తుల సెగ‌
  • ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో నిలిచేలా నేత‌ల ప్ర‌య‌త్నాలు..
  • దుబ్బాక నియోజక వర్గ ముఖచిత్రం..

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధిః మెదక్ ఉమ్మడి జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం ఒకప్పటి దొమ్మట నియోజక వర్గం. రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గం. ఒకప్పుడు పీపుల్స్ వార్ నక్సలైట్లు, జనశక్తి నక్సలైట్లకు పెట్టనికోట, సామాజిక సమస్యలపై రాజీలేని పోరాటం చేసేవి విప్లవ పార్టీలు. అదే చైతన్యం, విప్లవ భావాలను పుణికి పుచ్చుకున్న దివంగత మాజీ ఎమ్మెల్యే జర్నలిస్ట్ సోలిపేట రామలింగారెడ్డి సాధారణ వ్యక్తిగా ఒక బలమైన రాజకీయ నాయకుడు చెరుకు ముత్యం రెడ్డిపై 2004లో జరిగిన ఎన్నికల్లో 24 వేలకు పై చిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.

అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో దుబ్బాక కంచు కోట, కాషాయకోటగా మారింది. దుబ్బాక నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టికెట్ దక్కినప్పటికి, గులాబీ పార్టీ నాయకుల వెన్ను పోటు రాజకీయాలతో బీజేపీ అభ్యర్థి గా పోటీ చేసిన రఘునందన్ రావు స్వల్ప మెజారిటీతో విజయం సాధించి దుబ్బాక నియోజక వర్గంలో కాషాయ జెండా ఎగుర వేశారు.

ఒకప్పుడు టీడీపీ హాయంలో దొమ్మట ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన చెరుకు ముత్యంరెడ్డి సైతం నియోజ వర్గ అభివృద్ధికి కృషి చేశారు. అనారోగ్యంతో ముత్యం రెడ్డి మరణించగా, ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గా ఉప ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అప్పటి వరకు బీఆరెస్ లో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరి ఉప ఎన్నికల్లో టికెట్ సాధించి పోటీ చేశారు.

ఇద్దరు నేతల మరణానంతరం…

రామలింగారెడ్డి, ముత్యంరెడ్డి మరణానంతరం దుబ్బాక నియోజక వర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. అధికార పార్టీ లో సిద్దిపేట ఎంపీ గా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి అన్ని తానై నడిపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా బీఆరెస్‌ అధ్యక్షుడుగా సైతం కొనసాగుతున్నారు. సోలిపేట ఫ్యామిలీకి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్యలో విబేధాలున్నాయి. అధికార పార్టీలో దుబ్బాక నియోజక వర్గం నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.

ఇదే నియోజక వర్గం నుంచి స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు సోలిపేట సతిష్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు మంత్రి హరీశ్‌రావు కు సన్నిహితులే కావడం తో పార్టీ టికెట్ ఎవరికి లభిస్తుందో వేచి చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీలో టికెట్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కే దాదాపు ఖరారు అయిందని చెప్పాలి. ఆయన నియోజక వర్గంలో ఉండి గ్రామ గ్రామాన తిరుగుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు.

ఐనప్పటికీ ఇక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిన డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోకల్ లీడర్ మద్దుల సోమేశ్వర రెడ్డి సైతం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ నుండి పోటీ చేసిన ఫారుక్ హుస్సేన్ బీఆరెస్‌లో చేరగా, 2 సార్లు బీఆరెస్‌ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.

ఇప్పుడు ఆయనకు బీఆరెస్‌ పార్టీ మొండి చెయ్యి చూపింది. అలకతో ఉన్న పారుక్‌ హుస్సేన్ తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక్కడ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు కు బీజేపీ మళ్ళీ టికెట్ కేటాయించనుంది.

దుబ్బాకలో.. త్రిముఖ పోటీ

దుబ్బాకలో రాజకీయం వేడెక్కుతుంది. ఇటు అధికార పార్టీ, అటుప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్ర‌జ‌ల మెప్పు పొందేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు నేత‌ల మధ్య‌ల పోటీ న‌డుస్తుంది. అటు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న ర‌ఘునంద‌న్‌రావు కూడా కార్య‌క‌ర్త‌లతో వెన్నంటే ఉంటున్నాడు. కార్య‌క‌ర్త‌ల‌కు క‌ష్టం వ‌స్తే తానున్నంటూ భ‌రోసా క‌ల్పిస్తున్నాడు. కానీ ఇది పెద్ద నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో కొన్ని మండ‌లాల్లో ర‌ఘునంద‌న్‌రావు కు అసంతృప్తుల సెగ త‌గులుతుంది. మాజీ ఎమ్మెల్యే అర్ఎస్ వాసు రెడ్డి, నియోజక వర్గ బీజేపీ నేత గిరీష్ రెడ్డితో విబేధాలు ఉన్నాయి.

టికెట్ వేట‌లో..

తెలంగాణలో బీఆరెస్‌కు ఎదురేలేదన్న ఉద్దేశంతో ఉన్న ఆ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నిక రూపంలో షాక్ తగిలింది. బై ఎలక్షన్లలో బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందన్ రావు గెలుపొందడం అప్పుడు అధికార పార్టీలో ఉన్న అనైక్యతే కారణం అంటున్నారు.

ఆయన ఎన్నిక తర్వాత నియోజకవర్గంలో బీజేపీ పటిష్ట స్థితికి చేరింది. బీఆర్ఎస్ నుంచి పలువురు లీడర్లు బీజేపీలో చేరుతుండడంతో అధికార పార్టీ బలహీనపడుతోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

మరో వైపు మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోలిపేట సతీష్ సైతం ఆయన అనుచరులతో నియోజక వర్గంలో తిరుగుతున్నారు. దీనికోసం ఎంపీగా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన అనుచరులతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కొడుకు సతీశ్ రెడ్డి కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

గతంలో రామలింగారెడ్డి వెంట నడిచిన అనుచరులను కలుస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం చెరుకు శ్రీనివాసరెడ్డితో పాటు శ్రవణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతుండగా, ఇటీవలే కాంగ్రెస్ లో యాంకర్ కత్తి కార్తీక రంగ ప్రవేశంతో సీన్ మారింది.

ఉప ఎన్నికలో పోటీ చేసిన చెరుకు శ్రీనివాసరెడ్డి అనుచరులతో కలిసి నియోజకవర్గంలో జోరుగా ప‌ర్య‌టిస్తుండ‌గా, క‌త్తీ కార్తీక కూడా త‌గ్గ‌డం లేదు. క‌ష్టాల్లో ఉన్న కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌ను వ‌రుస‌గా ప‌రామ‌ర్శిస్తూ భ‌రోసా క‌ల్పిస్తుంది. దీంతో దుబ్బాక పై తాను ఎలాగైనా ప‌ట్టు సాధించే ప‌నిలో ప‌డింది. మ‌రో వైపు శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా రంగంలోకి దిగి క్యాడ‌ర్ పెంచుకునే ప‌నిలో ప‌డ్డారు.

ర‌ఘునంద‌న్ అస‌మ్మ‌తి రాగం

రాజకీయాల్లో ఎవరైనా మాటలతో కొడతారు.. రఘునందన్ మాత్రం లాజిక్కులతో కొడతారు. పక్కా లెక్కలు చూపించి మరీ.. ప్రభుత్వాన్ని నిలదీస్తుంటారు. 2020లో జరిగన ఉపఎన్నికలో దుబ్బాక నుంచి మొదటిసారి గెలిచిన రఘునందన్.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

అయితే ర‌ఘునంద‌న్‌కు మాత్రం గెలిచినప్ప‌టి నుంచి దుబ్బాకను పట్టించుకోకపోవడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గెలుపు కోసం పని చేసిన అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యర్తలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి.

రఘునందన్ రావు వ్యవహారశైలితో విసిగిపోయిన దుబ్బాక బీజేపీ శ్రేణులు తాజాగా అసమ్మతి రాగం వినిపిస్తున్నాయి. రఘునందన్ రావు నియోజకవర్గంలో తిరగడం లేదని, గెలిస్తే అన్ని పనులు ముందుండి చేపిస్తానన్న వ్యక్తి ఇప్పుడు కనీసం దుబ్బాక వైపు చూడటం లేదని వాళ్లు ఆరోపిస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదు. నిప్పు లేనిదే పొగరాదని.. రఘునందన్ రావు లోకల్ నాయకులను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని భావిస్తోంది. అందుకే దుబ్బాక విషయంలో అసమ్మతి నేతలతో కూర్చొని సమస్యను పరిష్కారం చేసుకోవాలని రఘునందన్ రావుకు సూచించినట్లు తెలుస్తుంది.

ఎంపీ నుంచి.. ఎమ్మెల్యే వైపు కొత్త చూపు

దుబ్బాకలో రఘునందన్‌రావును ఓడించేందుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని సిద్ధం చేశారు. ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.. దుబ్బాకలో పోటీ చేయడానికి అంతా ప్రిపేర్ చేసుకున్నారని తెలుస్తోంది. దుబ్బాకలో గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే దుబ్బాకలో పోటీకి కేసిఆర్ నుంచి కొత్త ప్రభాకర్ కు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రభాకర్ రెండుసార్లు ఎంపీగా గెలిచారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అంతే కాదు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మనసులో ఉన్న విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆర్‌ దృష్టి వరకు కొత్త ప్రభాకర్‌రెడ్డి తీసుకెళ్లారట.

ఈక్రమంలోనే మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి మళ్లీ దుబ్బాక నియోజకవర్గంపై తన ఇష్టాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే టికెట్ దక్కించుకొని పోటీ చేసి గెలవాలనే ధృడనిశ్చయంతో ఉన్నారట కొత్త ప్రభాకర్‌రెడ్డి.

అందుకు తగినట్లుగానే రెగ్యులర్‌గా నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్‌ని కలుపుకొని పోవడమే కాకుండా ప్రజల అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని సొంత వర్గమే ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న కొత్త ప్రభాకర్‌రెడ్డికి రెండు అంశాలు అనుకూలంగా ఉన్నాయి.

ఒకటి మంత్రి హరీష్‌రావుకు అత్యంత సన్నిహితుడు కావడం, రెండవది పార్టీకి అవసరమైన మేరకు నిధులు ఖర్చు పెట్టగలిగే సామర్ద్యం ఉన్న నేత కావడంతో పార్టీ అధిష్టానం కూడా టికెట్‌ కన్ఫామ్ చేస్తుందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. కాకపోతే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే .. మెదక్ ఎంపీ స్థానంలో అంతటి బలమైన నేత దొరకడం కూడా కష్టమే కదా అనే ఆలోచన కూడా చేస్తోందట.

ఎప్పటినుంచో ఎమ్మెల్యే కావాలనుకుంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అప్పటి నుండి పార్టీ కార్యక్రమం అయినా.. ప్రభుత్వ కార్యక్రమాలు అయినా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో కనిపిస్తున్నారు.

కాంగ్రెస్‌లో అశావహుల పోటీ

ప్రధాన ప్రతిపక్షం గా ఉన్న కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు వచ్చే ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమౌతున్నారు. దీంతో అనేక నియోజకవర్గాల్లో ఇద్దరు ,ముగ్గురు నాయకులు టిక్కెట్ రేస్ లోకి వచ్చారు. పోటీ చేయాలని భావిస్తున్న నాయకులంతా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

గత ఉపఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ సారి కూడా తనకే అవకాశం ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. దుబ్బాకలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకుగా శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ మంచి పట్టుంది. అన్ని మండలాల్లో ఆయనకు అనుచరులున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య నేతల ఆశీస్సులు కూడా శ్రీనివాస్ రెడ్డికి ఉన్నాయి. మరో వైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ రెడ్డి కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. నియోజకవర్గంలో తన వర్గంతో పార్టీ కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నారు.

గతంలో మెదక్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన దుబ్బాకలో కీలక నేతగా ఉన్నారు. అయితే శ్రావణ్ కుమార్ రెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఇదే సమయంలో కత్తికార్తీక కూడా దుబ్బాక కాంగ్రెస్ టిక్కెట్ తనదేనని స్పష్టం చేస్తున్నారు. ఆమె తన వర్గంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఉప ఎన్నికల్లో పార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసిన కత్తి కార్తీక కనీస ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు.

ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఆమె మధు యాష్కీ గౌడ్ సాయంతో దుబ్బాక టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కత్తికార్తీక కూడా మిగిలిన నాయకులతో కలవకుండా సొంతంగా పనిచేస్తున్నారు. మొత్తానికి దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ముక్కలుగా మారిపోవడంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు.

ఈ తతంగం ఎన్నికల వరకు కొనసాగే సూచనలున్నాయి. టిక్కెట్ ఎవరికి వస్తుందన్న దానిపైన ఆధారపడే మిగిలిన వారి రాజకీయ భవిష్యత్తు ఉండనుంది.. ఈ నియోజక వర్గంలో బీఎస్పీ, నూతనంగా పార్టీ పెట్టిన గద్దర్ పార్టీల నుండి కూడా అభ్యర్థులను నిలిపే అవకాశం ఉంది.

అన్ని పార్టీల కు అసమ్మతి.. బెడద..

ప్రధానంగా అన్ని ప్రధాన రాజకీయ పక్షాలలో పార్టీలలో అసమ్మతి బెడద ఉంది. బీఆరెస్‌లో కొత్త ప్రభాకర్ రెడ్డి, సోలిపేట సతీష్ వర్గాల మధ్య వైరం కొనసాగుతుంది. కాంగ్రెస్లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి మధ్యల పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్న స్థాయిలో విబేధాలున్నాయి.

సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు సైతం అసమ్మతి బెడద పొంచి ఉంది. 3 నెలల్లో జరగబోయే రాజకీయ కురుక్షేత్రంలో ఎవరికి ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్ కేటాయిస్తుందో.. ఎవరు బరిలో నిలుస్తారో .. ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో వేచిచూడాల్సివుంది.