Eatala Rajender | రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నాకు డ్రామాలు రావు.. ఫ్రస్టేషన్ లేదు: ఈటల

Eatala Rajender ఇందిర లాంటి నేతలకే ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు త్వ‌ర‌లో బీజేపీ పార్టీలో చేరికల వరద ప్రారంభం KCR ఫామ్ హౌస్ అమ్మి అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారా? KCR, KTR నియోజకవర్గాల్లోనే అభివృద్ధి పనులా? హుజురాబాద్ ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కట్టడం లేదా? ఇక్కడ రైతుకు నష్టం జరిగితే పట్టింపు లేదు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్నారు మానేరును చెరగబట్టారు అక్రమ ఇసుక తవ్వకాలు ఆపకపోతే […]

Eatala Rajender | రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నాకు డ్రామాలు రావు.. ఫ్రస్టేషన్ లేదు: ఈటల

Eatala Rajender

  • ఇందిర లాంటి నేతలకే ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు
  • త్వ‌ర‌లో బీజేపీ పార్టీలో చేరికల వరద ప్రారంభం
  • KCR ఫామ్ హౌస్ అమ్మి అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారా?
  • KCR, KTR నియోజకవర్గాల్లోనే అభివృద్ధి పనులా?
  • హుజురాబాద్ ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కట్టడం లేదా?
  • ఇక్కడ రైతుకు నష్టం జరిగితే పట్టింపు లేదు
  • పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్నారు
  • మానేరును చెరగబట్టారు
  • అక్రమ ఇసుక తవ్వకాలు ఆపకపోతే ప్రత్యక్ష కార్యాచరణ
  • హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

విధాత బ్యూరో, కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు ఆపకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని శాసనసభ్యుడు ఈటల రాజేందర్(Eatala Rajender) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లోయర్ మానేర్ కింద ఇసుక తీయడానికి ఆస్కారం లేకపోయినా, ముఖ్యమంత్రి సమీప బంధువు రవీందర్రావు ఓ ఆంధ్ర కాంట్రాక్టర్ ను తీసుకువచ్చి ఆయనకు ఇసుక కాంట్రాక్ట్ ఇప్పించారని ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

మానేరులో ఇసుక తవ్వకాల కారణంగా సమీపంలోని బోరు బావులు అన్ని ఎండిపోయాయని,
భవిష్యత్తులో స్థానిక అవసరాలకు ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. తరతరాలుగా తమకు ఉపాధి కల్పిస్తున్న మానేరును నాశనం చేయవద్దని ఈ ప్రాంత రైతులు కోర్టుకు వెళితే, కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయన్నారు.

స్థానిక పోలీసులు మామూళ్లకు ఆశపడి, అధికార పార్టీ నేతలకు విధేయులుగా మారి కాంట్రాక్టర్ల కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించిన రైతులపై కేసులు పెడుతున్నారని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని చల్లూరు, నరసింహులపల్లి, కల్లుపల్లె, కొండపాక గ్రామాలలో ఇసుక తవ్వకాలు వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ప్రభుత్వానికి ఓ విధానం ఉందా?

గతంలో ముఖ్యమంత్రులు సంబంధిత శాఖ అధికారులతో చర్చించి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వారని, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో చర్చించకుండా, నిబంధనలు పాటించకుండా, తాను చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలోని అధికారులు బసవన్నలుగా మారి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశం రాగానే
సంబంధిత అంశాలపై ఉత్తర్వులు జారీ చేస్తున్నారని చెప్పారు. పంటల సీజన్ లో ప్రభుత్వ సమీక్ష సమావేశాలు నిర్వహించి, పంట ఉత్పత్తులకు అనుగుణంగా పౌర సరఫరాల శాఖను సిద్ధం చేయాల్సి ఉండగా, కెసిఆర్ ప్రభుత్వంలో అలాంటివి ఏవీ జరగవున్నారు.

రైతుల ధాన్యం చేతికి వచ్చినా వారాల తరబడి ఐకెపి సెంటర్లు ప్రారంభించకపోవడం వల్ల,
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరిన టన్నుల కొద్ది ధాన్యం అకాల వర్షాలతో కొట్టుకుపోయిందని,
టన్నుల ధాన్యం తడిచిపోయిందని, ఇది ప్రభుత్వ అనాలోచిత విధానాలకు నిదర్శనం అన్నారు.
పంట ఎప్పుడు వస్తుందో చూడాలి తప్ప… ఐకెపి సెంటర్లు ప్రారంభించడానికి నాయకులు ఎప్పుడు వస్తారని చూడొద్దని ఆయన కలెక్టర్లకు చురకవేశారు.

కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, రైతుల నుండి ఒక్క గింజ లేకుండా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

జోరుగా చేరికలు

భారతీయ జనతా పార్టీలో ప్రతిరోజు కొన్ని వేలమంది చేరుతున్నారని, ఎన్నికల వరకు వేచిచూడాలనే
భావనలో అధికార పార్టీ నేతలు ఉన్నారని, కొద్ది రోజుల్లో పార్టీలో నేతల చేరిక వరదలా కొనసాగుతుందని చెప్పారు. చేరికలు అనేవి బిజెపి పార్టీలో మాత్రమే ఉన్నాయని చెప్పారు. తనకు డ్రామాలు చేయడం రాదని, ఫ్రస్టేషన్కు గురయ్యే పరిస్థితే లేదన్నారు.

సొంత రాష్ట్రంలో రైతులు చస్తున్నా పట్టింపు లేదు..

గత ఏడాది పంటలు నష్టపోయిన సందర్భంలో రాష్ట్ర మంత్రులు హెలికాప్టర్లలో తిరిగారు… కానీ ఒక్క రూపాయి రైతులకు ఇవ్వలేదు. గత మార్చిలో ముఖ్యమంత్రి స్వయంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు.. ఇప్పటికీ నయా పైసా పరిహారం రైతుల ఖాతాలోకి చేరుకోలేదు.. ప్రస్తుతం పంట నష్ట పరిహారం అంచనాల పేరిట అధికారులు తిరుగుతున్నారని ఆయన మండిపడ్డారు.

సొంత రాష్ట్రంలో రైతులు చనిపోతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోరని, వేరే రాష్ట్రాలకు వెళ్లి ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు సాయం చేయాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలకు ఎకరాకు 50,000, మిర్చి, మామిడి పంటలకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

వారి నియోజకవర్గాలలోనే అభివృద్ధి పనులు చేస్తారా?

రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్లాలని వీరికి అధికారమిచ్చారు… కానీ కెసిఆర్, కేటీఆర్ త‌మ నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.. ఇదో బుద్ధిలేని ప్రభుత్వం అంటూ ఈటల మండిపడ్డారు. రాష్ట్రం వాళ్ల తాత జాగీరు కాదని, ముఖ్యమంత్రి తన ఫామ్ హౌస్ అమ్మి అభివృద్ధి పనులకు నిధులు వెచ్చిస్తున్నట్టు ఫోజులు కొడుతున్నారని అన్నారు.

హుజరాబాద్ ప్రజలు కూడా ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారని, ఇక్కడి ప్రజల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాలను సమదృష్టితో చూడలేని ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు.

ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతున్నారు

ఇందిరా గాంధీ లాంటి గొప్ప నేతకే ఎమర్జెన్సీ విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చిన విషయం గుర్తు చేశారు. రాష్ట్రంలోనూ అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందన్నారు. ప్రజల చేతిలో ఓటమిపాలైన వారు అధికారాలు వెలగబెడుతుంటే, గెలుపొందిన వారిని కింద పడేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి చిల్లర వేషాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.