ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మళ్లీ ఈడీ నోటీసు

కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్య నోటీసుల వ్యవహారం కొనసాగుతూనే ఉన్నది

  • By: Somu    latest    Feb 22, 2024 11:45 AM IST
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మళ్లీ ఈడీ నోటీసు

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్య నోటీసుల వ్యవహారం కొనసాగుతూనే ఉన్నది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే పలుమార్లు ఈడీ నోటీసులు పంపినా.. వాటికి చట్టబద్ధత లేదంటూ కేజ్రీవాల్‌ తిరస్కరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా గురువారం మరోసారి ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నది.


కేజ్రీవాల్‌కు మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది ఏడోసారి. ఈ అంశం స్థానిక కోర్టులో ఉన్నందున తనకు నోటీసులు పంపడం సరికాదన్న కేజ్రీవాల్‌ వాదనతో ఈడీ అధికారులు విభేదిస్తున్నారు. తమ ఆదేశాలను కేజ్రీవాల్‌ పాటించడం లేదంటూ కోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణను మార్చి 16వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో వ్యక్తిగతం హాజరుకు మినహాయింపును ఇచ్చింది.