MLC Kavitha | బీఆరెస్ కవితకు ఈడీ నోటీసు.. నేడు విచారణకు రావాలని ఆదేశం
MLC Kavitha హాజరుకాలేనన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత తరపున ఢిల్లీకి ఆమె లాయర్లు మార్చిలో పలు దఫాలుగా విచారణ మొబైల్ ఫోన్లు సరెండర్ చేసిన కవిత చివరి రోజు విచారణలో హై డ్రామా ఇటీవల అప్రూవర్లుగా పలువురు కవిత బినామీగా చెప్పే పిళ్లై కూడా విధాత: లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇష్యూ సద్దుమణిగిందని భావిస్తున్న క్రమంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా సంచలనం రేపింది. శుక్రవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో […]

MLC Kavitha
- హాజరుకాలేనన్న బీఆరెస్ ఎమ్మెల్సీ
- కవిత తరపున ఢిల్లీకి ఆమె లాయర్లు
- మార్చిలో పలు దఫాలుగా విచారణ
- మొబైల్ ఫోన్లు సరెండర్ చేసిన కవిత
- చివరి రోజు విచారణలో హై డ్రామా
- ఇటీవల అప్రూవర్లుగా పలువురు
- కవిత బినామీగా చెప్పే పిళ్లై కూడా
విధాత: లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇష్యూ సద్దుమణిగిందని భావిస్తున్న క్రమంలో మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా సంచలనం రేపింది. శుక్రవారం ఢిల్లీలోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాల్సిందిగా కవితకు పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు. కవితకు బినామీగా ఈడీ అధికారుల చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లై, అంతకు ముందు మాగుంట శ్రీనివాసరెడ్డి రోజుల తేడాతో అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో కవితను విచారణకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
తెలంగాణలో అధికార బీఆరెస్‌తో లోపాయికారీ అవగాహన ఉన్నదని గట్టిగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఉభయ పార్టీలు కొంత సంయమనం పాటిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి రాజకీయ డ్రామాకు తెర లేచిందన్న అభిప్రాయాలు లేకపోలేదు. అయితే.. తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నదని, కనుక ఢిల్లీకి వెళ్లటం లేదని కవిత ప్రకటించారు. తన బదులు తన న్యాయవాదులు వెళతారని చెప్పారు.
అప్రూవర్లుగా మారిన నేపథ్యంలో నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్‌గా చెబుతున్న శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, దినేశ్ అరోరా, అరుణ్ రామచంద్ర పిళ్ళై అప్రూవర్ లుగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కవితకు నోటీసులు పంపడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతున్నది. రాజకీయ డ్రామానా? లేక హెచ్చరికగా కవితను పిలిపించారా? చర్యలు కూడా ఏమైనా ఉంటాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మార్చి నెలలో పలు దఫాలుగా కవితను ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారించారు. దర్యాప్తు సంస్థకు ఆమె తన మొబైల్ ఫోన్లను కూడా సరెండర్ చేశారు. గత విచారణ సందర్భంగా గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై తదితరుల స్టేట్మెంట్లను కవిత ఖండించారని ఈడీ వర్గాలు తెలిపాయి. కొందరు వ్యాపారులు, డీలర్లకు లబ్ధి చేకూర్చేలా 2021-22 ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారని, అందుకు ప్రతిగా డీలర్లు భారీగా ముడుపులు చెల్లించారనేది ఈడీ ఆరోపణ. దీనిని ఢిల్లీ అధికార పార్టీ ఆప్ తీవ్రంగా ఖండింది. ఈ పాలసీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేస్తూ.. దీనిపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు.
ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కవితతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్న బుచ్చిబాబు అనే వ్యక్తి స్టేట్మెంట్ను ఈడీ తీసుకున్నది. కవితకు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మధ్య రాజకీయ అవగాహన ఉన్నదని బుచ్చిబాబు చెప్పాడు. ఈ క్రమంలోనే కవిత ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి విజయ్‌నాయర్‌తో సమావేశాలు జరిపారని ఈడీ పేర్కొంటున్నది. లిక్కర్ పాలసీ రూపొందించే సమయంలో విజయ్ నాయర్ వివిధ మద్యం వ్యాపారులు, డీలర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపాడని పేర్కొంటున్నది.
కవిత మెంబర్‌గా ఉన్న సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు వంద కోట్లు ముట్టాయని ఈడీ ఆరోపిస్తున్నది. గోరంట్ల, పిళ్లైని సీబీఐ ఫిబ్రవరి, మార్చి నెలల్లో అరెస్టు చేసింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి కీలక సూత్రధారిగా ఈడీ పేర్కొంటున్నది. ఆయనను ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో తనకేమీ సంబంధం లేదని కవిత స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో దొడ్డిదోవన ప్రవేశించేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు..