Nayeem Case: నయీం కేసులో ఈడీ దూకుడు!

గ్యాంగ్ స్టర్ నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు చేపట్టింది. నయీం సదరు ఆస్తులను అక్రమంగా తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది.

  • By: Somu    latest    Apr 11, 2025 12:25 PM IST
 Nayeem Case: నయీం కేసులో ఈడీ దూకుడు!

Nayeem Case :  గ్యాంగ్ స్టర్ నయీంకు సంబంధించి 35 ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు చేపట్టింది. నయీం సదరు ఆస్తులను అక్రమంగా తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. 2022 మార్చిలో నయీం ఆస్తుల పై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
అప్పటి ఐటీ అధికారులు, సిట్ సమాచారంతో ఈసీఐఆర్(ECIR) నమోదు చేశారు. ఈసీఐఆర్ లో నయీం కుటుంబ సభ్యుల పేర్లను ఈడీ చేర్చింది. నయీం అక్రమాస్తుల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో నయీం బినామీల పేరు మీద ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, అగ్రికల్చరల్ లాండ్స్ ఉన్నాయి. జప్తు చేసిన ఆస్తుల విలువ సుమారు రూ.11.30 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నయీం పై అప్పట్లో బాధితుడు భువనగిరిలోని క్రిస్టియన్ గోస్పెల్ మిషన్ సెక్రటరీ ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. కాగా అక్రమాస్తుల రిజిస్ట్రేషన్ పై ఈడీ జారీ చేసిన నోటీసులకు నయీం కుటుంబ సభ్యుల నుంచి సమాధానం రాకపోవడం.. ఐటీఆర్ ఫైల్ చేయకపోవడంతో పాటు ఆస్తులు తమవే అని ఎవరు ముందుకు రాకపోవడంతో వాటిపై బినామీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఈడీ నిర్ణయించింది.

నయీం ఎన్​కౌంటర్..
మావోయిస్టుగా పనిచేసిన నయీం గ్యాంగ్ స్టర్ గా మారి పోలీసులతో కలిసి మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో కీలక భూమిక పోషించాడు. అనంతరం గ్యాంగ్ స్టర్ గా వ్యాపారులను, ప్రత్యర్థులను బెదిరించడంతో పాటు తన దారికి రాని వారిని అంతమొందించడం, కిడ్నాప్ లకు, బలవంతపు వసూళ్లకు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడ్డాడు. చివరకు తాము పెంచిపోషించిన నయీం రాజకీయ వ్యవస్థను కూడా శాసించడం మెుదలు పెట్టడంతో ప్రభుత్వం అతనిపై చర్యలకు సిద్ధపడింది. షాద్​నగర్ వద్ద జరిగిన ఎన్​కౌంటర్​లో నయీం మృతిచెందాడు. 2016 ఆగస్టు 8న ఎన్‌కౌంటర్ జరిగింది.

అనంతరం నార్సింగిలోని నయీం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా భారీగా ఆస్తులు వెలుగు చూశాయి. నయీం ఎన్​కౌంటర్ కేసును అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సిట్​కు అప్పగించింది. దర్యాప్తులో అతని బినామీల పేరు మీద ఉన్న ఆస్తులను కొన్నింటిని సిట్ గుర్తించింది. అయితే.. పలువురు బాధితులు సైతం నయీం తమ ఆస్తులను లాక్కున్నట్లు ఫిర్యాదు చేశారు. నయీం బినామీల పేరు మీద ఉన్న ఆస్తుల పత్రాలను సిట్ కోర్టులోనూ సమర్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పలు ఆస్తులను విక్రయించేందుకు నయీం భార్య పహీమ్ బేగం, అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ ఫహీమ్, నజీర్​లు ప్రయత్నించడంతో రాచకొండ పోలీసులు గతంలో వారిని అరెస్ట్ చేశారు. 2022లో నయీం అక్రమాస్తులపై విచారణ చేపట్టిన ఈడీ తాజాగా అతని కుటుంబ సభ్యుల పేరుమీదున్న అక్రమాస్తుల జప్తుకు నిర్ణయించింది. అలాగే నయీం సాగించి హవాల లావాదేవిలను కూడా విచారిస్తుంది.