డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే తెలంగాణకు మేలు: యూపీ సీఎం యోగి
తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరముందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

విధాత : తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరముందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శనివారం సిర్పూర్ కాగజ్‌నగర్, వేములవాడ, సనత్‌నగర్, గోషామహల్‌లలో బీజేపీ సభలలో యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణను భ్రష్టు పట్టించారన్నారు.
సీఎం కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాల యువత ఉద్యమ ఆకాంక్షలను విస్మరించి కుటుంబం బాగు కోసమే పనిచేశారన్నారు. బీఆరెస్ అంటే బ్రష్టాచార్ రిష్వత్ కోర్ సమితి అంటూ విమర్శించారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కేసీఆర్ అసమర్ద, అవినీతి పాలనతో తెలంగాణ అప్పుల పాలైందన్నారు.
కేంద్రంలోని ప్రధాని మోడీ 10 లక్షల ఉద్యోగాల హామీ మేరకు 6 లక్షలు ఇచ్చారని, మిగతా ఉద్యోగ కల్పన కూడా కొనసాగుతుందన్నారు. బీఆరెస్, కాంగ్రెస్ రహస్య మిత్రులని, వీరికి మధ్యలో ఎంఐఎం ఉందన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీఆరెస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.
2017 కంటే ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎలా ఉండేదో అందరికీ తెలుసని.. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక ఒక్క రోజు కూడా అల్లర్లు జరిగిన సందర్భం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని, తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని స్పష్టం చేశారు. మోడీ నేతృత్వంలో నడుస్తున్న భారత ప్రభుత్వంపై ఏ దేశం కూడా కన్నెత్తి చూడలేదన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే రామ మందిరం నిర్మాణం జరుగుతోందన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉంటే దేశ ప్రజలకు కరోనా ఫ్రీ వ్యాక్సిన్, ఉచిత బియ్యం వచ్చేది కాదన్నారు. కాంగ్రెస్, బీఆరెస్ , బీఎస్పీ అందరి ఎజెండా ఒక్కటే అని చెప్పారు. సొంత రాష్ట్రం అయిన యూపీలోనే బీఎస్పీకి కేవలం ఒక సీటు మాత్రమే ఉందని, ఓట్లను చీల్చేందుకే ఇక్కడ బీఎస్పీ పోటీ చేస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు రామరాజ్య స్థాపనకు, బీసీ సీఎం అయ్యేందుకు, దళిత, గిరిజన అభ్యున్నతికి బీజేపీని గెలిపించాలన్నారు.