ఎన్నికల హామీలు అమలు చేయాలి: BJP జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి
విధాత: టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. మిర్యాలగూడ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లా వాసులకు గత ఎన్నికల హామీల అమలులో టీఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇదే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ పార్టీ శ్రేణులు […]

విధాత: టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. మిర్యాలగూడ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.
జిల్లా వాసులకు గత ఎన్నికల హామీల అమలులో టీఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇదే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ పార్టీ శ్రేణులు ప్రచారం సాగించాలని పిలుపునిచ్చారు. పార్టీని బూత్ స్థాయి నుంచి నియోజవర్గ స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు స్థానిక నాయకత్వం కృషి చేయాలని కోరారు.
అన్ని వర్గాల ప్రజలను పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం చేసి రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు. అలాగే ఈ సమావేశంలోనే పలు ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేసి ఆమోదించారు. వాటిలో ప్రధానంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మేరకు రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేసి, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, దళిత , గిరిజన బంధు అమలు, గోల్లకురుమలకు ఇచ్చిన హామీలను, నిరుద్యోగ భృతి హామీలను అమలు చేయాలని బీజేపీ తీర్మానించింది.
జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లను వెంటనే పూర్తి చేయాలని, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, డిండి ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చొని పూర్తి చేస్తానన్న కేసీఆర్ హామీ మేరకు పనులు పూర్తి చేయాలని కోరింది. ఆ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి దేవరకొండ, మునుగోడు ప్రజలకు తాగు, సాగు నీరు అందించాలని పార్టీ కార్యవర్గం డిమాండ్ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్రవేశపెట్టడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ఆమోదించింది. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, పి.వి. శ్యాంసుందర్ రావు, వీరెల్లి చంద్రశేఖర్, నూకల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.