Elections | ఇద్దరికీ అగ్నిపరీక్షే! కేసీఆర్‌కు అసెంబ్లీ సవాలు.. మోదీకి లోక్‌సభ భయాలు
Elections | కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో మార్పు రాజకీయంగా పుంజుకుంటున్న కాంగ్రెస్ తమకు బలం లేదని ఒప్పుకొంటున్న బీజేపీ జాతీయ అంశాలను పక్కనపెట్టిన కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి అంశాలపైనే ప్రసంగాలు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు బంద్ జనంలో మార్పును సూచిస్తున్న కన్నడ ఫలితం నాలుగు అసెంబ్లీ ఎన్నికలు దాటడం మోదీకి కష్టమే! 23న పాట్నాలో విపక్షాల భేటీపై అందరి దృష్టి విధాత: కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చాయి. రెండు జాతీయ […]

Elections |
- కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో మార్పు
- రాజకీయంగా పుంజుకుంటున్న కాంగ్రెస్
- తమకు బలం లేదని ఒప్పుకొంటున్న బీజేపీ
- జాతీయ అంశాలను పక్కనపెట్టిన కేసీఆర్
- రాష్ట్రంలో అభివృద్ధి అంశాలపైనే ప్రసంగాలు
- ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికలు బంద్
- జనంలో మార్పును సూచిస్తున్న కన్నడ ఫలితం
- నాలుగు అసెంబ్లీ ఎన్నికలు దాటడం మోదీకి కష్టమే!
- 23న పాట్నాలో విపక్షాల భేటీపై అందరి దృష్టి
విధాత: కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చాయి. రెండు జాతీయ పార్టీలలో కాంగ్రెస్‌కు మొదటి నుంచీ ఇక్కడ బలమైన నాయకత్వం, కార్యకర్తల బలం ఉన్నది. అందుకే రెండుసార్లు ఎన్నికల్లోనూ ప్రధాన ప్రతిపక్షంగా ఆ పార్టీనే ప్రజలు ఎంచుకున్నారు. మూడోసారి అధికారం లోకి వస్తాం, వందకు పైగా సీట్లు గెలుస్తామని అధికార పార్టీ అగ్ర నాయకులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదన్నది బహిరంగ రహస్యమే.
బీజేపీ ప్రత్యామ్నాయం కాదని ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మురళీధర్‌రావుల ఇటీవల వ్యాఖ్యలతోనే తేలిపోయింది. అందుకే బండి సంజయ్ మొన్న 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను కేసీఆరే ఎంపిక చేస్తారని ఆరోపించారు. ఈ మధ్యకాలంలో బీజేపీ వేగంగా బలహీనపడుతున్నదని అన్న విషయాన్ని పక్కదోవపట్టించడానికే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నేతలకు దిశానిర్దేశం చేస్తూనే.. పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని సూచించింది. ఫలితంగానే ఆ పార్టీలో చేరేందుకు బీఆర్‌ఎస్, బీజేపీలో ఉన్న అసంతృప్త నేతలు, టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం 21 రోజులు వివిధ కార్యక్రమాలను తీసుకుని ఘనంగా నిర్వహిస్తున్నది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కొన్ని ప్రారంభోత్సవాలు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పది పదిహేను రోజులుగా చేస్తున్నప్రసంగాలు వింటే కాంగ్రెస్ పుంజుకుంటున్నదని అన్నది స్పష్టమైంది. వంద సీట్ల సంగతి ఏమో గాని మొదటిసారి గెలిచిన మెజారిటీ మార్కుకూడా కష్టమే అని ఇటీవల కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన సర్వేతో పాటు వివిధ సర్వేలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి.
అందుకే ఎమ్మెల్యేల పనితీరు మారాలని పదే పదే కేసీఆర్ హెచ్చరిస్తున్నారు. అధికారపార్టీలోనే నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రోడ్డెక్కుతున్నారు. ఇదంతా ఎన్నికల షెడ్యూల్ నాటికి పార్టీ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికే అంటున్నారు.
ఇవే కాదు సీఎం జాతీయ రాజకీయ అంశాల గురించి మాట్లాడటం మానేసి తెలంగాణ ఏర్పాటు కోసం బీఆర్‌ఎస్ చేసిన కృషి, రాష్ట్ర ఆవిర్భావానికి ముందున్న పరిస్థితులు, తమ తొమ్మిదేళ్ల పాలంలో సాధించిన ప్రగతి గురించి చెప్పుకొస్తున్నారు. తాను తెలంగాణ సాధించకపోయి ఉంటే ఈ గుణాత్మక మార్పు సాధ్యమయ్యేదా? ఈ సంక్షేమ పథకాలు, ఈ నూతన కలెక్టరేట్ల భవనాలు నిర్మాణమయ్యేవా? అని ప్రజలను ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి గత రెండు ఎన్నికల్లోనూ కేసీఆర్ నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా మరో నాయకుడు లేరు. దీంతో అధికారపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులపై అసంతృప్తి ఉన్నాకేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి వారిని గెలిపించారు. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్ అధినేతపైనే వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. అది ఆపార్టీని పూర్తిగా ఓడించగలిగే స్థాయిలో లేకున్నా ఆ పార్టీకి చాలా నష్ఠం కలిగించగలిగే స్థాయిలో ఉన్నది. ఇది బీఆర్‌ఎస్ శ్రేణులకు, నేతలకు మింగుడు పడకపోవచ్చు. కానీ వాస్తవాలు కొంత కఠినంగానే ఉంటాయి.
మరోవైపు బీజేపీలో చేరికలు ఆగిపోయి కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి కూడా అవి ఉండటం గమనార్హం. ఇది రాష్ట్రానికే పరిమితం కాదు. దేశ వ్యాప్తంగా బీజేపీపై ఉన్న ప్రజాగ్రహం కూడా కారణం. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై ఉన్న వ్యతిరేకత కంటే మోడీ సర్కార్‌పైనే ప్రజలు ఎక్కువగా ఆగ్రహంతో ఉన్నారు. కర్ణాటక ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ అది చూడబోతున్నారని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష నేతల ఐక్యతా రాగం ఇందుకు దోహదపడుతున్నది. అందుకే విపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు మోడీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఎన్నికల వాతావరణం రాగానే ప్రజలు చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారు. అది సోషల్ మీడియాలో జరిగే హడావుడి, వాట్సప్ యూనివర్సిటీ వదిలే అసత్యాలకు, కొన్ని జాతీయ మీడియాలో వెలువడే అంచనాలకు అందదు. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్‌కు, లోక్‌సభ ఎన్నికలకు మోడీకి అగ్నిపరీక్షగా మారబోతున్నాయన్నది మాత్రం వాస్తవం.