ఎగిరిన అసమ్మతి జెండా.. గోవా క్యాంపులో ఎల్లారెడ్డి కౌన్సిలర్లు!

అవిశ్వాసానికి రంగం సిద్ధం చైర్మ‌న్ ఒంటెద్దు పోక‌డ‌తో అస‌మ్మ‌తిలో కౌన్సిల‌ర్లు విధాత, నిజామాబాద్: మున్సిపల్ కౌన్సిళ్ల పాలకవర్గాల పదవీ కాలం మూడేళ్లు గడుస్తున్న నేపథ్యంలో చైర్మ‌న్‌లపై అసమ్మతి గళం వినిపిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్‌లో పలువురు కౌన్సిలర్లు అసమ్మతి కుంపటి రాజేసిండ్రు. కౌన్సిల్‌లో అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు బుధవారం గోవా క్యాంపునకు తరలి వెళ్లారు. గత కొంతకాలంగా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై అసమ్మతితో రగిలిపోతున్న పలువురు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు వేచి చూస్తున్నారు. […]

ఎగిరిన అసమ్మతి జెండా.. గోవా క్యాంపులో ఎల్లారెడ్డి కౌన్సిలర్లు!
  • అవిశ్వాసానికి రంగం సిద్ధం
  • చైర్మ‌న్ ఒంటెద్దు పోక‌డ‌తో అస‌మ్మ‌తిలో కౌన్సిల‌ర్లు

విధాత, నిజామాబాద్: మున్సిపల్ కౌన్సిళ్ల పాలకవర్గాల పదవీ కాలం మూడేళ్లు గడుస్తున్న నేపథ్యంలో చైర్మ‌న్‌లపై అసమ్మతి గళం వినిపిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్‌లో పలువురు కౌన్సిలర్లు అసమ్మతి కుంపటి రాజేసిండ్రు. కౌన్సిల్‌లో అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు బుధవారం గోవా క్యాంపునకు తరలి వెళ్లారు.

గత కొంతకాలంగా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై అసమ్మతితో రగిలిపోతున్న పలువురు కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు వేచి చూస్తున్నారు. మూడేళ్ల వరకు తీర్మానం పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో సమయం కోసం వేచివున్నారు. మూడేళ్లు పూర్తి కాగానే అవిశ్వాసానికి రంగం సిద్ధం చేశారు. చైర్మన్ తీరుపై పలుమార్లు కౌన్సిలర్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు ఫిర్యాదు చేశారు. కాగా పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు గోవాకు పయనమయి క్యాంపు నిర్వహిస్తున్నారు.

ఎల్లారెడ్డి మున్సిపల్ లో మొత్తం 12 మంది కౌన్సిల్లర్లుండగా 2/3 మెజారిటీకి సరిపోయే ఎనిమిది మంది కౌన్సిలర్లలో ప్రస్తుతం ఏడుగురు గోవా క్యాంపులో వున్నారు. 10వ వార్డు కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్, అల్లం శ్రీనివాస్ (1వ వార్డు), సంగని బాలమణి పోచయ్య(6వ వార్డు), నునుగొండ భూదేవి శ్రీనివాస్(8వ వార్డు), నీలకంఠం(12వ వార్డు), గాదె విజయలక్ష్మి తిరుపతి(9వ వార్డు), మహేశ్వరి విద్యాసాగర్(2వ వార్డు)లు గోవా క్యాంపులో ఉన్నట్లు సమాచారం.

గోవా క్యాంపు నుండి అందిన సమాచారం మేరకు చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఒంటెత్తు పోకడలతో సహించలేక పోతున్నామని, తాము ఓట్లు వేస్తేనే చైర్మ‌న్ అయిన విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని అసమ్మతి కౌన్సిలర్ల వాదనగా తెలిసింది. కొంతమంది కౌన్సిల్లర్లకు సంబందించిన పనులకు చైర్మన్ కుడుముల సత్యనారాయణ బుద్ధిపూర్వకంగానే ఆటంకాలు కల్పిస్తున్నట్లుగా అసమ్మతి కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. పనులు పూర్తి అయిన‌ వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో వివక్ష చూపుతున్నట్లుగా చైర్మ‌న్ పై అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది.

ఈ ఏడాది చైర్మన్ కుడుముల సత్యనారాయణ, వైస్ చైర్మన్ ముత్యాల సుజాతలపై అవిశ్వాసం పెట్టి వారిని పదవుల నుండి దింపడానికి క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. కౌన్సిలర్ల పట్ల చైర్మన్ వ్యవహ‌రిస్తున్న తీరు, అందుకు గల కారణాలను గత కొన్ని నెలలుగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

అయితే కౌన్సిలర్లు ఎమ్మెల్యే పట్ల పూర్తి విధేయతను ప్రదర్శిస్తూ చైర్మన్ పట్ల తమ వ్యతిరేకతను చాటుతున్నారు. త్వరలోనే కలెక్టర్ ను కలిసి అవిశ్వాసానికి సంబంధించిన నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వ‌సనీయంగా తెలిసింది.