నైపుణ్యాలతో జీవితంలో రాణించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యువత నైరాశ్యాన్ని వీడి నైపుణ్యాలు పెంచుకొని జీవితంలో రాణించేందుకు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు

నైపుణ్యాలతో జీవితంలో రాణించాలి : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

20కోట్లతో నిర్మించనున్న నాక్‌ భవనానికి శంకుస్థాపన

విధాత : యువత నైరాశ్యాన్ని వీడి నైపుణ్యాలు పెంచుకొని జీవితంలో రాణించేందుకు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డీజీ బిక్షపతి, కలెక్టర్ హరిచందన దాసరితో కలిసి నల్గొండలోని ఐటిఐ ఆవరణలో 20కోట్లతో నిర్మించనున్న నాక్ (జిల్లా వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం) బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ బిల్డింగ్ నిర్మాణానికి కావాల్సిన నిధులు, కోర్సులకు, పరికరాల విషయంలో రాజీ పడబోమన్నారు. నాక్‌ స్కిల్ సెంటర్లో మూడు నెలల కాల వ్యవధితో నైపుణ్యాలు పెంచుకునే కోర్సులను ఆఫర్ చేస్తున్నారన్నారు. కనీస విద్యార్హత ఐదవ తరగతి నుంచి టెన్త్‌, ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదివిన వారు స్వల్పకాలిక కోర్సులలో చేరి నైపుణ్యాలను పొంది జీవితంలో స్థిరపడాలన్నారు. కోర్సులు నేర్చుకునే వారికి ఎలాంటి ఫీజు ఉండదని బిల్డింగ్ పూర్తయిన తర్వాత హాస్టల్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు.


ప్రతి మూడు నెలలకు పూర్తయిన బ్యాచ్‌ల అభ్యర్థులకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అందుపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని అన్ని వృత్తులు గొప్పవని చెప్పులు కొట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడని చెబుతూ యువత చెడు వైపు పోకుండా నైపుణ్యాలు పెంచుకొని జీవితంలో రాణించాలన్నారు. కోర్సులకు సంబంధించిన మరిన్ని వివరాలకు నల్గొండ జిల్లా ఏడి రమేష్ కుమార్ ను 9618218230కు సంప్రదించాలన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌, ఎమ్మెల్యే బి. లక్ష్మారెడ్డి, ఎన్ఎసి డైరెక్టర్ రాజిరెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ అబ్బగాని రమేష్ గౌడ్, ఆర్‌ఆండ్‌బీ ఎస్‌ఈ రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ ఫర్జాన తదితరులు పాల్గొన్నారు.