కమిషన్‌ను ప్రక్షాళన చేయాలి

విధాత: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిల్సిమ్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి నిరుద్యోగ అభ్యర్థులు, పోటీ పరీక్ష నిపుణులు అందులోని లోపాలను ఎత్తిచూపుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక సర్వీస్ కమిషన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అలాంటిదేమీ లేదన్నది. అప్పుడే సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని, నిరుద్యోగుల సందేహాలపై సరిగ్గా స్పందించడం లేదని విమర్శలు వచ్చాయి.
చివరికి ఆ పరీక్షతో పాటు మరికొన్ని నోటిఫికేషన్లు రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జూన్ 11న నిర్వహించిన సమయంలో అయినా మొదటిసారి జరిగిన లోపాలు పునరావృతం కాకుండా మరింత పకడ్బందీగా నిర్వహించాలి. కానీ బయోమెట్రిక్ వివరాలు తీసుకోకుండా హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని పలువురు విద్యార్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు దీనిపై విచారణ చేపట్టి రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
సర్వీస్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు, గురుకులాల నోఫికేషన్లలో హరిజంటల్\ వర్టికల్ అంశంపై వివాదం నడుస్తున్నది. ఇటీవలే కోర్టు గురుకుల నియామకాల్లో హరిజంటల్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఈ విధానాన్ని అమలు చేయకపోతే త్వరలో జరగనున్న గ్రూఫ్-2, 3 పరీక్షలపై కూడా నిరుద్యోగులు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నది.
హరిజంటల్\ వర్టికల్ విధానంపై పక్కనున్న ఏపీ రాష్ట్రం 8 మందితో కూడా ఐఏఎస్ కమిటీ ఏర్పాటు చేసింది. వాళ్లు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం హరిజంటల్ విధానాన్ని అమలు చేస్తామని కోర్టుకు తెలిపారు. అందుకే అక్కడ ఇలాంటి వివాదాలు తలెత్తడం లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలాంటి సమీక్ష, కమిటీలు ఏర్పాటు చేయలేదు. కోర్టు ఆదేశించినా దీనిపై సమగ్ర విధానాన్ని రూపొందించలేదు.
సర్వీస్ కమిషన్ వ్యవహారం వల్ల ఇటు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు.కానీ ఏళ్ల తరబడి లక్షలు ఖర్చు పెట్టి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పనిచేయడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి కమిషన్‌ను ప్రక్షాళన చేయాలి. లేకపోతే ఇలాంటి ఘటనలే పునరావృతమవుతాయి. ఫలితంగా నిరుద్యోగులకు తీరని నష్టం జరుగుతుంది.
-ప్రభాకర్ చౌటి, పోటీ పరీక్షల నిపుణులు
మార్పు వస్తేనే పూర్వవైభవం
గ్రూప్-1 ప్రిలిమ్స్ మరోసారి రద్దు కావడం దురదృష్టకరం. కమిషన్ చేసే చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోకపోవడం వల్లనే ఇది పునరావృతమౌతున్నది. సర్వీస్ కమిషన్‌లో సరైన సాంకేతిక బృందం , సబ్జెక్ట్ నిపుణులు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి కారణం దీనివల్ల నిరుద్యోగ అభ్యర్థుల ఆత్మస్థైర్యం దెబ్బతింటున్నది. ఆర్థికశాస్త్రం నిర్వచనం ప్రకారం మార్పు జరిగితేనే అభివృద్ది. అందుకే సర్వీస్ కమిషన్ ముందుగా పేపర్ రూపకల్పనలో సరైన నిబంధనలు పాటించాలి.
అందులో ప్రధానంగా 25 శాతం సులభంగా, 25 శాతం కొంత కఠినంగా, 25 శాతం చాలా కఠినంగా, 25 శాతం అప్లికేషన్ పద్దతిలో రూపొందించాలి. అప్పుడే ఆ పరీక్షకు విశ్వసనీయత ఉంటుంది. పరీక్షలు నిర్వహించే సమయంలో యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలను అమలు చేయాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల పరిపాలనా విభాగంలోకి వచ్చేవారితో ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు రావు.
ఇంకో ముఖ్యమైన విషయం పరీక్షల తేదీలను ఖరారు చేసే సమయంలో ప్రతీ పరీక్షకు 3 నెలల సమయం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోపాటు వాటికి అనుబంధంగా వచ్చే ఇతర డీఎస్సీ, గురుకుల పరీక్షలు రాకుండా చూసుకోవాలి. ఇయర్ క్యాలెండర్‌ను కచ్చితంగా అమలు చేయాలి. అది ఏటా అయినా ఫరవాలేదు లేదా రెండేళ్లకు ఒకసారి అయినా ఫరవాలేదు.
అలాగే రాజ్యాంగబద్ధమైన ఈ కమిషన్‌లో రాజకీయ జోక్యం ఉండకుండా, అలాంటి నియామకాలకు అవకాశం ఇవ్వకుంటేనే పారదర్శకత నెలకొంటుంది. ప్రస్తుతం కమిషన్ పనితీరు మెరుగుపడాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులు, వివిధ పోటీ పరీక్షల సీనియర్ ఫ్యాకల్టీలతో ఒక రివ్యూ నిర్వహించాలి. దీనివల్ల క్షేత్రస్థాయి వాస్తవాలు ప్రభుత్వం దృష్టి వస్తాయి. ప్రభుత్వం ఈ పనిచేస్తే కమిషన్‌కు పూర్వవైభవం తప్పకుండా వస్తుంది.
– డాక్టర్ అల్లాడి అంజయ్య, పోటీ పరీక్షల నిపుణులు