ఇవి టాబ్లెట్లు కావు – చాక్‌పీస్ పౌడ‌ర్‌

తెలంగాణ‌ ప్ర‌భుత్వం ఓ కంపెనీ త‌యారుచేస్తున్న మందుల‌పై నిషేధం విధించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఈ మందుల‌కు దూరంగా ఉండాల్సిందిగా హెచ్చ‌రించింది

ఇవి టాబ్లెట్లు కావు – చాక్‌పీస్ పౌడ‌ర్‌

తెలంగాణ‌ ప్ర‌భుత్వం ఓ కంపెనీ త‌యారుచేస్తున్న మందుల‌పై నిషేధం విధించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఈ మందుల‌కు దూరంగా ఉండాల్సిందిగా హెచ్చ‌రించింది. పెను సంచ‌ల‌నం సృష్టించిన ఈ హెచ్చ‌రిక, రాష్ట్రంలోని అన్ని మందుల‌షాపుల‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.


హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని మెగ్ లైఫ్‌సైన్సెస్ అనే కంపెనీ త‌యారుచేస్తున్న మూడు ర‌కాల టాబ్లెట్లు, అవి:


1. ఎంపిఓడి-200 (MPOD 200)

2. మెక్స్‌క్లావ్‌-625 ( MEXCLAV 625)

3. సెఫాక్సిమ్‌-సివి (CEFOXIM-CV)


ఈ మూడింట్లో ఉన్న‌ది కేవ‌లం చాక్‌పీస్ పౌడ‌ర్ ఇంకా స్టార్చ్ మాత్ర‌మే అని రాష్ట్ర ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ ఒక ప్ర‌క‌ట‌నలో తెలిపింది. ఈ మందులు (?) ఆరోగ్యానికి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, వాటిని వాడొద్ద‌ని సంస్థ ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించింది. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని సిర్‌మౌర్ జిల్లాలో ఉన్న‌ట్లు చెప్పుకున్న ఆ కంపెనీ, అస‌లు లేనే లేద‌ని, అది ఒక ఫేక్ కంపెనీ అని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. నివ్వెర‌బోయే నిజాల‌ను బ‌య‌ట‌పెట్టిన తెలంగాణ ప్ర‌భుత్వ ఔష‌ధ నియంత్ర‌ణ సంస్థ ప్ర‌మాద‌క‌ర మందుల అల‌ర్ట్‌ను, స్టాప్ యూజ్ నోటీసుల‌ను రాష్ట్రంలోని అన్ని మందుల దుకాణాల‌కు, డాక్ట‌ర్ల‌కు పంపింది. వైద్యుల‌కు ఈ మందుల‌ను రాయొద్ద‌ని సూచించింది.


ఎంపిఓడి-200 కాంపోజిష‌న్‌లో సెఫోడాక్సిమ్ ప్రొక్సిటిల్ ఇంకా లాక్టిక్ ఆసిడ్ బాసిల‌స్‌, మెక్స్‌క్లావ్‌-625లో ఆమాక్సిలిన్, పొటాషియం క్లావుల‌నేట్ ఇంకా లాక్టిక్ ఆసిడ్ బాసిల‌స్‌, సెఫాక్సిమ్‌-సివి లో సెఫోడాక్సిమ్ ప్రొక్సిటిల్, పొటాషియం క్లావుల‌నేట్ ఇంకా లాక్టిక్ ఆసిడ్ బాసిల‌స్ ఉన్న‌ట్లుగా ఆ కంపెనీ చెప్పింది.

రిటైల్ డ్ర‌గ్ డీల‌ర్స్‌, హోల్‌సేల‌ర్స్‌ను ఈ మందుల అమ్మ‌కాన్ని, పంపిణీని వెంట‌నే నిలిపివేయాల్సిందిగా ఆదేశించడంతో పాటు ఎక్క‌డైనా, ఎవ‌రైనా ఈ మందులు అమ్ముతున్న‌ట్లు గానీ, పంపిణీ జ‌రుగుతున్న‌ట్లు గానీ క‌న‌బ‌డితే వెంట‌నే త‌మ‌కు తెలియ‌జేయాల్సిందిగా డిసిఎ సూచించింది. ఇందుకుగానూ, ఒక టోల్‌-ఫ్రీ నెంబ‌రు 1800-599-6969 ను కేటాయించింది.


దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇలా ఫేక్ ఔష‌ధాల రాకెట్ బ‌య‌ట‌ప‌డ‌టం ఇదే మొద‌టిది కాదు. గ‌త వారం కూడా తెలంగాణ డిసిఎ ఉత్త‌రాఖండ్‌లో ఇలాంటిడే ఒక రాకెట్ చేధించారు. ప్ర‌ముఖ కంపెనీలైన సిప్లా, గ్లాక్సో మందుల‌కు న‌కిలీల‌ను త‌యారుచేసే ఈ ముఠాను డిసిఎతో క‌లిసి హైద‌రాబాద్ పోలీసులు చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఐదుగురిని అరెస్ట్ చేసారు. న‌కిలీ మందులు త‌యారుచ‌సే ముఠాలు దేశ‌వ్యాప్తంగా చాలా ఎక్కువ‌య్యాయ‌ని పోలీసులు చెబుతున్నారు. వీటిని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వెంట‌నే అరిక‌ట్ట‌క‌పోతే ప్ర‌జ‌ల ప్రాణాలు గాల్లో క‌లిసిపోయే ప్ర‌మాద‌ముంద‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.