ప్రిన్సిపాల్ వేధింపులకు బెంబేలెత్తిన విద్యార్థినులు
విద్యార్థులను కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులకు విద్యార్థినులు బెంబేలెత్తారు

- కలెక్టర్ కార్యాలయం వరకు పరుగులు
- కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు
- ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: విద్యార్థులను కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కళాశాల ప్రిన్సిపాల్ వేధింపులకు విద్యార్థినులు బెంబేలెత్తారు. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నదని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇబ్బందులకు గురిచేస్తోందంటూ ఆరోపించారు. ప్రిన్సిపాల్ వైఖరికి నిరసనగా తమ వేదనను చెప్పుకునేందుకు కళాశాల నుండి కలెక్టరేట్ వరకు మూడు కిలోమీటర్లు పరుగులు పెట్టారు.
అనంతరం అక్కడే విద్యార్థినులు ధర్నా చేశారు. ఈ ఆందోళన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బూరుగు గూడ గ్రామ సమీపంలో తెలంగాణ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ దివ్యారాణి తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు నిరసనకు దిగారు.
ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఒక్కసారిగా విద్యార్థినులు కళాశాల హాస్టల్ నుండి ఆసిఫాబాద్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మూడు కిలోమీటర్ల దూరం పరుగులు తీశారు. కళాశాల ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయం వరకు వచ్చారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
న్యాయం చేసేవరకూ కదలం..
పనిష్మెంట్ పేరిట తమను ఇబ్బందులకు గురిచేస్తోందని విద్యార్థినులు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పై ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు కలెక్టర్ కార్యాలయం నుండి తరలివెళ్లేది లేదని పట్టుపట్టారు. ప్రిన్సిపాల్ దివ్యరాణిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమపై ఉమ్ముతుండటమే కాకుండా టీసీపై నాట్ క్వాలిఫై అని రాసిస్తానంటూ బెదిరిస్తోందని వాపోయారు. కనీసం భోజనం చేయడానికి సరైన ప్రదేశం లేదని, ఎక్కడబడితే అక్కడ కూర్చోని తింటున్నామని చెబుతున్నారు. అడిగితే తమనే దుర్భాషలాడారని విద్యార్థినులు తెలిపారు. రీజినల్ కోఆర్డినేటర్ కూడా కనీసం తమ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని, వచ్చినా విద్యార్థులను కలవడని, కేవలం ప్రిన్సిపాల్ చాంబర్ లోకి వెళ్ళి ఇద్దరే మాట్లాడుకొని వెళ్ళిపోతారని వాపోతున్నారు.
సమస్యలపై ప్రిన్సిపాల్ ను అడిగితే, తమను తీసిపారేసినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని, ఇక్కడ ఇలానే ఉంటుందని అవహేళన చేశారని ఆరోపించారు. సెక్రటరీకి చెప్పుకుంటారా? కలెక్టర్ కు చెప్పుకుంటారో చెప్పుకోండి అని ప్రిన్సిపాల్ మమ్మల్ని బెదిరిస్తున్నట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. మమ్మల్ని వేధిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రిన్సిపాల్ పై చర్య తీసుకునేంత వరకు కళాశాలకు వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు.