దీపం మంటలు రేపిన అగ్నిప్రమాదం.. దగ్దమైన 45 పూరిళ్లు
మేడారం జాతరకు వెళ్లేముందు సెంటిమెంట్‌గా ఇంట్లో దేవుడి ముందు వెలిగించిన దీపంతో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు ఆ కుటుంబాల నివాసాలను బుగ్గి చేశాయి

- మేడారం జాతరతో తప్పిన ప్రాణ నష్టం
విధాత : మేడారం జాతరకు వెళ్లేముందు సెంటిమెంట్‌గా ఇంట్లో దేవుడి ముందు వెలిగించిన దీపంతో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు ఆ కుటుంబాల నివాసాలను బుగ్గి చేశాయి. కరీంనగర్ జిల్లా ఆదర్శనగర్‌లో మంగళవారం ఉదయం సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ పూరింట్లో వెలగించిన దీపంతో చెలరేగిన మంటలతో ముందుగా ఆ గుడిసెలో సిలిండర్ పేలి చుట్టుపక్కల ఉన్న పూరిళ్లకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మొత్తం 8 సిలిండర్లు పేలాయి.
అయితే ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితులు మేడారం జాతరకు వెళ్లగా, జాతరకు వెళ్లే ముందు బాధితులు ఇంట్లో దీపం వెలిగించి వెళ్లారు. దీపం గుడిసెకు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఒకదానితో మరొకటి అంటుకోవడంతో గుడిసెలన్ని దగ్ధమయ్యాయి. మంటల్లో డబ్బు, నగలు మొత్తం కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు విషయం తెలుసుకుని ఆందోళనలో మునిగారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. పలు వేర్వేరు ప్రాంతాలకు చెందిన 45 కార్మిక కుటుంబాలు ఆదర్శనగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రమాద సమయంలో వారంతా మేడారం జాతరకు వెళ్లడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాద స్థలాన్ని సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, వారికి ఆర్ధిక సహాయంతో పాటు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.