సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో మంటలు
సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ బ్రాంచ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది

- ఉప్పల్‌లో బ్రాంచ్‌లో భారీ అగ్నిప్రమాదం
- తప్పిన ప్రాణ నష్టం.. భారీగా ఆస్తి నష్టం
విధాత: సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ బ్రాంచ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒకచోట మొదలైన మంటలు దుస్తువులను అంటుకొని క్షణాల్లో మాల్ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తుమంటలు చెలరేగిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు అగ్నిమాపక యంత్రాలతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. షాపింగ్ మాల్‌ను మూసివేశాక ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ, ఆస్తి నష్టం భారీగానే సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మాల్‌లోని చీరలు, దుస్తులు, వస్తువులు పెద్ద ఎత్తున కాలి బూడిదైనట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కోట్లరూపాయల్లో ఆస్తినష్టం ఉంటుందని అంచనా వేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటా, వేరే కారణాలేవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మాల్ సీసీఫుటేజీని సేకరించే పనిలో పడ్డారు.