వామ్మో.. ముక్కులో పొక్కులు గిల్లుకుంటే.. ఇంత డేంజరా?
కొంతమంది పదేపదే ముక్కులో వేలిని పెట్టి.. పొక్కులు గిల్లుకుంటూ ఉంటారు. చెప్పుకోవడానికి అసహ్యంగా ఉన్నా.. ఎండిపోయిన మ్యూకస్‌ను పెకళిస్తూ ఉంటారు

- ప్రోగ్రెసివ్ డిమెన్షియా వచ్చే అవకాశం ఉందన్న అధ్యయనం
- నాశికారంథ్రంలోకి క్రిములు చేరే చాన్స్
- వాటిని ఎదుర్కొనే క్రమంలో బీటా అమెలాయిడ్ విడుదల చేసే మెదడు
- అల్జీమర్స్‌కు దారితీసే డిమెన్షియాకు ఇదే మూల కారణం
- వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
సిడ్నీ: కొంతమంది పదేపదే ముక్కులో వేలిని పెట్టి.. పొక్కులు గిల్లుకుంటూ ఉంటారు. చెప్పుకోవడానికి అసహ్యంగా ఉన్నా.. ఎండిపోయిన మ్యూకస్‌ను పెకళిస్తూ ఉంటారు. ఒక్కోసారి యథాలాపంగా ఇది జరిగిపోతూ ఉంటుంది. అయితే.. ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొన్ని రకాల క్రిములు ముక్కులోకి ప్రవేశిస్తాయని, అది అల్జీమర్స్‌కు ప్రారంభానికి అవకాశం ఇస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రచురితమైన డజన్లకొద్దీ పరిశోధన పత్రాలను సమీక్షిస్తూ ఈ అధ్యయనం వెలువడింది.
మనం రోజువారీ జీవితంలో మన చేతులతో అనేక వస్తువులను తాకుతుంటాం. అది కారు స్టీరింగ్ కావచ్చు.. బైక్ హ్యాండిల్ కావచ్చు.. పని ప్రదేశాల్లో భారీగా క్రిములు ఉండే కంప్యూటర్ కీబోర్డు కావచ్చు.. వీటి ద్వారా మన చేతికి బ్యాక్టీరియా అంటుకుంటాయి. పదేపదే ఆ వేళ్లను ముక్కులో చొప్పించడం వల్ల కొన్ని రకాల క్రిములు నాశికా రంథ్రంలోకి ప్రవేశిస్తాయని, దీంతో మెదడు వాటిని ఎదుర్కొనేందుకు బీటాఅమెలాయిడ్ ఉత్పత్తి చేయిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది.
బీటా అమెలాయిడ్ అనేది అల్జీమర్స్‌కు కారణమయ్యే ప్రోగ్రెసివ్ డిమెన్షియాకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఘ్రాణ వ్యవస్థలోకి ప్రవేశించే రోగకారకాలతో పాక్షికంగా న్యూరోఇన్‌ఫ్లమేషన్ (అల్జీమర్స్ వ్యాధికారకం) కలిగే ఆస్కారం ఉన్నదని పరిశోధన నిర్ధరణకు వచ్చింది. ఇది మతిమరుపునకు దారి తీస్తుందని చెబుతున్నారు. శరీర నిర్మాణ వ్యవస్థకు, మెదడుకు నేరుగా ఉన్న సంబంధం కారణంగా.. రోగకారక అణువులు ప్రవేశించేందుకు ఘ్రాణ వ్యవస్థ ఒక మార్గంగా పనిచేస్తుందని అధ్యయనం పేర్కొంటున్నది.
మయో క్లినిక్ అంచనా ప్రకారం.. ఒక్క అమెరికాలోనే 65 ఏళ్ల వయసు పైబడిన సుమారు 65 లక్షల మంది అల్జీమర్స్ బారిన పడ్డారు. అందులో 70 శాతం మంది 75 ఏళ్ల వయసు పైబడినవారే. ప్రపంచవ్యాప్తంగా డిమెన్షియాతో బాధపడుతున్న 55 లక్షల మందిలో 70 శాతం మంది డిమెన్షియాతో ఉన్నవారే. తాజా అధ్యయనం వల్ల వృద్ధాప్యంలో మెదడులో కలిగే మార్పులు, జన్యుపరమైన పూర్వస్థితి, పర్యావరణ అంశాలు, జీవనశైలి తదితర అనేక అంశాలపై అవగాహనకు తోడ్పడుతుందని అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ పేర్కొన్నది.
సాధారణంగా ముక్కులో పొక్కులను తొలగించడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తొలగించినప్పటికీ.. అది ఆరోగ్యకరమైన పద్ధతిలో చేసుకోవాలని, ఎప్పటికప్పుడు ముక్కు చీదేయడం, నీటితో ముక్కును నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
చేతులు ఎంత పరిశుభ్రంగా ఉండాలనే విషయంలో కొవిడ్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని వెస్ట్ సిడ్నీ పరిశోధకుల నివేదిక గుర్తు చేసింది. ముక్కు విషయంలో కూడా ఇదే తరహా జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చింది.